– ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం సాధనలో తొలి రాష్ట్రంగా తెలంగాణ
– రైతులకు సులభతరమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం(ఎస్ఎఎస్సీఐ) పథకం కింద ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహక (ఎస్సీఏ) రూపంలో రూ.1,087.64 కోట్ల నిధులను అందుకుని దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు అమలు చేసిన వినూత్న విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా సాధించిన పురోగతికి ఈ గుర్తింపు నిదర్శనమన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వ సేవలను రైతులకు మరింత చేరువ చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందించే సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతికి కేంద్రం నుంచి ఈ ప్రోత్సాహకం లభించిందన్నారు. 2025-26కి సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి రైతుల ఫార్మర్ ఐడీలను నమోదు చేసినందుకు రూ.422.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయ నిధులను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 26న విడుదల చేసిందని మంత్రి వివరించారు. అలాగే 2026-27లో కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్ ద్వారా ఎరువుల పంపిణీని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేసినందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆమోదించిన రూ.665 కోట్ల ప్రోత్సాహక నిధులు మూడు విడతల్లో పూర్తిగా విడుదలయ్యాయని తెలిపారు. ఈ విధంగా రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి రాష్ట్రానికి మొత్తం రూ.1,087.64 కోట్ల ప్రత్యేక కేంద్ర సహాయం లభించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు మూడు దశల్లో ఎఫ్ఎస్ఎస్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశామని మంత్రి తెలిపారు. తొలుత రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి అనంతరం 50 శాతం జిల్లాలకు విస్తరించి చివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేశామన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతుల వివరాలు సమగ్రంగా అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు వీలవుతోందని మంత్రి తెలిపారు. ప్రస్తుత యాసంగి సీజన్లోనూ రైతులకు ఎరువులు సులభంగా అందించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా పంటల కొనుగోలు సమయంలో కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఉపయోగపడుతుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటను సులభంగా విక్రయించేందుకు దోహదపడుతుందని వివరించారు. వ్యవసాయ రంగంలో రాష్ట్రం సాధించిన ఈ ఘనత వెనుక వ్యవసాయ శాఖ అధికారుల సమిష్టి కృషి ఉందంటూ అధికారులను, సిబ్బందిని మంత్రి తుమ్మల అభినందించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. కేవలం నిధులు సాధించడమే కాక ఆ విధానాల ద్వారా రైతులకు వాస్తవ ప్రయోజనాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
రైతుల అనుభవాలు
నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు వంచర్ల అవినాష్ కు సర్వే నంబర్లు 62, 47లో మొత్తం 2 ఎకరాల 10 గుంటల భూమి ఉంది. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ పొందిన ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ఉండటం వల్ల తాను పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల్లో సులువుగా అమ్ముకోగలుగుతున్నానని చెప్పారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన రైతు వింజం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ వానాకాలంలో కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా ఎరువులను అతి సులభంగా బుక్ చేసుకొని పొందినట్లు తెలిపారు. మూడు ఎకరాల 10 గుంటల్లో వరి సాగు చేశాను.. ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి కలిగి ఉండడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా పంటలకు కావాల్సిన ఎరువులను అతి సులభంగా బుక్ చేసుకొని పొందగలిగాను అని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





