ఎవరొస్తారో… ఎక్కడికొస్తారో రండి తేల్చుకుందాం.. రేవంత్
˜నీ ఇంటికొస్తా… నీ నియోజకవర్గానికొస్తా.. హరీష్
˜రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న నేతల వ్యాఖ్యలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
రాష్ట్రంలో ఎంఎల్సీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 14 నెలల కాంగ్రెస్ పాలనపై విపక్షాలు విరు చుకు పడుతుండగా, గత పాలనలోని ఆ పార్టీల అవకతవకలను ఎత్తిచూపే పనిలో కాంగ్రెస్ ఉంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేసవికి ముందే హాట్ హాట్‌గా మారుతున్నాయి. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతిని దిగజార్చిందని, అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మార్చిందన్నది అధికార కాంగ్రెస్ ఆరోపణ. అందుకు బిఆర్‌ఎస్ ప్రభు త్వకాలంలో చేపట్టిన పలు ప్రాజెక్టులే నిదర్శ నమంటోంది కాంగ్రెస్. కాళేశ్వ రం అవినీతికి అద్దం పడుతుంటే, ఇతర ప్రాజెక్టులు అందు కమీ తీసిపోవని ఎండగ డుతోంది. కాగా తాజాగా పాలమూరు` రంగా రెడ్డి ప్రాజెక్టు ప్రధాన చర్చ నీయాంశంగా మారింది. సమైక్య అంధ్రలో జరిగిన అన్యాయమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరుకు జరిగిందన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణ. అదిప్పుడు రాజకీయ పార్టీలమద్య ఘర్షణకు దారితీసింది. వాస్తవంగా పాలమూరు%`%రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మొదటి నుంచి వివాదమే కొనసాగుతున్నది.
అత్యంత కరవు ప్రాంతంగా గుర్తించబడిన ప్రాంతం కావడంతో దశాబ్దాలుగా ఇక్కడి నుంచి బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం ఆనవాయితీగా మారింది. అయితే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, బిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత తాము చేపట్టిన ప్రాజక్టుల కారణంగా వలసలు తగ్గడమే కాకుండా, విదేశాలకు వెళ్లిన వారు కూడా తిరిగి రావడం ప్రారంభమైందని బిఆర్‌ఎస్ చెప్పుకుంటోంది. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేవలం పది శాతం పనులు మాత్రమే మిగిలాయని, వాటిని ఏడాది కాలంలో పూర్తి చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ఆరోపణలు చేస్తోందన్నది బిఆర్‌ఎస్ వర్గాల వాదన. మొత్తం మీద ఈ ప్రాజక్టు పనులు పూర్తి కాకపోవడంతో పక్కనున్న దాయాది రాష్ట్రం, ఏపి ప్రభుత్వం నీళ్లను తరలించుకుపోతోందనేది మరో వివాదం. ఇందుకు మీరంటే మీరు బాధ్యులని పై రెండు పార్టీలు విమర్శించుకుంటున్నాయి. బిఆర్‌ఎస్ చేసిన నిర్వాకంవల్లే ఏపీ సీఎం చంద్రబాబుతో ఇప్పుడు వివాదం ఏర్పడిరది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తమ పదేళ్ల కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే చంద్రబాబుతో ఈ తగాదా ఉండేదికాదన్నది సిఎం రేవంత్‌రెడ్డి వాదన. నీళ్ళు రాయలసీమకు తరలించుకుపోతుంటే, నిధులు కేసిఆర్ తీసుకుపోయి పాలమూరుకు అన్యాయం చేశాడని ఆయన ఆరోపిస్తున్నారు.
