– వరుసగా రెండుసార్లు మంత్రిగా కొనసాగడం సరికాదు
– బీహార్ మంత్రి దీపక్ ప్రకాశ్‌ను ఉద్దేశించి సుప్రీం వ్యాఖ్యలు
న్యూదిల్లీ, జూలై 30 : ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఇంకెంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఆ పదవిలో కొనసాగించడంపై సమాధానం చెప్పాలని సమ్రాట్ చౌధరీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాధారణంగా ఎన్నికల్లో గెలవని వ్యక్తులు రాష్ట్ర మంత్రిగా నియమితులైతే వారు ఆరు నెలల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలివాల్సి ఉంటుంది. లేదా శాసనమండలి సభ్యుడిగానైనా ఎన్నిక కావాలి. కానీ దీపక్ ప్రకాశ్ 2025 నవంబర్‌లో పంచాయతీరాజ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలుత ఏప్రిల్ 25, వరకు మంత్రిగా కొనసాగారు. అప్పుడు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో క్యాబినెట్ మొత్తం రద్దయింది. తర్వాత సమ్రాట్ చౌధరీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా దీపక్ మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మధ్యలో 22 రోజులు ఏ పదవిలో లేరు. అంటే నిరవధికంగా ఆరునెలలపాటు దీపక్ మంత్రిత్వ బాధ్యతల్లో లేనట్లయ్యింది. ఇక్కడ ఒకే మంత్రి విషయంలో ఆరు నెలల గడువును రెండుసార్లు వినియోగించడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీపక్ ఎన్నికల్లో గెలవకపోయినా ఆయనను రెండోసారి మంత్రిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది రాజ్యంగాన్ని మోసం చేయడమే అవుతుందని, మంత్రి పదవి కేటాయింపు చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చట్టాన్ని ప్రశ్నించడమే అవుతుంది. ఎన్నిక కాకుండా ఒక మంత్రిని ఆరు నెలలకు పైగా ఎలా కొనసాగిస్తున్నారనే దానిపై సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం బిహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదావేసింది. ఇదిలా ఉంటే ప్రమాణస్వీకారం సమయంలో కూడా దీపక్ వార్తల్లో నిలిచారు. ప్రముఖ నాయకులంతా కుర్తా, పైజామా, ధోతీలతో రాగా దీపక్ మాత్రం చాలా డిఫరెంట్‌గా క్యాజువల్ షర్ట్, ప్యాంట్ ధరించిన ఆయన అదే వేదికపై ఉన్న ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రీయ లోక్ మోర్చా చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా కుమారుడే ఈ దీపక్. ఆయన తల్లి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





