– మూడేళ్ల క్రితం ప్రమాదం
– కాలు కోల్పోయిన రవీష్ కోమటిరెడ్డి
– నేడు పారాలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధన
– ‘ఆటా’ ఆధ్వర్యంలో సన్మానం
– రూ.లక్ష ప్రోత్సాహకం
– పోలీసు ఉద్యోగం ఇవ్వాలి
– వి.జి.ఆర్ ఫౌండేషన్ విజ్ఞప్తి
ఖైరతాబాద్, నవంబర్ 23(ప్రజా తంత్ర): ఒకే తేదీతో ముడిపడిన విషాదం, విజయం.. మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయిన యువకుడు, అదే తేదీన అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణ పతకం సాధించి ఘన సన్మానం అందుకోవడం విశేషం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన రవీష్ కోమటిరెడ్డి దివ్యాంగతను అధిగమించి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చాడు. శ్రీలంకలోని రత్నపురిలో నవంబర్ 19 నుంచి 21 వరకు జరిగిన రెండో సౌత్ ఏషియన్ పారాలింపిక్ టోర్నమెంట్లో త్రోబాల్ విభాగంలో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రవీష్ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుపై భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా విజెఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రాంతీయ సమన్వయకర్త వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రవీష్ను ఘనంగా సత్కరించారు. ఆటా ట్రెజరర్, ట్రస్టీ శ్రీకాంత్ గూడపాటి చేతుల మీదుగా రూ.లక్ష నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవీష్‌కు శాలువా కప్పి, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రంతో అభినందించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతిభావంతులైన దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రవీష్‌కు ప్రభుత్వం పోలీసు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆటా ఆధ్వర్యంలో అమెరికా, భారత్‌లో విద్యార్థులకు ఆర్థిక సహాయం, పాఠశాలలకు అవసరమైన వస్తువుల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. శ్రీకాంత్ గూడపాటి మాట్లాడుతూ ప్రమాదంలో కాలును కోల్పోయినా ఆత్మవిశ్వాసంతో తిరిగి క్రీడల్లో రాణించి దేశానికి స్వర్ణ పతకం అందించడం గొప్ప విషయమన్నారు. రవీష్ యువతకు ఆదర్శంగా నిలిచాడని, ఇలాంటి క్రీడాకారులను ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
పోలీసు ఉద్యోగానికి ఎంపికై.. ప్రమాదంతో దూరమైన అవకాశం
2023 నవంబర్ 23న పాఠశాలకు వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలును కోల్పోయినట్లు రవీష్ తెలిపాడు. అప్పటికే పోలీసు ఉద్యోగానికి ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి చేసుకున్నానని, నియామక ఉత్తర్వులు అందుకునే సమయంలో ప్రమాదం జరగడంతో ఉద్యోగ అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ప్రోత్సాహంతో తిరిగి ధైర్యం తెచ్చుకుని క్రీడల్లో కొనసాగానని, ప్రస్తుతం రాయికల్‌లోని విజ్డమ్ హైస్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్నట్లు వివరించాడు. దివ్యాంగ క్రీడాకారులకు సరైన శిక్షణ, ఆర్థిక సహాయం, ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించగలరని రవీష్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు అండగా నిలిచిన వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ గూడపాటి, రామచంద్ర రెడ్డి, విజ్డమ్ హైస్కూల్ కరస్పాండెంట్ ఎం. రాజారెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒకే తేదీ.. విషాదం నుంచి విజయోత్సవం వరకు! 2023 నవంబర్ 23న ప్రమాదంలో కాలును కోల్పోయిన రవీష్.. సరిగ్గా మూడేళ్ల తర్వాత 2026 నవంబర్ 23న అంతర్జాతీయ స్వర్ణ పతక విజేతగా సన్మానం అందుకోవడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి, ఎం. రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




