– గోదావరిలో నీళ్లున్నా చేలు ఎడారులు
– ఇది పాలకులు తెచ్చిన కరువు
– కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టారు
– గోదావరి జలాలను మళ్లిస్తేనే సదాశివుడికి నిజమైన నివాళి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తలాపున గోదావరి పారుతున్నా మన చేలు, చెలకలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను పడావు పెట్టి రైతులకు సాగునీరు అందకుండా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. పాలకులు తెచ్చిన కరువు అని స్పష్టం చేశారు. ప్రముఖ కవి, గోదావరి గొంతుకగా నిలిచిన మల్లావఝల సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2024–25 సంవత్సరానికి చెమన్ సింగ్, 2025–26 సంవత్సరానికి సంగిశెట్టి శ్రీనివాస్‌లకు స్మారక పురస్కారాలను అందజేశారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలందించిన తిరునగరి దేవకిదేవి, కవ్వంపల్లి స్వామిలను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుత కరువు పరిస్థితులు ప్రకృతి కారణంగా వచ్చినవి కావని, పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇదేదో తాను అక్కసుతోనో, కోపంతోనో చెబుతున్న మాట కాదు.. వాస్తవాలను ఆధారంగా చేసుకుని చెబుతున్న మాట అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏడున్నర నెలల్లో గోదావరిలోకి 750 టీఎంసీల నీళ్లు, కృష్ణా నదిలోకి 258 టీఎంసీల నీళ్లు వచ్చాయని, సుమారు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వెళ్లిపోయాయని తెలిపారు. నీళ్లు ఎత్తండి.. రైతులను ఆదుకోండి అని తాము పాలకులను కోరాం.. కానీ వారు తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోగా ఇవాళ వాస్తవాలను బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష, పాలమూరు ప్రాజెక్టుపై పగ, కేసీఆర్‌పై అక్కసుతోనే వాటిని పడావు పెట్టారని ఆరోపించారు. గోదావరి జలాలను వినియోగించుకుని పొలాలకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు. మల్లావఝల సాహిత్య సేవలను గుర్తు చేసుకుంటూ రవిగాంచని చోట కవిగాంచెను అని పెద్దలు ఎప్పుడో చెప్పారన్నారు. కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డవాడే కవి.. గోదావరిఖని మట్టిలోనే ఏదో మహత్మ్యం ఉంది.. కన్నీటి చుక్కల నుంచే కత్తులు మొలిపించిన అద్భుత కవి మల్లావఝల అని కొనియాడారు. జలసాధన ఉద్యమ సమయంలో సదాశివుడు రాసిన ‘తలాపున పారుతుంది గోదావరి’ పాట ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మాటలో ఎంత శక్తి ఉందో ఈ పాటలోనూ అంతే లోతైన అర్థం ఉందని పేర్కొన్నారు. సదాశివుడు అజ్ఞాత సూర్యుడిగా తన పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు కేసీఆర్ స్వయంగా పాట రాసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. 2001లో మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఉద్యమంలో కొందరు నాయకులు మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భంలో ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేసీఆర్ పాట రాశారని వివరించారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం.. ఎన్నో పోరాటాల తర్వాతే విజయం సాధ్యమవుతుంది.. అలాగే తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చి తీరుతుంది అనే నమ్మకాన్ని ఆ పాట ద్వారా కలిగించారని గుర్తు చేశారు. గోదావరి జలాలను పొలాలకు మళ్లించడమే మల్లావఝలకు అర్పించే నిజమైన నివాళి అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం మళ్లీ దీపస్తంభంలా వెలుగొందాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





