కేయూ అభివృద్ధికి తొలి ప్రాధాన్యం

  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
  • 19లోపు కేయూకు సీఎం
  • పట్టభద్రుల ఎమ్మెల్సీగా సర్వోత్తం రెడ్డిని గెలిపించండి
  • కేయూలో ఉద్యోగులు, విద్యార్థుల మేధావులతో ఆత్మీయ సమావేశం

కాళోజి జంక్షన్ /హనుమకొండ, న‌వంబ‌ర్ 3 :  కాకతీయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంద‌ని, విశ్వవిద్యాలయానికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.

Ku News

కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులతో మంగ‌ళ‌వారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి ఉన్నత విద్యావంతుడని, విద్యారంగంపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. ఆయన తండ్రి టైగర్ దామోదర్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన గొప్ప నాయకుడని, అలాంటి త్యాగాల కుటుంబం నుంచి వొచ్చిన సర్వోత్తం రెడ్డికి పట్టభద్రులు త‌ప్ప‌కుండా ఆశీర్వాదం అందించాలని కోరారు. కెయు అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని, అసెంబ్లీలోనూ యూనివర్సిటీ సమస్యలను ప్రస్తావించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 19వ తేదీలోపు యూనివర్సిటీని సందర్శించే అవకాశం ఉందని, ఈ సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. గత మూడేళ్లలో వరంగల్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని పరిశీలించి పట్టభద్రులు ఆలోచనాత్మకంగా ఓటు వేయాలని కోరారు.

ప‌ట్ట‌భ‌ద్రులు స‌రైన నిర్ణ‌యం తీసుకోవాలి

రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ మాట్లాడుతూ.. గత పదేళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న నష్టాలను విద్యావంతులు గమనించాలని అన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినవి మాత్రమే కాదని, రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపే ఎన్నికలని పేర్కొన్నారు. పట్టభద్రులు పనిచేసే నాయకత్వాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. తాను కూడా విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తినని, కాకతీయ విశ్వవిద్యాలయంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. యూనివర్సిటీలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఖాళీ పోస్టులు, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి సంకల్పంలో భాగంగా విమానాశ్రయం, రహదారులు, వంతెనలు, యూనివర్సిటీ అభివృద్ధికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. తాను కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థినని గర్వంగా చెప్పుకుంటానని, యూనివర్సిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. విద్యావంతుడైన సర్వోత్తం రెడ్డిని గెలిపిస్తే యూనివర్సిటీ సమస్యలను సమర్థంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగలరని అన్నారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయ సమస్యలను గతంలోనూ ముఖ్యమంత్రి,  మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, కొన్ని సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చిందని తెలిపారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మరిన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు రాజకీయ పరిస్థితులను, అభ్యర్థి విద్యార్హతలు, సామర్థ్యాన్ని పరిశీలించి వోటు వేయాలని కోరారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాలకు ప్రత్యేక పాత్ర ఉందని గుర్తుచేశారు. యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని తెలిపారు. సర్వోత్తం రెడ్డి మంచి కుటుంబ నేపథ్యం, రాజకీయ అనుభవం కలిగిన అభ్యర్థి అని, ఆయనను గెలిపించాలని కోరారు.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ ప్రొఫెసర్ గాదే దయాకర్ మాట్లాడుతూ దేశంలోని స్వతంత్ర విచారణ సంస్థలని బిజెపి తన చేతుల్లో కీలుబొమ్మలుగా మలుచుకుందని ఆరోపించారు. తెలంగాణ ప్రజాస్వామిక పాలన కోసం కాంగ్రెస్కు విద్యార్థులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. వివిధ సంఘాలకు సంబంధించిన సమస్యలను అకుట్ అధ్యక్షులు ప్రొఫెసర్ బి వెంకటరామిరెడ్డి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ డా. పుల్ల శ్రీనివాస్, కాంట్రాక్ట్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ డా. సాదు రాజేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ గుండు సుధారాణి,ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లా ల కాంగ్రెస్ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మహమ్మద్ అయూబ్ ఖాన్, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి అజజ్ ఖాన్, యువజన నేత ఎన్ఎస్ యు ఐ కేయు మాజీ అధ్యక్షులు డా.బండి శ్రీనివాస్, అధ్యాపకులు డా. ఎస్. రంగారెడ్డి, డా. నరసింహారావు, బి. సతీష్, డా. తిరునహరి శేషు,డా. మల్లేష్, డా. దేవజి నాయక్, డా. సుచరిత పాల్, డా. శ్రీలత, మరియు వివిధ విద్యార్థి సంఘాల నేతలు డా. ప్రేమ్ కుమార్ కార్తీక్,సుమన్,దుర్గం సారయ్య, బోట్ల మనోహర్, ప్రసాద్, పాల్గొన్నారు.

కెయులో గోల్డ్‌మెడ‌ల్ సాధించా : ఎమ్మెల్సీ అభ్య‌ర్థి స‌రోత్తం రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ.. తాను కాకతీయ విశ్వవిద్యాలయంలో గోల్డ్ మెడలిస్ట్‌గా విద్యాభ్యాసం పూర్తి చేసి, అమెరికాలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో రెండు మాస్టర్స్ డిగ్రీలు పొందానని తెలిపారు. ఫైనాన్షియల్ స్ట్రాటజీ, ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్య అనంతరం క్యాపిటల్ వన్ బ్యాంక్‌లో పనిచేసి అమెరికా, కెనడా, లండన్ తదితర దేశాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు.
రాజకీయ వ్యవస్థకు, కార్పొరేట్ రంగానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 14 వేల కిలోమీటర్లు ప్రయాణించి పట్టభద్రులను కలిశానని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలానికి వెళ్లి సమస్యలను తెలుసుకుంటానని హామీ ఇచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో 489 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 77 మంది మాత్రమే పనిచేస్తున్నారని, ఇంకా 332 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలపై ఇటీవల మంత్రులు, ప్రజాప్రతినిధులతో చర్చించామని చెప్పారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కూడా అందుబాటులో ఉంటూ ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలపై స్వతంత్రంగా తన గళాన్ని వినిపిస్తానని, సమస్యలను వినడమే కాకుండా వాటి పరిష్కారానికి పోరాడుతానని హామీ ఇచ్చారు. తన తండ్రి టైగర్ దామోదర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ప్రజల కోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ, ప్రజల గుండెల్లో సంపాదించిన స్థానమే తమ కుటుంబానికి గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *