- మన ఊరు మన బడి కాంట్రాక్టర్ల ఆవేదన
- బిల్లుల కోసం పరిగిలో వినూత్న నిరసన
పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: మన ఊరు మన బడి పనులు చేసిన కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మన ఊరు మన బడి కాంట్రాక్టర్లు పరిగి అంబేద్కర్ చౌరస్తాలో వినూత్నంగా నిరసన తెలిపారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మెడలో ఉరి తాళ్ళతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి పథకంలో భాగంగా పనులు పూర్తి చేసి ఏడాదిన్నర గడచిన బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలల అభివృద్ధితోనే గ్రామాల భవిష్యత్తు బాగుంటుందనే సదుద్దేశంతో బంగారం అమ్మి,అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాలల పథకంలో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారు కానీ తమ బిల్లులు మాత్రం చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పరిగి నియోజక వర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాఘవేందర్ గౌడ్,అయినా పూర్ మాజీ ఎంపిటిసి విజయ ఆంజనేయులు, బడెంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.