బతికి ఉన్నా మృతులుగా.. ఇంట్లో ఉన్నా ఆచూకీ లేని వారిగా…

– ఎస్‌ఐఆర్‌లో అర్హుల వోట్ల తొలగింపు
– తెలంగాణ వోటర్‌ రైట్స్‌ ఫోరం ఆరోపణ
– ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లో సామాజిక తనిఖీ వివరాల వెల్లడి
– అమిత్‌ షా వ్యాఖ్యలపై పరకాల ప్రభాకర్‌ తీవ్ర అభ్యంతరం
– ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా ఉపసంహరించాలని జ్యూరీ సభ్యుల డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 3: ఏళ్ల తరబడి ఒకే ఇంట్లో నివసిస్తున్నా ఆచూకీ లేనివారుగా గుర్తించడం.. బూత్‌స్థాయి అధికారికి ఫారాలు సమర్పించి, స్వీకరణ సంతకాలు తీసుకున్నప్పటికీ వోటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడం.. బతికున్న వ్యక్తులను మృతులుగా నమోదు చేయడం.. వోటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్‌’) ప్రక్రియలో ఇటువంటి తీవ్రమైన లోపాలు బయటపడ్డాయని తెలంగాణ వోటర్‌ రైట్స్‌ ఫోరం (టీవీఆర్‌ఎఫ్‌) వెల్లడించింది. ఇవి కొందరు బూత్‌స్థాయి అధికారుల పొరపాట్లకు పరిమితమైనవి కావని, మొత్తం ప్రక్రియ రూపకల్పనలోనే వ్యవస్థాగత లోపాలున్నాయని పేర్కొంది. ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా ఉపసంహరించి, తప్పుగా తొలగించిన అర్హుల వోటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేసింది. ముషీరాబాద్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాల్లో అక్టోబర్‌లో నిర్వహించిన సామాజిక తనిఖీ, ప్రజా విచారణల వివరాలను మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధులు వెల్లడించారు. ఇంటింటికీ, వీధివీధికీ వెళ్లి వందలాది మంది వోటర్లను కలిసిన అనంతరం ఈ విచారణలు నిర్వహించినట్లు తెలిపారు. ఎస్‌ఐఆర్‌లో పేర్లు తొలగింపునకు గురైన పలువురు బాధితులు సమావేశంలో తమ అనుభవాలను వివరించారు. హైదరాబాద్‌ సభలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎస్‌ఐఆర్‌పై చేసినట్లు ప్రెస్‌నోట్‌లో పేర్కొన్న వ్యాఖ్యలపైనా వక్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

రెండు బూత్‌లలోనే భారీగా తొలగింపులు, నోటీసులు   

ప్రజా విచారణల ప్రధాన అంశాలను డాక్టర్‌ ఎ. సునీత వివరించారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలోని 150, 151 బూత్‌ల పరిధిలో ముసాయిదా వోటర్ల జాబితా, తొలగించిన వోటర్ల జాబితాలతో వలంటీర్లు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారని తెలిపారు. ఈ రెండు బూత్‌లకు చెందిన వోటర్లలో సుమారు 42 శాతం మందిని నేరుగా కలిశామన్నారు. నేరుగా సర్వే చేసిన 757 మందిలో 232 మంది పేర్లు ఏఎస్‌డీడీ జాబితాలో చేర్చి తొలగించారని, వీరిలో 43 మంది తొలగింపులు తప్పుగా జరిగినట్లు తమ పరిశీలనలో గుర్తించామని చెప్పారు. సర్వేలో కలిసిన మరో 383 మందికి నోటీసులు అందినట్లు తెలిపారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ 2025 జాబితాల ప్రకారం ఈ రెండు బూత్‌లలో 1,829 మంది వోటర్లు ఉండగా, వారిలో 721 మంది పేర్లు తొలగించారని, మరో 960 మందికి నోటీసులు జారీ చేశారని వివరించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పేర్లు తొలగించిన 95 మందిని పరిశీలించగా, 42 మంది పేర్లు తప్పుగా తొలగించినట్లు తేలిందన్నారు. సర్వే సందర్భంగా అనేక మంది వోటర్లు ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు.

2008 నుంచి వోటేస్తున్నాను.. ఇప్పుడు కొత్త వోటరుగా దరఖాస్తు చేయాలా? 

ముషీరాబాద్‌కు చెందిన నరేందర్‌ గుండెల్లి తన కుటుంబంలో నలుగురి వోట్లు తొలగించారని తెలిపారు. తాను 2008 నుంచి వోటేస్తున్నానని, తన తల్లి అంతకంటే ముందు నుంచే వోటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్పారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా అర్హత నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదురుకాలేదన్నారు. బీఎల్‌ఓకు సమర్పించిన ఫారాలపై ఆయన సంతకంతో కూడిన ప్రతులు తమ వద్ద ఉన్నప్పటికీ రికార్డుల్లో గైర్హాజరు/ఆచూకీ లేనివారుగా పేర్కొని పేర్లు తొలగించారని వాపోయారు. కొత్త వోటరుగా ఫారం–6 సమర్పించాలని చెప్పడాన్ని ప్రశ్నిస్తూ ఇప్పుడు నన్ను కొత్త వోటరుగా పరిగణిస్తే ఇన్నేళ్లుగా నేను వేసిన వోట్ల సంగతేమిటి అని నిలదీశారు. తిరుమలగిరికి చెందిన కె. గణేశ్‌ మాట్లాడుతూ, టీవీఆర్‌ఎఫ్‌ సామాజిక తనిఖీ బృందం ఫోన్‌ చేసే వరకు తన పేరు తొలగించిన విషయం కూడా తెలియదన్నారు. ప్రజా విచారణకు హాజరై ఇతర బాధితుల అనుభవాలు విన్న తరువాత సమస్య తీవ్రత అర్థమైందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అదే ఇంట్లో నివసిస్తున్నా తన పేరు తొలగించారని పేర్కొన్నారు. పలుమార్లు వోటేసిన తాను తొలిసారి వోటరుగా ఎలా ప్రకటించుకోగలనని బీఎల్‌ఓను ప్రశ్నించినట్లు తెలిపారు. ముషీరాబాద్‌కు చెందిన వృద్ధురాలు అమీనా బేగం తన ఇద్దరు కుమారుల పేర్లు జాబితా నుంచి తొలగించారని చెప్పారు. తాను అదే ప్రాంతంలో పుట్టి పెరిగానని, ఇప్పుడు తనకు ఏడేళ్ల మనవడు కూడా ఉన్నాడని వివరించారు. బీఎల్‌ఓ వద్ద ఫారాలు తీసుకుని సమర్పించినప్పటికీ తొలగింపులు జరిగాయన్నారు. ఆమె కుమారుడు, 35 ఏళ్ల అమీర్‌ అహ్మద్‌ బీఎల్‌ఓ సంతకంతో ఉన్న ఎస్‌ఐఆర్‌ గణన ఫారాన్ని చూపించారు. అయినా తనను ఆచూకీ లేనివారు/గైర్హాజరుగా నమోదు చేశారని తెలిపారు.

ఎన్నికల సంఘంపై విశ్వాసం దెబ్బతింటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : ప్రొఫెసర్‌ హరగోపాల్‌

ముషీరాబాద్‌ ప్రజా విచారణలో అనేక తప్పు తొలగింపులు తమ దృష్టికి వచ్చాయని ప్రజా జ్యూరీ సభ్యుడు ప్రొఫెసర్‌ జి. హరగోపాల్‌ అన్నారు. బతికున్న తన భర్తను ‘మృతుడు’గా పేర్కొని పేరు తొలగించారని ఒక మహిళ ఆధారాలు చూపించిందని తెలిపారు. ఈ ఉదంతాలు ఎస్‌ఐఆర్‌లోని తీవ్రమైన లోపాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామక ఎంపిక కమిటీలో ప్రధాన న్యాయమూర్తికి స్థానం లేకుండా చేసిన నిర్ణయాన్నీ ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రజలకు విశ్వాసం ఉండాలని, ఆ నమ్మకం దెబ్బతింటే మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

తొలగించిన వారందరూ అనర్హులే అనడానికి ఆధారాలేవి? : డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌

