– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
– ఎన్ఎఎల్ఎస్‌ఏ దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు హైదరాబాద్‌లో ప్రారంభం
– ఉచిత న్యాయ సేవల కోసం సంచార లోక్ అదాలత్ వాహనాలు ప్రారంభం
– సైబర్ హెల్ప్‌లైన్ ‘1930’, చైల్డ్ హెల్ప్‌లైన్ ‘1098’ పై అవగాహన పెంచాలి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: పిల్లల ఆన్‌లైన్ భద్రతను రక్షించేందుకు తెలంగాణ హైకోర్టు, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థలతో చర్చించి సమగ్ర చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా శనివారం ప్రారంభమైన దక్షిణ మండల ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్ఫూర్తితో పేదలు, బలహీన వర్గాలకు న్యాయాన్ని ఒక ఆయుధంగా అందించేందుకు న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని కొనియాడారు. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకూడదనేది తమ ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ అమాయకులైన పిల్లలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడే ప్రమాదం ఉందన్నారు. ఈ సదస్సుకు పిల్లల సైబర్ భద్రత అనే చాలా ముఖ్యమైన అంశాన్ని ఎంచుకున్నందుకు జస్టిస్ విక్రమ్ నాథ్ కి, ఎన్ఏఎల్ఎస్ఏకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. కానీ తమ పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారు అనేది చాలామంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలను ఎంతో సులభం చేశాయి. ప్రపంచంలోని సమాచారం మన చేతిలోకి వచ్చింది. ఎక్కడున్న వారితోనైనా, ఎప్పుడైనా మాట్లాడగలుగుతున్నాం. కానీ పిల్లలు అమాయకులు. ఏది నిజం? ఏది అబద్ధం? ఏది మంచిది? ఏది ప్రమాదకరం? అన్నది వారు వెంటనే గుర్తించలేరు. తెలియక పిల్లలు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. వాటి ప్రభావం పిల్లలపైనే కాదు.. వారి కుటుంబాలపై, సమాజంపై కూడా పడుతుంది. ఇంటర్నెట్ ఈ నేరాలను సృష్టించలేదు. కానీ నేరాలను ప్రపంచవ్యాప్తంగా చేయడం మరింత సులభం చేసింది. తల్లిదండ్రులకు ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. భయంతో పిల్లలు తమ సమస్యలను ఎవరికీ చెప్పలేకపోవచ్చు. అందుకే పిల్లలపై సైబర్ నేరాలను ఎలా అరికట్టాలి? మన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచాలి? బాధిత పిల్లలకు న్యాయం ఎలా అందించాలి? మన ముందున్న ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో అవగాహనతో గమనించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణకు తమ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశంలోనే తొలి ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు’ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, షీ-భరోసా, సైబర్ ల్యాబ్‌లు, యాప్ ద్వారా ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. టీజీఎస్-ఎల్ఎస్ఏ, పాఠశాల విద్యాశాఖ ఒప్పందం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు చట్టపరమైన హక్కులపై అవగాహన కల్పిస్తున్నారని, ఇప్పటికే 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే బాధితులు 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 నంబర్లను సంప్రదించేలా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. న్యాయం అంటే కేవలం నేరస్తుడికి శిక్ష పడటం కాదు. న్యాయం అంటే బాధితుడి జీవితాన్ని తిరిగి నిలబెట్టడం. న్యాయం అంటే అతని గౌరవాన్ని తిరిగి ఇవ్వడం. ముఖ్యంగా ఒక బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే నిజమైన న్యాయం అని అన్నారు. న్యాయ సేవా సంస్థలు చేస్తున్న మంచి కార్యక్రమాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు, ప్రతి గ్రామానికి చేరేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
‘సంచార లోక్ అదాలత్’ వాహనాల ప్రారంభం 
ఉచిత న్యాయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు, ప్రజల వద్దకే చేరవేసే లక్ష్యంతో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ‘సంచార లోక్ అదాలత్’ ప్రత్యేక వాహనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మెగ్వాల్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ వి.మోహన, జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ ఆర్. మహదేవన్, ప్రజాప్రతినిధులు, న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





