- శివునిపల్లిలో సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం…
- ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలి
- హామీలను నెరవేర్చడమే నా లక్ష్యం.
- ఏడాదిలోనే రూ.800కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు
- స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్ పూర్, ప్రజాతంత్ర, మార్చి 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari), వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య అన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 800కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వొస్తున్న నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎంపీ కావ్య, జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రం శివునిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సందర్బంగా 50వేల మందితో భారీ కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్లు, ఈ సభను నియోజకవర్గ ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వొచ్చి జయప్రదం చేయాలని కోరారు.
శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తయి అగ్రిమెంట్లు కూడా అయ్యాయని, శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రారంభమైన పనులను 18 నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వొచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారని, ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదని ఇది స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలపై సీఎం ప్రేమకు నిదర్శనమని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే కాదనకుండా నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికి భారీ జన సమీకరణతో కృతజ్ఞతలు తెలపనున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి గారిసభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా రూపురేఖలు మారుతున్నాయి..
వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య (Kadiam Kavya) మాట్లాడుతూ… 16న స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, రూ.46 కోట్లతో 100 పడకల దవాఖాన, రూ. 26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.148 కోట్లతో దేవాదుల కెనాల్ సిసి లైనింగ్ నిర్మాణం, రూ.38 కోట్లతో పంచాయతీ రాజ్ బిటి రోడ్ల నిర్మాణం, రూ.5 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం,స్టేషన్ ఘనపూర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడేషన్ తోపాటు 24 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మారుమూల తాండలకు రోడ్లు,బంజారా భవన్ నిర్మాణం, 102 కోట్లతో మహిళా శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు, బ్యాంక్ లింకేజ్ లోన్లు, 12 కోట్లతో 5 సబ్ స్టేషన్ లు, ఒక డివిజనల్ ఆఫీస్ నిర్మాణం, రూ.250 కోట్లతో 5000 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రూ.35 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్ల నిర్మాణం తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించుకోబుతున్నామని తెలిపారు.
త్వరలో వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతోన్నాయని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. వరంగల్ (Warangal ) జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సిఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి జరుగుతుందన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ అన్నారు.
నష్కల్ నుంచి చింతలపల్లి నష్కల్ నుంచి హసన్ పర్తి రైల్వే బైపాస్ లైన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, నూతన బైపాస్ లైన్ ఔటర్ మీదగా వొస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేంద్ర మంత్రిని కలిసి కోరామని అన్నారు. మనందరి సమష్టి కృషితో రానున్న రోజులలో వరంగల్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని కడియం కావ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..