తిరుమలగిరి ప్రజా విచారణలో జ్యూరీ సభ్యుడిగా పాల్గొన్న ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది వోటర్ల పేర్లను సక్రమంగానే తొలగించామని అమిత్‌ షా చెప్పారని పేర్కొంటూ, ఇటువంటి వ్యాఖ్యలు ఆయన నిర్వహిస్తున్న ఉన్నత పదవికి తగవన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే టీవీఆర్‌ఎఫ్‌ నిర్వహిస్తున్న ప్రజా విచారణల్లో కనీసం ఒక్కదానికైనా హాజరుకావాలని హోంమంత్రికి, ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నవారికి సూచించారు. దేశంలో మూడు కోట్ల మంది విదేశీ చొరబాటుదారులున్నారన్న వాదనకు రాష్ట్రాలవారీగా, నియోజకవర్గాలవారీగా వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా గుర్తించిన అక్రమ వలసదారుల వివరాలను పౌరసత్వ చట్టం కింద సంబంధిత అధికారికి నాలుగు వారాల్లో అందించాలని సుప్రీంకోర్టు మే 27, 2026న ఆదేశించిందని పరకాల పేర్కొన్నారు. ఐదు నెలలకు పైగా గడిచినా ఆ వాదనలకు ఆధారాలు చూపలేదని ఆయన ఆరోపించారు. గతంలోనూ ఇదే తరహా ఎస్‌ఐఆర్‌ అనేకసార్లు జరిగిందని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రతి వోటరూ తప్పనిసరిగా ఫారం సమర్పించాలని, అందకపోతే పేరు తొలగించే ప్రస్తుత తరహా ప్రక్రియ గత సవరణలకు భిన్నమని వాదించారు. ప్రస్తుత ఎస్‌ఐఆర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు.

మహిళలు, అణగారిన వర్గాలపై అధిక భారం : ప్రొఫెసర్‌ పద్మజా షా 

ప్రొఫెసర్‌ పద్మజా షా మాట్లాడుతూ ప్రస్తుత రూపంలో ఎస్‌ఐఆర్‌ అమలుకు ఎవరు ఆమోదం తెలిపారన్న అంశంపై ఎన్నికల సంఘం సమాచార హక్కు సమాధానాల్లో తగిన ఆధారాలు చూపలేకపోయిందని ఆరోపించారు. వోటర్లపై విధించిన ఈ ప్రక్రియ చట్టబద్ధతను ప్రశ్నించారు. వివాహమై 30–35 ఏళ్లు గడిచిన మహిళలను కూడా తల్లిదండ్రులు లేదా తాతామామ్మల వోటరు వివరాలతో అనుసంధానించుకోవాలని కోరుతున్నారని విద్యావేత్త, సామాజిక కార్యకర్త మరియా తబస్సుమ్‌ అన్నారు. దీనివల్ల మహిళలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వరుసల్లో నిలబడాల్సి వస్తోందన్నారు. కులమతాలు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా పౌరులకు సమానంగా లభించాల్సిన వోటు హక్కును ఎస్‌ఐఆర్‌ దెబ్బతీస్తోందని నేషనల్‌ దళిత్‌ క్రిస్టియన్‌ వాచ్‌కు చెందిన సిస్టర్‌ మంజుల విమర్శించారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసీలు, శ్రామిక వర్గాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. తప్పుగా తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ప్రత్యేక ఫారం కల్పించకుండా ఫారం–6 దాఖలు చేయాలని కోరడాన్ని మానవ హక్కుల న్యాయవాది ఎస్‌క్యూ మసూద్‌ ప్రశ్నించారు. దీనివల్ల తప్పుగా తొలగించిన వోటర్ల సంఖ్య ప్రత్యేకంగా వెలుగులోకి రాకుండా పోతుందని ఆరోపించారు.

మున్సిపల్‌ ఎన్నికలకు ఈ జాబితాలు వినియోగించవద్దు : కిరణ్‌ విస్సా

సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించిన కిరణ్‌ విస్సా తెలంగాణకు సంబంధించి రెండు తక్షణ డిమాండ్లు ఉంచారు. తమ పరిశీలనలో లోపాలు బయటపడిన ప్రాంతాల బీఎల్‌ఓలను మాత్రమే బాధ్యులను చేయకుండా, ఎస్‌ఐఆర్‌లోని వ్యవస్థాగత సమస్యలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌లోని అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. తప్పు తొలగింపులతో కూడిన ఎస్‌ఐఆర్‌ జాబితాలను రాబోయే హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు ఉపయోగించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. 2025 వోటర్ల జాబితాలను ప్రాతిపదికగా తీసుకుని, ప్రజా భాగస్వామ్యంతో సామాజిక తనిఖీ నిర్వహించి కొత్త జాబితాలు రూపొందించాలని కోరారు. అవసరమైతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన మార్గదర్శకాల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, 2025 ఎస్‌ఐఆర్‌ మార్గదర్శకాలను రద్దు చేయాలని ఫోరం డిమాండ్‌ చేసింది. ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లను పక్కనపెట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు, ఎస్‌ఐఆర్‌ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని కోరింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. బాధితుల వాంగ్మూలాల సమర్పణకు మేరీ లిజ్‌ డయాస్‌, ఇర్ఫాన్‌ సహకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *