– మెట్రో, బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి
– ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యం
– మెట్రో-ఆర్టీసీ అనుసంధానానికి శ్రీకారం
– ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 3 : హైదరాబాద్ నగర ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సేవలను అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ద్వారా ప్రయాణికులకు ఒకే పాస్‌తో మరింత సులభంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యం అమలు తీరును స్వయంగా పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులో శనివారం ప్రయాణించారు. బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజారుద్దీన్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గణేష్, నవీన్ యాదవ్, అధికారులు కామన్ పాస్‌తో మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలువురు ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్ పాస్ వినియోగం ఎలా ఉంది.. మెట్రో నుంచి బస్సుకు మారే సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా.. ప్రయాణం సులభమైందా.. వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన
కామన్ పాస్ తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని పలువురు ప్రయాణికులు భట్టికి తెలిపారు. మెట్రోలో ప్రయాణించిన అనంతరం గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉండటం వల్ల సమయం ఆదా అవుతోందని చెప్పారు. ప్రత్యేకంగా మరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం సౌకర్యంగా ఉందన్నారు. మెట్రో నుంచి దిగిన తర్వాత ఏ బస్సు ఎక్కాలి, ఏ మార్గంలో వెళ్లాలి అనే విషయంలో గతంలో ఎదురయ్యే అయోమయం కూడా తగ్గిందని ప్రయాణికులు వివరించారు. ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో-ఆర్టీసీ సేవలను అనుసంధానం చేయడం వల్ల రోజువారీ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతోందన్నారు.
బస్సులోనూ ప్రయాణికులతో ముచ్చట
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి భట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి టీజీఎసఆర్టీసీ బస్సులో సెక్రటేరియట్ వరకు ప్రయాణించారు. బస్సులోనూ ప్రయాణికులతో ముచ్చటిస్తూ కామన్ పాస్ వినియోగం, ప్రయాణ సౌకర్యం, మెట్రో-బస్సు అనుసంధానంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరం: భట్టి 
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ విధానం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులను సమన్వయంతో వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు గమ్యస్థానానికి చేరుకునే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, అయోమయం తగ్గుతాయని తెలిపారు. మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలు, ఇతర ప్రయాణికులతో మాట్లాడగా కామన్ పాస్ విధానం సౌకర్యవంతంగా ఉందని వారు చెప్పారని భట్టి పేర్కొన్నారు. మెట్రో నుంచి దిగిన తర్వాత తమ ఇల్లు, కార్యాలయం లేదా ఇతర గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులో ఉండటం వల్ల ప్రయాణం మరింత సులభతరం అవుతున్నదని చెప్పారు. ప్రజా రవాణాలోని వివిధ మార్గాలను ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి ప్రయాణికులకు ‘సీమ్‌లెస’ ప్రయాణ అనుభూతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు. ప్రస్తుతం మెట్రో-ఆర్టీసీ సేవలను అనుసంధానం చేశామని, భవిష్యత్తులో ఆటోలు, ఊబర్ వంటి ఇతర రవాణా సేవలను కూడా అనుసంధానం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు భట్టి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా రవాణాను బలోపేతం చేస్తాం: పొన్నం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఒకే పాస్‌తో ఆర్టీసీ, మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం ఉండటంతో ప్రయాణికులకు సమయం, శ్రమతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు ప్రజా రవాణాను బలోపేతం చేయడం ముఖ్యమైన పరిష్కారమని అన్నారు. ప్రజలను వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణా వైపు ఆకర్షించాలంటే ఆర్టీసీ, మెట్రో సేవలను సమన్వయంతో, సౌకర్యవంతంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు డెయిలీ పాస్, మంత్లీ పాస్‌తోపాటు కామన్ పాస్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకుని కామన్ పాస్ సేవలను మరింత మెరుగుపరుస్తామని పొన్నం తెలిపారు. ప్రజలకు ఆర్థికంగా అందుబాటులో ఉండేలా మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హైదరాబాద్ భవిష్యత్తు అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల ప్రయాణ కష్టాలను తగ్గించడంలో ప్రజా రవాణా కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహాదారు (అర్బన్ ట్రాన్స్‌పోర్ట్-మెట్రో) ఎన్.వి.ఎస్.రెడ్డి, మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