కాగా, ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతూ కేసులు వేయించింది రేవంత్‌రెడ్డేనని, అదే ఆలస్యానికి కారణమైందని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎంఎల్‌ఏ హరీష్‌రావు ప్రత్యారోపణ చేస్తున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని బాగా నిర్లక్ష్యం చేసిన విషయం తెలియంది కాదు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలమూరును దత్తత తీసుకున్నట్లు ప్రకటించినప్పటికీ చేసింది మాత్రం ఏమీ లేదన్న విషయాన్ని బిఆర్‌ఎస్ గుర్తుచేస్తున్నది. ఈ ప్రాంతాన్ని ఎండబెట్టిన పాపం ఆ రెండు పార్టీలదేనని, ఆ రెండు పార్టీల్లో ఉన్న రేవంత్‌రెడ్డికి కూడా ఆ పాపంలో వాటా ఉందంటున్నారు బిఆర్‌ఎస్ ముఖ్యనేత హరీష్‌రావు. గతంలో పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీళ్ళు తరలించుకుపోతుంటే హారతులిచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌కే దక్కిందన్న హరీష్‌రావు, తమ ప్రభుత్వ కాలంలో కూడా ఈ ప్రాజక్టును ముందుకు సాగనీయకుండా విపక్షాలు అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అయినప్పటికీ తమ ప్రభుత్వ హయాంలో పాలమూరులో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించామని, అయితే 14 నెలల కాలంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదనంగా ఒక ఎకరానికి కూడా నీళ్ళివ్వలేకపోయిందంటారాయన.
గత ఏడాది ప్రభుత్వంమారి కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినట్లు అయితే, తాము పాలమూరును పూర్తిచేసి, నారాయణపేట, కొడంగల్ ప్రజల కాళ్ళు కడిగేవారమంటున్న హరీష్‌రావు సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపణలను తీవ్రంగా ఖండిరచారు. తన మీద కోపంతో పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టారని, అసలు రాష్ట్రంలో అభివృద్ధినే బిఆర్‌ఎస్ పట్టించుకోలేదంటున్న రేవంత్‌రెడ్డి మాటలు నిరాధారమైనవిగా హరీష్‌రావు కొట్టిపారేశారు. అయినా రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌కు తాను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. పదేళ్ల కెసిఆర్ పాలన, 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనతో తమ పన్నెండు నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం కావాలంటూ రేవంత్‌రెడ్డి ఛాలెంజ్ హరీష్‌రావు స్వీకరించారు. ‘‘నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. ఏ రోజు చర్చిద్దాం.. ఎక్కడన్నది నువ్వే చెప్పు’’. నీ ఇంటికైనా వస్తా.. నీ కొడంగల్ నియోజకవర్గానికైనా వొస్తా.. నీ ఆరు గ్యారంటీలేమిటో, 420 హామీలేమిటో, రుణమాఫీ సంగతి, రైతుబంధు, మహాలక్ష్మీ పథకం, పెన్షన్‌ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏల విషయాలన్నీ ఆ రోజు చర్చించేందుకు తాను సిద్దమేనని హరీష్‌రావు ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో శుక్రవారం జరిగిన ‘ప్రజాపాలన` ప్రగతిబాట’ బహిరంగ సభలో 12 నెలల తమ ప్రభుత్వం సాధించిన ప్రగతిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదాహరణగా వినిపించారు. ఈ సందర్భంగా ఆయన పదేళ్ళ బిఆర్‌ఎస్ పాలనను, 12 ఏళ్ళుగా అధికారంలోఉన్న బిజెపి ప్రభుత్వ పాలనాతీరుపై విరుచుకుపడ్డారు. నల్లధనాన్ని వెలికితీస్తానని, ప్రతీ పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మోదీ మాటను నిలుపుకోకపోవడం ఒకట్కెతే, 16 లక్షల కోట్ల కొల్లగొట్టి విదేశాలకు పారిపోయినా పట్టించుకోని మోదీ విధానాన్ని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను కల్పిస్తానన్న వాగ్దానాన్ని నిలుపుకోలేదని, రైతులు ఆదాయం రెట్టింపుచేస్తానంటూనే వ్యవసాయ రంగంలో నల్లచట్టాలను తెస్తే, రైతులు 16 నెలలపాటు దిల్లీని దిగ్భందిస్తే జాతికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వొచ్చిందంటూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు. అయినప్పటికీ తమ పాలనను విమర్శిస్తున్న బిజెపి, బిఆర్‌ఎస్ నేతలతో చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు. అయితే బిజెపి ఆధ్యక్షుడి హోదాలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తనతో చర్చకు రావాలన్నారు. ఆ చర్చలో ఓడిపోతే ముక్కు నేలకు రాస్తానంటున్న రేవంత్‌రెడ్డి ప్రకటించడం కొసమెరుపు. అయితే ఇరుపక్షాలు కూడా చర్చ ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పాలంటున్నారు. ఇంతకు తేదీ, సమయం ఎవరు ఖరారు చేస్తారో చూద్దాం.





