హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణలో ఎవరూ తెలివి తక్కువ వాళ్లు లేరు, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి, అదానీకి ఉన్న బంధం తెలుసునని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. నేడు అదానీకి వ్యతిరేక ర్యాలీ తీశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. జైపూర్‌లో సరిగ్గా అతిథి మర్యాదలు జరగలేదోనో.. దిల్లీలో అపాయింట్‌మెంట్ దక్కలేదనో..
మొత్తానికి కొత్త నాటకానికి శ్రీకారం చుట్టాడు.. మన చిట్టినాయుడు అని కేటీఆర్ విమర్శించారు. భాయ్, భాయ్ అని వందల, వేల కోట్లు పంచుకున్న ముఖ్యమంత్రి.. అదానీ వ్యతిరేక రాలీ తీస్తున్నాడంట అని అన్నారు. నవ్వి పోదురు నాకేటి సిగ్గు అని.. రేవంత్ రెడ్డిని చూసే రాసుంటారని వ్యాఖ్యానించారు. మిమ్మల్ని ఎన్నుకున్నంత మాత్రం ప్రజలు మరీ అంత తెలివి తక్కువ వాళ్ళనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. లేక మళ్లీ మళ్లీ మోసం చెయ్యచ్చులే అనుకుంటున్నావా అని నిలదీశారు. దొంగే దొంగ అనడం నేడు కామన్ అయిపోయిందని చెప్పారు.
దమ్ముంటే ఫార్ములా-ఈ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టండి..నేను రెడీగా ఉన్నా : కేటీఆర్
దమ్ముంటే ఫార్ములా ఈ రేస్ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తోంది. ఇదే విషయంపై ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వొచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వొచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారు.
ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుంది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుంది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల లబ్ది చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వొచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేశారు.అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు.