నాగార్జునసాగర్ నుంచి ఏపీ జల దోపిడీ

– తొమ్మిది టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర
– ఏడాదిగా సొరంగం తవ్వుతున్నా నోరెత్తని రేవంత్ ప్రభుత్వం
– రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న వైనం
– చంద్రబాబు, మోదీలను ప్రసన్నం చేసుకునే యత్నం
– నీటి హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తాం
– ప్రజా ఉద్యమం తప్పదు
– బీఆర్ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18:  నాగార్జునసాగర్‌లో భారీ సొరంగం నిర్మించి తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి పాల్పడే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాగునీటి పథకం పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా డెడ్ స్టోరేజ్ నుంచి 9 టీఎంసీల నీటిని తరలించేందుకు కుట్ర జరుగుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ వద్ద ఏడాదిగా సొరంగం తవ్వుతూ, విజయపురి సౌత్ వద్ద 510 అడుగుల దిగువన నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. 18 గంటలు పనిచేస్తానని చెప్పుకునే ముఖ్యమంత్రికి ఇంత పెద్ద ప్రాజెక్టు ఏడాదిగా జరుగుతున్న విషయం తెలియదా? ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇవ్వలేదా? నీటిపారుదల శాఖ అధికారులు నివేదికలు అందించలేదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి తెలిసే ఈ వ్యవహారం జరుగుతోందని, తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తాగునీటి పథకం పేరుతో 1,650 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. పేరుకు తాగునీటి పథకమైనప్పటికీ, దాని ముసుగులో సాగునీటిని కూడా తరలించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, తెలంగాణకు చెందిన నీటి హక్కులను దెబ్బతీసే విధంగా ఈ నిర్మాణాలు చేపడుతున్నారని విమర్శించారు. గతంలో సమైక్య పాలనలో పోతిరెడ్డిపాడు వద్ద గండి కొట్టి శ్రీశైలం నుంచి నీటిని తరలించారని, ఇప్పుడు నాగార్జునసాగర్ వద్ద అదే తరహా జలదోపిడీకి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆనాడు ఆంధ్ర పాలకులు చేసిన ద్రోహం కంటే నేడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మరింత తీవ్రమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ నుంచి డెడ్ స్టోరేజ్ నీటిని తరలించే ప్రయత్నాలు జరుగుతుంటే నల్గొండ జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులకు నష్టం కలిగించే ఈ వ్యవహారానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారాలు తెరిచిందని, ముఖ్యమంత్రి వ్యక్తిగత బలహీనతలు దీనికి కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ను సాగునీటి సలహాదారుగా నియమించుకోవడంపై కేటీఆర్ ప్రశ్నలు లేవనెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన ఆయన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించిన వ్యక్తిని రాష్ట్ర సాగునీటి సలహాదారుగా ఎందుకు నియమించుకున్నారు.. ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకున్నారు.. అని ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎన్సీ రమేశ్ బాబు పదవీ విరమణ అనంతరం ఏడాదిపాటు పొడిగించి తిరిగి నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన అధికార వ్యవస్థలో ఇలాంటి నిర్ణయాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద తెలంగాణ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో వెల్లడించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు కేటాయించాలని, ఏపీ చేపడుతున్న నీటి తరలింపును అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారా లేదా స్పష్టం చేయాలన్నారు. హైదరాబాద్‌తోపాటు పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు కృష్ణా జలాల కేటాయింపులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ఏపీ నీటి తరలింపుపై అక్టోబర్‌కు ముందే ప్రభుత్వం మేల్కొందా.. కేఆర్ఎంబీ వద్ద కనీసం నిరసన తెలిపిందా.. తెలంగాణకు నీటి హక్కులు కాపాడేందుకు ఏ కార్యాచరణ రూపొందించింది అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీలో తెలంగాణకు సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేయాలని, ఏపీ చేపడుతున్న అక్రమ నీటి తరలింపు ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో నీటి కొరత ఉందని ముఖ్యమంత్రి చెబుతుంటే, నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం నీటి కొరత లేదని ప్రకటించడం ప్రభుత్వ గందరగోళానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో సుమారు 2.50 లక్షల వాటర్ ట్యాంకర్లు బుక్ అయ్యాయని, రోజుకు దాదాపు 8 వేల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. నీటి కొరత కారణంగా విద్యాసంస్థలు, హాస్టళ్లకు సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితుల్లో మంత్రి మాత్రం నీటికి కొరత లేదని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. హైదరాబాద్ ప్రజల నీటి కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ పైన కేవలం 3.5 టీఎంసీల నీరు మాత్రమే తాగునీటి అవసరాలకు అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో, నాగార్జునసాగర్ నుంచి 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నాలను ఎలా సమర్థిస్తారని నిలదీశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల తాగునీటి అవసరాలకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిందని గుర్తు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణకు నీటి విషయంలో న్యాయం జరగదని కేసీఆర్ ముందుగానే గుర్తించి స్వరాష్ట్రం కోసం పోరాటం చేశారని అన్నారు.
