– నిర్మల్ మహా పాదయాత్రలో రేవంత్‌పై బీజేపీ చీఫ్ రామచందర్ ఫైర్
నిర్మల్, ప్రజాతంత్ర, నవంబర్ 3 : బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో మంగళవారం చేపట్టిన మహా పాదయాత్ర అశేష జనవాహిని మధ్య అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమై విజయవంతంగా ముగిసింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తన ప్రసంగంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు, విద్యుత్ అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితిని కనీసం పట్టించుకోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లి వోట్ చోరీ అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్లు అది వోట్ చోరీ కాదని, అసలు ఆయన బ్రెయినే చోరీ అయిందని, అటు గాంధీ పేరును దొంగిలించి రాహుల్ గాంధీ ‘నామ్ చోరీ’కి పాల్పడ్డారని ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలిసి దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా రూ.12 లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి అవినీతికి మారుపేరుగా నిలిచిందని రామచందర్ రావు గుర్తు చేశారు. కానీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా నీతివంతమైన, దేశ భక్తితో కూడిన స్వచ్ఛమైన పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. అలాంటి మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని, ఆ కుట్రలను అందరం కలిసికట్టుగా ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి గ్రామగ్రామాన బీజేపీని మరింత పటిష్టం చేయాలని కోరారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మహా పాదయాత్రలో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర సహ ఇన్చార్జి రేఖాశర్మ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జి.నగేష్, ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, రాకేష్ రెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీష్‌బాబు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





