ర్యాంకులు కాదు… ఫలితాలు ముఖ్యం!

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 29న ప్రారంభించిన ‘ప్రగతి-50’ కార్యక్రమానికి తెలంగాణ నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు ఎంపిక కావడం హర్షణీయం. ఇది కేవలం ర్యాంకుల కోసం కాకుండా, సాంకేతిక పర్యవేక్షణ ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన పారిశుధ్య ఫలితాలు సాధించాలి . ఈరెండు నగరాల్లో అప్పుడప్పుడూ నిర్వహించే క్లీన్నెస్ డ్రైవ్ల వల్ల ప్రయోజనం వుండదు. ఈ రెండు నగరాల్లోనూ పారిశుధ్యం అనేది ఇప్పటికీ సాంకేతికత కంటే ఎక్కువగా ‘శ్రామికశక్తి’ పైనే ఆధారపడి నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘ప్రగతి–50’ కార్యక్రమం మానవ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణను పెంచడానికే ఉద్దేశించబడింది.

హైదరాబాద్‌లో ప్రతిరోజూ దాదాపు 6,500 నుండి 7,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతాయి. గణేశ్ నిమజ్జనం వంటి పండుగల సమయంలో ఇది ఒక్కసారిగా భారీగా పెరుగుతుంది.  నగరంలో దాదాపు 25,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు (స్వీపర్లు, కలెక్టర్లు) ఉన్నారు. ఒకవేళ వీరిలో 20%-30% మంది సమ్మె చేసినా లేదా పండుగల సీజన్‌లో గైర్హాజరైనా, కేవలం రెండు రోజుల్లోనే నగరం డంపింగ్ యాడ్గా మారుతుంది. ప్రైవేట్ ఏజెన్సీలు (రాంకీ వంటివి) రవాణా, ప్రాసెసింగ్‌ను చూస్తున్నప్పటికీ, గల్లీల నుంచి చెత్తను సేకరించే ‘స్వచ్ఛ ఆటో’ డ్రైవర్లు లేదా వీధులు ఊడ్చే కార్మికులు లేకపోతే ప్రాథమిక సేకరణ పూర్తిగా నిలిచిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయ యంత్రాల వినియోగం కేవలం ప్రధాన రహదారులకే పరిమితమయ్యాయి. వరంగల్ విషయానికి వొస్తే  వరంగల్‌లో రోజుకు సుమారు 350-400 టన్నుల వ్యర్థాలు వొస్తాయి. ఇక్కడ సిబ్బంది సంఖ్య హైదరాబాద్ కంటే చాలా తక్కువ. వరంగల్‌లో కార్మికులు గైర్హాజరైతే ప్రత్యామ్నాయంగా రంగంలోకి దించడానికి అదనపు యంత్రాంగం లేదా ప్రైవేట్ కాంట్రాక్ట్ శ్రామికశక్తి తక్షణమే అందుబాటులో ఉండదు.

కార్మికులు లేకపోయినా నగరం కుప్పకూలకుండా ఉండాలంటే వీధులు ఊడ్చడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం వంటి పనులను 80% మానవరహితంగా మార్చాలి. పౌరులు తడి, పొడి చెత్తను విడగొట్టి ఇవ్వకపోవడం వల్ల కార్మికులు లేనప్పుడు ఆ చెత్త కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన, వ్యాధులు వ్యాపిస్తాయి. ప్రజల ప్రవర్తన మారితే , చెత్త సేకరించడం ఆలస్యమైనా అది పెద్ద సంక్షోభంగా మారదు. ఐసీటీ  ఆధారిత అటెండెన్స్, జియో-ఫెన్సింగ్ ద్వారా కార్మికుల కొరత ఎక్కడ ఉందో ముందే గుర్తించి, ఇతర ప్రాంతాల సిబ్బందిని లేదా మిషన్లను అక్కడికి డైవర్ట్ చేసే డైనమిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ రావాలి. పారిశుద్ధ్య కార్మికులు రాకపోయినా నగరం క్లీన్‌గా ఉండగలిగేలా ‘ఆటోమేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్’ సామర్థ్యాన్ని పెంచుకున్నప్పుడే హైదరాబాద్, వరంగల్ నగరాలకు నిజమైన ‘ప్రగతి’ లభిస్తుంది.

రెండు నగరాల్లో చెత్త ప్రాసెసింగ్  , వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ పనితీరును పరిశీలిస్తే, రెండు నగరాలు సాధారణ రోజుల్లో బండి లాగుతున్నప్పటికీ, పండుగల సీజన్ లేదా అత్యవసర పరిస్థితులు వొచ్చినప్పుడు ఈ నగరాల మున్సిపల్ యంత్రాంగం చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తున్నది . చెత్తను సేకరించడంపై ఉన్న శ్రద్ధ, దానిని శాస్త్రీయంగా ప్రాసెసింగ్ చేయడంపై లేదు.హైదరాబాద్‌లో రోజుకు దాదాపు 6,500 నుండి 7,000 టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన ‘లెగసీ వేస్ట్’  నగరానికి పెద్ద శాపంగా మారింది. నగరంలో సేకరిస్తున్న చెత్తలో 100% వర్గీకరణ జరగడం లేదు. తడి, పొడి చెత్త కలిసిపోవడం వల్ల రీసైక్లింగ్ , కంపోస్టింగ్ ప్రక్రియ మందగిస్తున్నది . ‘వేస్ట్-టు-ఎనర్జీ’ (చెత్త నుండి విద్యుత్) ప్లాంట్లు ఉన్నప్పటికీ, అవి ఉత్పత్తి అవుతున్న మొత్తం వ్యర్థాలను తట్టుకోలేకపోతున్నాయి. ఇటీవల గణేశ్ నిమజ్జనం సమయంలో ఒక్కసారిగా వొచ్చిన 4,500 టన్నుల వ్యర్థాలను సకాలంలో ప్రాసెసింగ్ చేయలేక యంత్రాంగం తీవ్రంగా ఇబ్బంది పడింది.వరంగల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (ఎంఆర్ఎఫ్) , వికేంద్రీకృత కంపోస్టింగ్ ప్లాంట్లు ఉన్నప్పటికీ, అవి పూర్తి సామర్థ్యంతో నడవడం లేదు.

డంపింగ్ సైట్లలో శాస్త్రీయ ల్యాండ్‌ఫిల్లింగ్ లేకపోవడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి.హైదరాబాద్ లో  దాదాపు 25,000 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నప్పటికీ, వారి హాజరు, పనితీరును పర్యవేక్షించే ఖచ్చితమైన డిజిటల్ వ్యవస్థ లోపించింది. బయో-మెట్రిక్ లేదా జియో-ఫెన్సింగ్ వంటివి కొన్ని చోట్ల ఉన్నా, క్షేత్రస్థాయిలో దుర్వినియోగం అవుతున్నాయి. గల్లీల్లో చెత్త సేకరించే ‘స్వచ్ఛ ఆటో’ కార్మికులు ప్రైవేట్ లేదా సొంత వాహనాలతో నడుపుతుంటారు. వీరిపై మున్సిపల్ కార్పొరేషన్‌కు పూర్తి నియంత్రణ ఉండదు. పండుగ రోజుల్లో లేదా కార్మికులు సమ్మెకు దిగినప్పుడు ప్రత్యామ్నాయంగా రంగంలోకి దించడానికి ‘రిజర్వ్ వర్క్‌ఫోర్స్’ లేదా రోబోటిక్/మెకనైజ్డ్ క్లీనింగ్ సిబ్బంది అందుబాటులో లేరు.ఇక వరంగల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వరంగల్‌లో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెరగలేదు. ఉన్న తక్కువ మంది సిబ్బందిపైనే పని భారం ఎక్కువగా పడుతున్నది . కార్మికులకు సరైన భద్రతా పరికరాలు అందజేయడం, శిక్షణ ఇవ్వడంలో కార్పొరేషన్ వెనుకబడి ఉంది. సిబ్బంది కొరత కారణంగా నగరంలోని శివారు ప్రాంతాల్లో రోజువారీ చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 29న ప్రారంభించిన ‘ప్రగతి–50, క్లీన్ సిటీ ఇనిషియేటివ్’  ప్రకారం ఈ రెండు నగరాల్లో ప్రధానంగా రెండు విభాగాల్లో  సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. మొదటిది ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసేలా కఠిన నిబంధనలు. రెండవది ‘స్వచ్ఛతమ్ పోర్టల్’ ద్వారా కార్మికుల హాజరు, రూట్ మ్యాపింగ్, జియో-ట్యాగింగ్‌లను కేంద్రీకృత డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ద్వారా పర్యవేక్షించడం. మనుషులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సీఎస్ఐఆర్–సీఎంఈఆర్ఐ టెస్ట్ బెడ్ వంటి దేశీయ సాంకేతిక సంస్థలతో , పారిశుధ్య స్టార్టప్‌లతో జతకట్టి ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టక తప్పదు. ప్రగతి-50 నిర్దేశించిన కఠినమైన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కేపీఐలను) ను అమలు చేస్తే తప్ప, భవిష్యత్తులో వొచ్చే భారీ వ్యర్థాల సంక్షోభాన్ని ఈ నగరాలు తట్టుకోలేవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *