– ప్రక్షాళన పేరుతో అర్హుల పేర్లు తొలగిస్తే హక్కుల హననమే
– ఎన్నికల ప్రక్రియపై సందేహాలకు ఆధారాలతో సమాధానమివ్వాలి
– వోటు హక్కు పరిరక్షణకు రాహుల్ పోరాటం దేశానికి దిక్సూచి
– నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : ప్రజల వోటు హక్కుకు గండి కొట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వోటరు జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరులను ప్రజాస్వామ్య ప్రక్రియకు దూరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ‘సర్’ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు. ప్రతి అర్హుడైన పౌరుడి వోటుకు రక్షణ కల్పించడం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం రాజ్యాంగబద్ధ బాధ్యత అని పేర్కొన్నారు. సామాన్యుడి చేతిలో రాజ్యాంగం ఉంచిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం వోటు అని ఆయన పేర్కొన్నారు. అధికారాన్ని అప్పగించడానికి, పాలకులను ప్రశ్నించడానికి, అవసరమైతే వారిని మార్చడానికి ప్రజలకు నిర్ణయాధికారం అందులోనే ఉందని, అలాంటి వోటు హక్కుతో చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ప్రజల తీర్పుతో ఏర్పడే పాలనలో ప్రజలనే నిర్ణయ ప్రక్రియకు దూరం చేసే పరిస్థితి వస్తే ప్రజాస్వామ్య పునాదులే కదిలిపోతాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. వోటరు జాబితాలో ప్రతి పేరు వెనుక ఒక పౌరుడి రాజకీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, దేశ భవిష్యత్తును నిర్ణయించాలన్న ఆకాంక్ష ఉన్నాయని మంత్రి తెలిపారు. ఒక పౌరుడి హక్కుకు జరిగిన అన్యాయంపై వ్యవస్థ వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. తప్పు వ్యవస్థలో జరిగితే దాని భారాన్ని పౌరుడి భుజాలపై మోపడం ఏమిటి.. తన పేరు ఎందుకు తొలగిపోయిందో తెలుసుకోవడానికి ఓటరు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు రావాలి.. హక్కును కాపాడాల్సిన వ్యవస్థే అడ్డంకిగా మారితే ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి అని ప్రశ్నించారు. ‘సర్’ అమలుపై తలెత్తిన ఆరోపణలకు స్పష్టమైన సమాధానాలు రావాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తొలగించిన ప్రతి పేరుకు కారణం తెలియాలని, ఆ పౌరుడికి సమాచారం అందాలని, తన వాదన వినిపించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలని అన్నారు. పొరపాటుగా తొలగిన అర్హుల పేర్లను సత్వరం పునరుద్ధరించే సమర్థమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఈ మౌలిక హక్కుల పరిరక్షణ కోసమే లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బలమైన స్వరాన్ని వినిపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆందోళనలను రాజకీయ చర్చలోకి తీసుకురావడంతోపాటు న్యాయపరమైన పరిష్కారాల కోసం ఆయన సాగిస్తున్న పోరాటం ప్రజాస్వామ్య బాధ్యతకు నిదర్శనమన్నారు. వోటరు జాబితాల సవరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఇండి కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారని, వాటి నిజానిజాలు న్యాయస్థానంలో తేలాల్సి ఉందని అన్నారు. గత నెల 31న లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన జరిగిన ప్రతీకాత్మక ప్రజా అభిశంసన కార్యక్రమం ఎన్నికల జవాబుదారీతనంపై ప్రతిపక్షాల ఉమ్మడి నిరసనను వ్యక్తం చేసిందని మంత్రి పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు ఆరోపణలను పేర్కొంటూ మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన తీర్మానానికి రాహుల్ గాంధీతోపాటు కూటమి నేతలు మద్దతు తెలిపారని వివరించారు. ఈనెల 1న రామ్‌లీలా మైదాన్ దిశగా సాగిన ప్రదర్శన, అనంతరం జరిగిన సభ ఓటు హక్కు పరిరక్షణపై ఉమ్మడి సంకల్పాన్ని చాటాయని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విభిన్న రాజకీయ నేపథ్యాలు, ప్రాంతీయ ప్రాధాన్యాలు కలిగిన పార్టీలను ఈ అంశంపై సమీకరించడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సంఘం తనపై వచ్చిన పక్షపాత ఆరోపణలను ఖండిస్తున్నట్లే ప్రజల సందేహాలను నివృత్తి చేసేలా పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని మంత్రి కోరారు. ప్రశ్నలకు ఆధారాలతో సమాధానమివ్వడం, తప్పులు జరిగితే సరిదిద్దడం, పరిశీలనను స్వాగతించడం ద్వారా సంస్థలపై విశ్వాసం బలపడుతుందన్నారు. రాజ్యాంగ సంస్థల ప్రతిష్ఠకు పారదర్శకతే కవచం. జవాబుదారీతనమే బలం అని అన్నారు. ప్రశ్నించే స్వరాన్ని అనుమానించడం వల్ల విశ్వాసం పెరగదని, ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత నుంచి ఏ వ్యవస్థా తప్పించుకోలేదని తెలిపారు. ప్రజల సమస్యలను వినడం, వాటిపై నిలదీయడం, విభిన్న శక్తులను సమీకరించడం, రాజ్యాంగబద్ధ మార్గాల్లో పోరాడటం వంటి నాయకత్వ లక్షణాలు రాహుల్ గాంధీలో స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. ఒక్క అర్హుడి వోటు అన్యాయంగా తొలగినా దాన్ని సరిదిద్దే వరకు ప్రశ్నిస్తాం.. ఒక్క పౌరుడి హక్కుకు భంగం కలిగినా దాని పరిరక్షణకు నిలబడతాం అని ఉత్తమ్ స్పష్టం చేశారు. వోటు నిలిస్తే ప్రజల అధికారం నిలుస్తుంది.. ప్రజల అధికారం నిలిస్తే రాజ్యాంగం సజీవంగా ఉంటుంది.. ప్రతి వోటును కాపాడే రాహుల్ పోరాటానికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





