రోడ్డు ప్ర‌మాదాల నివార‌ణ‌కు కీలక నిర్ణయం

 – టీజీ-టీమార్స్’ ఏర్పాటు
– జీవో 135 విడుదల చేసిన సీఎస్‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : రాష్ట్రంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ నిర్వహణ అంటే కేవలం చలానాలు వసూలు చేయడమే కాకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడం, అత్యవసర వైద్య సాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ-టీమార్స్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అందుకు సంబంధించిన జీవో 135 విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నడిచే రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పరిధిలోనే ఈ కొత్త వ్యవస్థ పనిచేస్తుంది. ఈ ప్రత్యేక విభాగం అదనపు డీజీపీ లేదా ఐజీపీ స్థాయి అధికారి నేతృత్వంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. రాష్ట్రంలోని 32 వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్న రహదారులు, 1.8 కోట్లకు పైగా ఉన్న వాహనాల రాకపోకలను ఈ బ్యూరో పర్యవేక్షిస్తుంది. రోడ్డు రవాణాతోపాటు మెట్రో, రైల్వే భద్రతను కూడా ఈ విభాగానికే అప్పగించారు. బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతీ పోలీస్ స్టేషన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఒక రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్‌ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను గోల్డెన్ అవర్‌లో హాస్పిటల్‌కు తరలించడం వీరి బాధ్యత. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, 50 కి.మీ కంటే ఎక్కువ ఉన్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన హైవే పెట్రోలింగ్ యూనిట్లు నిరంతరం పహారా కాస్తారు. ఈ వ్యవస్థ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చే ట్రాఫిక్ జరిమానాల మొత్తంలో 40% ఈ నిధికే మళ్లిస్తారు. ఈ నిధులను సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు, అత్యవసర రోడ్డు మరమ్మతుల కోసమే ఉపయోగిస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *