– పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతుల ఎదురుచూపులు
– జిల్లా కేంద్రాల్లో ‘ప్రజావాణి’ చుట్టూ దరఖాస్తులతో ప్రదక్షిణలు
– ముద్రణ బకాయిల నెపంతో ఆలస్యం
– గత ప్రభుత్వంలో 1.6 లక్షల దరఖాస్తులు పెండింగ్
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సిరిసిల్ల, నవంబర్ 3 : రాష్ట్రంలో ఏ చర్చ జరిగినా అది ఇభూముల చుట్టూనే తిరుగుతోంది. గత ప్రభుత్వం వివాదాస్పద ‘ధరణి’ పోర్టల్ ను తీసుకొస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ‘ భూభారతి’ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పేర్లు మారినా అన్నదాతల కష్టాలు మాత్రం తీరడంలేదు. కనీసం తమ సొంత భూమికి గుర్తింపుగా ఉండే పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా చేతికి
అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని అనేకమంది రైతులు 31 జిల్లా కేంద్రాల్లో “ప్రజావాణి’తోపాటు వివిధ మార్గాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురు చూస్తున్నారు. భూమి హక్కుదారులుగా గుర్తింపు పొందడం కోసమే కాక సాగు కోసం రుణాలు పొందేందుకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అత్యవసరంగా మారాయి. ఈ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ ద్వారా నమోదైన దరఖాస్తుల్లో అధికారికంగానే రంగారెడ్డి జిల్లాలో 13,867, సంగారెడ్డి జిల్లాలో 7,865, వికారాబాద్ జిల్లాలో 6,454, మంచిర్యాల జిల్లాలో సుమారు 3వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.6 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ పట్టాదారు పాస్ పుస్తకాల జారీలో కొంతకాలంగా తీవ్ర ఆలస్యం జరుగుతున్నట్లు గణంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఈ విషయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటా పూర్ గ్రామానికి చెందిన ఓ రైతు జిల్లా కేంద్రం లోని ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సందర్భంగా ‘ప్రజాతంత్ర’తో మాట్లాడు తూ తన సమస్యను వివరించారు. తన పాస్ పుస్తకాన్ని తనిఖీ కోసం తీసుకున్నారని, తిరిగి అడిగితే దొరకడం లేదని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారని వాపోయారు. ఈ విషయమై అధికారులను అడిగితే గత ప్రభుత్వం పాసు పుస్తకాల ముద్రణ నిర్వాహకులకు రూ.2కోట్లకు పైగా బకాయిలు పడిందని, ఆ బకాయిలు చెల్లించే వరకు కొత్త పాస్ పుస్తకాలు రావని ముఖం మీదే చెప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి నుంచి భూభారతి దాకా..
రాష్ట్రంలో రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలు పొందేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 6,71,508 పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసినట్లు తెలిపారు. మొత్తంగా 34 నెలల కాలంలో 12, 40,365 పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ఇటీవల వెల్లడించారు. భౌతిక పాస్ పుస్తకాలతో పాటు డిజిటల్ పుస్తకాల జారీ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాల జారీ ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయడం ద్వారా కష్టాలు తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