1930లోనే నల్లగొండ జిల్లాలో ఏలేశ్వరం వద్ద 161 టీఎంసీల సామర్థ్యంతో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును ప్రతిపాదించారని, డీపీఆర్ కూడా సిద్ధమైందని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే ఈ ప్రాజెక్టును కిందికి మార్చి నందికొండ వద్ద నాగార్జునసాగర్ నిర్మాణానికి ప్రతిపాదించడం తెలంగాణకు జరిగిన తొలి ద్రోహమని విమర్శించారు. తెలంగాణకు 8.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నేటికీ ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు అందడం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం 15.5 లక్షల ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టు రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. స్థిరీకరించిన ఆయకట్టులో తెలంగాణకు 28 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 72 శాతం ఉందని తెలిపారు. తెలంగాణకు అన్యాయం చేసింది మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు.
కృష్ణా నది పాలమూరు జిల్లాలో సుమారు 300 కిలోమీటర్లు ప్రవహిస్తున్నా, ఆ జిల్లాకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కేటీఆర్ అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం పాలమూరుకు 174 టీఎంసీల సాగునీరు గ్రావిటీ ద్వారా అందించే అవకాశం ఉన్నా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాయని విమర్శించారు. 1981లో జూరాల ప్రాజెక్టుకు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా శంకుస్థాపన చేసినప్పటికీ, చివరకు లక్షా పది వేల ఎకరాలకు కుదించారని తెలిపారు. ఆర్డీఎస్ కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, నేడు కేవలం 15 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి ఆర్డీఎస్ ఆయకట్టును కాపాడిందని గుర్తు చేశారు.కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు, నల్గొండ జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశాయని, నల్లగొండకు సాగునీరు అందించకుండా ఫ్లోరోసిస్ సమస్యను మిగిల్చాయని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి పాలమూరు, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించేందుకు కృషి చేశామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ హయాంలో పాలమూరులో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం వల్ల వలసలు తగ్గి, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. 2015 జూన్ 11న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, వట్టెం, కరివెన, ఏదుల, ఉద్దండాపూర్, నార్లాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేశామని తెలిపారు. కాలువలు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేసిందని విమర్శించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కాలువల పనులను ఎందుకు నిలిపివేశారు? ఏ కారణంతో టెండర్లు రద్దు చేశారు? అని ప్రశ్నించారు. ఆ పనులు పూర్తి చేసి ఉంటే శ్రీశైలం నుంచి పాలమూరుకు సాగునీరు అందేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతో ప్రాజెక్టును పడకేయించిందని ఆరోపించారు. ప్రాజెక్టుల పంపులు ఆన్ చేయకుండా కృష్ణా నదిలో వచ్చిన సుమారు 250 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు, సముద్రానికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీటిని తరలిస్తుంటే, కృష్ణా నదికి సమీపంలో ఉన్న పాలమూరు జిల్లాకు సాగునీరు అందించలేకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని అన్నారు. కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేయాలని అధికారులు సూచించినా, వారికి బెల్ట్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణమని విమర్శించారు. కరువు వస్తుంది, పంటలు ఎలా పండించాలని రైతులు ఆందోళన చెందుతుంటే బీఆర్ఎస్ నాయకుల రక్తం చల్లాలని మాట్లాడటం ముఖ్యమంత్రి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని, చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి హక్కుల విషయంలో మౌనం పాటిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసి నాగార్జునసాగర్‌లో తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. సాగర్‌లో ఇంత పెద్ద నీటి దోపిడీ జరుగుతున్నా తెలంగాణకు చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అక్రమ నీటి తరలింపు ప్రయత్నాలను అడ్డుకునే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని కేటీఆర్ స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రైతులను, ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామని, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ నీటి హక్కుల కోసం ఉద్యమ కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ తరఫున లేఖ రాస్తామని, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామని వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *