- సిరిసిల్ల తర్వాత టార్గెట్ సిద్దిపేట, గజ్వేల్
- గులాబీ పార్టీ అధినాయకత్వ స్థావరాలపై నజర్
- కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా కట్టడి చేయడమే లక్ష్యంగా సన్నాహాలు
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, వరంగల్ )
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు.. భారత రాష్ట్ర సమితికి కొండంత అండగా ఉన్న ముఖ్యమైన ముగ్గురిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రధానంగా గురిపెట్టారు. రాజకీయంగా వారి అంతుచూస్తానంటూ పలుసార్లు చేసిన ప్రకటనలో భాగంగా గత ఎన్నికల్లో ఆ పార్టీనైతే మట్టికరిపించగలిగారు. ఇప్పుడు ఆ పార్టీతో పాటు, అధినాయకత్వానికున్న పేరును శాశ్వతంగా తుడిచివేయాలన్న ఆలోచన ఆయన నరనరాల్లో జీర్ణించుకు పోయింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ మూడేళ్ళ కాలంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాల్గొన్న బహిరంగ సభలైతేనేమీ, ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు, చివరకు అసెంబ్లీ సమావేశాల్లోకూడా పాలనాపరమైన ప్రసంగాలకన్నా గత పాలకులపై నిప్పులు కక్కడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యమిచ్చారన్నది ఎవరూ కాదనలేని నిజం. గత ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యాలు, ఆర్థిక దోపిడి, నిమ్నవర్గాలపైన వారి ఆలోచనావిధానాలను ఎత్తిచూపుతూ సమాజంలో దోషిగా నిలబెట్టేవిషయంలో సిఎంగా రేవంత్‌రెడ్డి తన శక్తిమేర కృషిచేస్తూనే ఉన్నారు. 2028లో జరుగనున్న శాసనసభ ఎన్నిక)నాటికి బిఆర్‌ఎస్‌ను ప్రజలకు దూరంచేయాలన్న ఏకైక లక్ష్యంగా ఇప్పటినుండే ఆయన పథక రచన ప్రారంభించారు. అందులో భాగంగానే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గం సిరిసిల్ల, కెసిఆర్ మేనల్లుడు హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, కెసిఆర్ గజ్వెల్ కోటలను బద్దలు కొట్టాలన్నది రేవంత్‌రెడ్డి వ్యూహం. తాజాగా సిరిసిల్లపై ఒకవిధంగా దాడి చేసినంతపని జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాలనుండి లక్షలాదిమంది కాంగ్రెస్ అభిమానులు బుధవారంనాటి సిరిసిల్ల సభకు తరలివచ్చిన విధానంచూస్తే నిజంగానే రేవంత్‌రెడ్డి తన లక్ష్యాన్ని చేరువలో ఉన్నట్లు అనిపించింది. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట నియోజకవర్గాల్లో జరిగినంతగా అభివృద్ధి ఇతర జిల్లాల్లో జరుగలేదన్న వాదన ఉంది. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారంనాటి సిరిసిల్ల పర్యటనలో దాదాపు 350 కోట్ల అభివృద్ధి నిధులకు సంబందించి అనేక శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టడంద్వారా గత పదేళ్ళకాలంలో ప్రజలు ఊహించుకున్నంతగా ఇక్కడ అభివృద్ధి జరుగలేదన్న విషయాన్ని చెప్పకనేచెప్పినట్లైంది.
తర్వాత టార్గెట్ సిద్దిపేట. త్వరలో మరిన్ని నిధులతో సిద్ధిపేటలోకూడా భారీ బహిరంగసభను ఏర్పాటుచేసే ఆలోచన ఉంది. బిఆర్‌ఎస్ పార్టీలో హరీష్‌రావుది కీ రోల్ అన్న విషయం తెలియందికాదు. పార్టీపరమైన కార్యక్రమాల్లోనైతేనేమీ, ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపు విషయంలోనైతేనేమీ, అసెంబ్లీలో అధికారపార్టీకి చెమటలు పట్టించడంలోనైతేనేమీ ఆయనకు ఆయనేసాటి అన్నపేరు హరీష్‌రావుకుంది. అలాంటి వ్యక్తిని పార్టీనుండి దూరం చేయడంద్వారా ఆ పార్టీని బలహీన పర్చాలని చాలాకాలంగా కాంగ్రెస్ అనేక ఎత్తుగడలు, విఫల ప్రచారాలు చేసింది. భూములు కొల్లగొట్టడం, ఫామ్ హౌస్‌లను ఏర్పాటుచేసుకోవటం లాంటి అనేక ఆరోపణలతో రాజకీయదాడిని కాంగ్రెస్ ఇప్పటికే ఆయనపై కొనసాగిస్తున్నది. కాగా ఆ నియోజకవర్గంలోనే హరీష్‌రావును నగ్నంగా నిలబెట్టేందుకు త్వరలోనే సిద్దిపేటలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నది. చివరగా గజ్వెల్‌కోట ముట్టడి. గజ్వెల్ ఎంఎల్‌ఏగా ఎన్నికైనప్పటినుండి స్థానిక ప్రజలకు కెసిఆర్ అందుబాటులో లేకపోవడాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుసార్లు ఎత్తిచూపుతున్నారు. వచ్చే ఎన్నికలనాటికి కెసిఆర్‌ను ఎంత వీలైతే అంతగా ప్రజలముందు దోషిగా నిలబెట్టడంద్వారా ఆయన్ను శాశ్వతంగా రాజకీయాలనుండి దూరం చేయాలన్నది రేవంత్‌రెడ్డి ఆలోచన. పట్టుదలకూడా. ఈ మూడు నియోజకవర్గాల్లో ఎదురులేని నాయకులుగా ఎదిగిన వీరిని ఢీ కొనగల అభ్యర్థుల అన్వేషణ కూడా ఇప్పటికే ప్రారంభమైందనే చెప్పవచ్చు.
బుధవారం నాటి సిరిసిల్ల సభలో సిఎం రేవంత్‌రెడ్డి అదే విషయాన్ని బాహాటంగానే ప్రకటించారు. వీరిని ఎదుర్కుని నిలిచి గెలిచిన వారికి మంత్రి పదవి ఖాయమని ప్రకటించడం ద్వారా రానున్న ఎన్నికల్లో ఈముగ్గురు కాంగ్రెస్ నుండి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందన్నది స్ఫష్టమవుతున్నది. గతంలో ఓటుకు నోటు విషయంలో తనను ఊచలు లెక్కింపజేసిన కెసిఆర్‌ను రాజకీయంగా తొక్కివేయాలన్న కసి రేవంత్‌రెడ్డిలో ఉంది. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టినప్పటినుండీ రేవంత్‌రెడ్డి కెసిఆర్‌మీద, ఆయన కుటుంబ సభ్యులపైనే దాడి మొదలుపెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలకుముందు కాళేశ్వరం కూలడానికి కెసిఆర్ అవినీతే కారణమంటూ గడచిన మూడేళ్ళుగా దాన్ని జాతీయ స్థాయి చర్చనాయాంశంచేయడంలో రేవంత్‌రెడ్డి సఫలమైనారనే చెప్పవచ్చు. అదిమొదలు గత ప్రభుత్వంలోని పలు లోపాలను, అవినీతి అక్రమాలపై నిలదీయటం ప్రారంభించారు. తమ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీ సమావేశాలకు రావాలని సిఎంతోపాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నేతలు డిమాండ్ చేస్తున్నారు. చివరకు స్పీకర్ దళితుడు కావడంవల్లే రావటంలేదని నిందించారు. అసెంబ్లీకి రానిపక్షంలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ పెద్ద ఆందోళనే చేపట్టారు. ఎన్నివిధాలుగా రెచ్చగొట్టినా కెసిఆర్ నుంచి ఉలుకు పలుకులేదు. ఇలాంటి పరిస్థితిలో కెసిఆర్‌ను రెచ్చగొట్టేందుకే సిఎం గజ్వెల్‌లో భారీ స్థాయిలో సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
—–





