క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ముఖ్యం

–ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న పురుషులు
–క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స
–పెద్దలకూ టీకాలు అవసరం
–పెద్దల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం
–కేర్ హాస్పిటల్స్ వైద్యులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23, 2026: ఆరోగ్య సమస్యల తొలి లక్షణాలను చాలామంది పురుషులు నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారని కేర్ హాస్పిటల్స్ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్, ప్రోస్టేట్ సమస్యలు, లైంగిక ఆరోగ్య సమస్యలు ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. పురుషుల ఆరోగ్య అవగాహన మాసం సందర్భంగా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, క్యాన్సర్లను తొలిదశలో గుర్తించడం, పెద్దలకు అవసరమైన టీకాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని సూచించారు.మారుతున్న జీవనశైలి, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పొగాకు వినియోగం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణంగా 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే పురుషులు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలు లక్షణాలు లేకుండానే గుండె, మెదడు, మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు.క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు

పురుషుల్లో నోటి, పెద్దపేగు, ప్రోస్టేట్ క్యాన్సర్లపై అవగాహన అవసరమని వైద్యులు తెలిపారు. నోటిలో పుండ్లు మానకపోవడం, మింగడంలో ఇబ్బంది, కారణం లేకుండా బరువు తగ్గడం, మలంలో లేదా మూత్రంలో రక్తం కనిపించడం, మలవిసర్జనలో మార్పులు, శరీరంలో అసాధారణ గడ్డలు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ముఖ్యంగా పొగాకు వినియోగించే వారిలో నోటి క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. క్యాన్సర్లను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉంటాయని తెలిపారు.
లక్షణాలు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తుంటారు   
– డాక్టర్ సౌమ్య బొండలపాటి
‘‘లక్షణాలు లేకపోతే ఆరోగ్యంగా ఉన్నామని చాలామంది పురుషులు భావిస్తుంటారు. కానీ మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ముఖ్యమైన అవయవాలను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. కారణం లేకుండా బరువు తగ్గడం, నిరంతర అలసట, మలవిసర్జనలో మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. పెద్దలకు అవసరమైన టీకాలపైనా అవగాహన తక్కువగా ఉంది. వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫ్లూ, హెపటైటిస్-బి, న్యుమోకాకల్ వ్యాధులు, షింగిల్స్ నివారణకు టీకాలు తీసుకోవాల్సి ఉంటుంది” అని తెలిపారు.
ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అప్రమత్తత అవసరం 
– డాక్టర్ సుశాంత్ కులకర్ణి
కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, అడ్వాన్స్‌డ్ లాపరోస్కోపిక్, రోబోటిక్ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ సుశాంత్ కులకర్ణి మాట్లాడుతూ 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రధానంగా ప్రోస్టేట్ గ్రంథి పెద్దదవడం (బినైన్ ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా – బీపీహెచ్), ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. బీపీహెచ్ అనేది క్యాన్సర్ కాని ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల అని వివరించారు. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం పెరుగుతుందన్నారు. ప్రోస్టేట్ గ్రంథి పెద్దదవడం వల్ల మూత్రనాళంపై ఒత్తిడి పెరిగి మూత్రధార బలహీనంగా ఉండటం, మూత్రవిసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది, తరచూ మూత్రం రావడం, రాత్రిపూట పలుమార్లు మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు.చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కొందరిలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో రాళ్లు, మూత్రం నిలిచిపోవడం, మూత్రపిండాల సమస్యలు తలెత్తవచ్చన్నారు. మందులు, ఆధునిక కనీస కోతల చికిత్సలతో ఈ సమస్యను నియంత్రించవచ్చని పేర్కొన్నారు.ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు ముఖ్యంగా 50 ఏళ్ల తర్వాత పెరుగుతుందని, వయసు పెరిగేకొద్దీ మరింత ఎక్కువవుతుందని డాక్టర్ సుశాంత్ వివరించారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా ఈ క్యాన్సర్ తొలిదశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. చాలామంది మూత్ర సంబంధిత సమస్యలను వయసుతో వచ్చే సాధారణ మార్పులుగా భావిస్తుంటారు. అయితే ఇవి ప్రోస్టేట్ గ్రంథి పెద్దదవడం (బీపీహెచ్) వల్ల కూడా రావచ్చు. బీపీహెచ్ క్యాన్సర్ కాదు. కానీ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండానే అభివృద్ధి చెందవచ్చు. అందుకే 50 ఏళ్లు దాటిన పురుషులు, కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్న 45 ఏళ్లు పైబడిన వారు యూరాలజిస్ట్‌ను సంప్రదించి పీఎస్ఏ పరీక్ష అవసరమా అనే విషయంపై సలహా తీసుకోవాలి. క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్సకు అవకాశాలు ఉంటాయి’’ అని తెలిపారు. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎస్ఏ) రక్తపరీక్ష, అవసరమైన వైద్య పరీక్షల ద్వారా ప్రోస్టేట్‌లో అసాధారణ మార్పులను గుర్తించవచ్చని తెలిపారు. అయితే ప్రతి ఒక్కరికీ ఈ పరీక్ష అవసరం ఉండదని, వయసు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత ముప్పును బట్టి వైద్యుల సలహాతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
టీకాలు చిన్నపిల్లలకే కాక పెద్దలకూ అవసరమని వైద్యులు తెలిపారు. వయసు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫ్లూ, టెటనస్-డిఫ్తీరియా బూస్టర్, హెపటైటిస్-బి, న్యుమోకాకల్, షింగిల్స్ టీకాలు తీసుకోవాలని సూచించారు.ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, ఆందోళన, కుంగుబాటు, నిద్రలేమి పురుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవాలన్నారు.క్రమం తప్పకుండా రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని, వయసు, వ్యక్తిగత ముప్పును బట్టి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. రోజూ వ్యాయామం చేయడం, పొగాకు మానేయడం, మద్యపానాన్ని పరిమితం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరమన్నారు. వ్యాధి ముదిరే వరకు వేచి చూడకుండా తొలి లక్షణాలు కనిపించినప్పుడే వైద్యులను సంప్రదించాలని కేర్ హాస్పిటల్స్ వైద్యులు సూచించారు. ముందస్తు పరీక్షలు, అవసరమైన టీకాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితో అనేక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని తెలిపారు.

————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *