బీజేపీ వెంటే జ‌మ్మూ ప్ర‌జ‌లు.. గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉన్నార‌ని, గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామ‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామ‌ని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో అన్ని స్థాయిల్లో కష్టపడి పనిచేశారని తెలిపారు. జ‌మ్మూ క‌శ్మీర్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గతంలో ఎప్పుడు కూడా సంపాదించనన్ని ఎక్కువ సీట్లతో బీజేపీ ఈ ఎన్నికల్లో విజయం సాధించింది. ఇకపై జమ్మూకశ్మీర్ అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి మరింత కష్టపడి పనిచేస్తాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధానమంత్రి మోదీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. మోదీపై ప్రజలకున్న విశ్వాసమేంటో.. జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ప్రజలు చూపించిన విశ్వాసంతోనే.. జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాల్లో.. బీజేపీ 29 స్థానాలు గెలుచుకుంద‌ని కిష‌న్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింద‌ని, కాంగ్రెస్ ముక్త జమ్మూను ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరొకసారి నిరూపించారని ఆయ‌న పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *