గత దశాబ్ద కాలంగా కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తం చేసామని ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే చెబుతున్నారు. దేశం ఆర్థిక అభివృద్దిలో దూసుకుని పోతోందని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. వీటిని పట్టించుకోవడం లేదు. అంతెందుకు అంత్యోదయ అన్నయోజన కింద సరఫరా చేసే ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే డిసెంబర్ వరకు పొడిగించారు. అంటే పేదరికం ఉన్నట్లా లేనట్లా అన్నది గమనించాలి. ధరలు దాడులు చేస్తుంటే.. మధ్యతరగతి వారు కూడా పేదలుగా మారుతున్నారు. ఉప్పులు పప్పులు, బియ్యం ధరలు పెరుగుతున్నా కేంద్ర రాష్ట్రాలు వీటి గురించి పట్టించుకోవడం లేదు. ధరలను అదుపు చేసే ప్రయత్నాలు చేయడం లేదు. ధాన్యం రాశులు కుప్పలుతెప్పలుగా మూలుగుతున్నా బియ్యం ధరలు అదుపు కావడం లేదు. కూరగయాల ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. పప్పులు, ఉల్లిగడ్డలు, నూనెల ధరలు కూడా అడ్డూ అదుపులేకుండా పెరుగుతున్నాయి. ధరలను అదుపు చేసే విషయంలో కేంద్రం కనీసంగా అయినా రాష్ట్రాలతో మాట్లాడడం లేదు. ఎంతసేపు రాజకీయాలు, ఎన్నికల గొడవ తప్ప ప్రజల అవస్థలు పట్టడం లేదు. రాజకీయ అవినీతి కారణంగా ప్రజల సమస్యలు పక్కకు పోతున్నాయి. అలాగే రాజకీయ నాయకుల అవినీతిపై తక్షణం విచారణ జరిగేలా చట్టాల్లో మార్పులు రావాలి. సామాన్యులకు ఎలా అయితే చట్టబద్ద విచారణ సాగి, శిక్షలు పడుతున్నాయో రాజకీయాలను, పాలనను అడ్డం పెట్టుకుని కోట్లు గడిస్తున్న నాయకులకు కూడా అలాగే విచారణ జరగాలి. అందుకు తగ్గ కఠిన శిక్షలు పడాలి. ఇలాంటి సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. అక్రమంగా వేలకోట్లు సంపాదిస్తున్న వారంతా మహా నేతాలుగా చలామణి అవుతున్నారు.
ఇకపోతే రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడిన నేతలను విచారించి కఠినచర్యలు తీసుకునే అధికారం కేంద్రప్రభుత్వానికి ఉండాలి. కేంద్రంలో అవినీతి జరిగితే కూడా నేతలను తక్షణం విచారించే రాజ్యాంగ వ్యవస్థ రావాలి. ఎప్పటికప్పుడు సంస్కరణలు చేసుకుంటూ.. రాజ్యాంగాన్ని సవరించుకుంటున్న మనం ఈ విషయంలో కూడా సవరణలకు పూనుకోవాలి. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడం వల్ల ఆయా నేతల కారణంగా ఎక్కువ శాతం అవినీతికి ఆస్కారం ఏర్పడిరది. అలాంటి వారి పనిపట్టే చట్టబద్ద వ్యవస్థ ఉండాలి. రాజకీయ పార్టీల నేతల అవినీతిపై సత్వర విచారణకు సుప్రీం సూచించినా అడుగు ముందుకు పడడం లేదు. ఈ క్రమంలో రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. భారత జనాభా 140 కోట్లకు చేరిన క్రమంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడం లేదు. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల ఉత్పత్తి పెంచాలి. జనాభా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలి. పాలకుల్లో మార్పులు రావడం లేదు కనుక ప్రజల్లో చ్కెతన్యం రావాలి. ఒకే పార్టీలో ఉంటున్న కొందరు గుత్తాధిపత్యం చెలాయి స్తున్నారు. పాలనలో ఒక్కరే నిరంతరంగా ఉండే విధానం పోవాలి. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒక్కరినే నిరంతరంగా ఎన్నుకునే విధానం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వల్ల కొందరే అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఐదేళ్ల కాలానికి ఎన్నికైతే మరో ఐదేళ్ల అధికారం కోసం మాత్రమే వోటుబ్యాంక్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లో రొటేషన్ పద్దతి రావాలి. అమెరికా తరహాలో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఎన్నికల్లో పోటీచేసే విధానం రావాలి.
ఒక్కరే ఏళ్లతరబడి ఎంపిలుగా, ఎమ్మెల్యేలుగా గెలవకుండా రెండు టర్ముల కాలాన్ని పరిగణించాలి. దానిని కూడా నాలుగేళ్లకే కుదించాలి. ఈ మేరకు రాజ్యాంగంలో సవరణలు రావాల్సి ఉంది. అప్పుడే యువతకు అవకాశం వస్తుంది. యువత రాజీకాయల్లోకి వస్తేనే మార్పులు కూడా వస్తాయి. ఎన్నికల్లో పోటీ చేసేవారికి అర్హతలను కూడా నిర్ణయించాలి. ఇలా అర్హతలు లేకపోవడం వల్లనే స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందడం లేదు. కొందరే పాలకులుగా ఉంటూ..ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారు. అందుకే 77 ఏళ్ల స్వాతం త్రోత్సవంలో ఇంకా పేదలు పేదలుగానే ఉన్నారు. ఆకలి కోసం అలమటిస్తున్న వారు అలాగే ఉన్నారు. రాజకీయ నేతలు కూడా పేదల పేరు చెప్పి పబ్బం గడుపుకుంటున్నారు. ఇదంతా కూడా పాలకుల నిర్లక్ష్యంగానే చూడాలి. మనం వేసే వోటు సక్రమంగా పనిచేస్తుందా లేదా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. రాజకీయ నేతలను నిలదీయాలి. గ్రామస్థాయిలో నిలదీతలను ప్రజలు అలవర్చుకోవాలి. మన ఓటును ఆయుధంగా చేసుకుని దేశాన్ని సక్రంగా ముందుకు తీసుకుని వెళుతున్నారా లేదా అన్న ఆలోచన చేయాలి. ఏదో వోటేశామన్న నిర్లిప్త ధోరణి కారణంగా పాలకులు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకుని, అధికారం చేతబట్టి శాసిస్తున్నారు. వారి కుటుంబాలను యావత్తూ రాజకీయాల్లోకి దింపి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రజలను వోటుబ్యాంకుగా తయారుచేసుకుని వారిని మభ్యపెట్టడం అలవర్చుకున్నారు. ఎన్నికల అక్రమాల్లో ఆరితేరిన నేతలంతా పాలకులుగా పెత్తనం చెలాయిస్తున్నారు. వోట్లను కొనుగోలు చేయడం ఎలాగో నేర్చుకున్నారు. తమకు అనుకూలమైన ఎన్నికల అధికారులను, పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకుని వోట్లను వేయించుకుని ఎన్నికవుతున్నారు. ఈ విధానం పోవాలంటే ఎన్నికల్లో భారీ సంస్కరణలు రావాలి.
ఒక్కరే నిరంతరంగా సర్పంచ్ నుంచి ఎంపి వరకు ఎన్నికయ్యే పద్దతికి స్వస్తి పలకాలి. చట్టసభల్లో అమెరికా లాగా కేవలం రెండు పర్యాయాలు మాత్రమే పోటీచేసే అవకాశం మాత్రమే ఉండాలి. ఎంపి, లేదా ఎమ్మెల్యేగా గెలిచిన వారు రెండు టర్మ్‌లకు మించి పనిచేయకుండా చట్టబద్ద విధానం అమల్లోకి తీసుకుని రావాలి. అలాగే ఒక్కచోట నుంచి పోటీ చేసేలా కూడా మార్పులు రావాలి. జీవితాంతం ఒక్కరే ఎంపిగా లేదా ఎమ్మెల్యేగా ఉండే విధానం పోవాలి. దీనికి తక్షణ రాజ్యాంగ సవరణ అవసరం. దీనిపై ప్రజల్లో చ్కెతన్యం వస్తే తప్ప వారు ప్రజల సమస్యలను చర్చించారు. కొందరు నాయకులు మాత్రమే నిరంతరంగా అధికారాన్ని అడ్డం పెట్టుకునే ఆగత్యం ఉండదు. అలాగే కుటుంబంలో ఒక్కరికి ఒకే పదవి అన్న విధానం కూడా రావాలి. వారసత్వ రాజకీయాలను అడ్డుకోవడానికి ఇది దోహద పడగలదు. దేశంలోని యువత, మేధావులు దీనిపై చర్చచేయాలి. రాజకీయ అవినీతిని నిరోధించేలా రాజ్యాంగ సంస్కరణలకు శ్రీకారం చుడితేనే మన ప్రజాస్టామ్యానికి అర్థం ఉంటుంది. మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఇలాంటి విషయాల్లో ఎంతమేరకు సత్ఫలితాలు సాధించామో ప్రజలు, మేధావులు చర్చించావాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిరది. అలాగే కొందరే ఎల్లకాలం పాలకులుగా ఉండడంతో భారత పాలనా తీరులో మార్పు రావడంలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్నా అది కేవలం పాలకులకు మాత్రమే ఉపయోగపడుతోంది. ఈ రకమైన సంస్కరణలకు జనం ఉద్యమించాలి.
-రేగటి నాగరాజు
(సీనియర్ జర్నలిస్ట్)





