తెలంగాణలో విద్యుత్, సాగునీరు, ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు పంటలపై, నేతన్నలు జీవనోపాధిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో గత ప్రభుత్వాన్ని చూపడమే కొనసాగితే ప్రస్తుత పాలన తన బాధ్యతను ఎప్పుడు స్వీకరిస్తుంది? గతంలోని తప్పులను వెలికితీయడంతోపాటు వర్తమాన సమస్యలను పరిష్కరించాలి. గతంపై విచారణ ప్రభుత్వ అధికారమైతే, నేటి ప్రజల అవసరాలు తీర్చడం దాని తప్పనిసరి కర్తవ్యం. రెండింటినీ కలిపి చూడకూడదు.
ముఖ్యమంత్రి ఒక పార్టీకి మాత్రమే నాయకుడు కాదు; మొత్తం రాష్ట్రానికి నాయకుడు. ఆయన మాటల్లో రాజకీయ విమర్శతోపాటు ప్రజల భవిష్యత్తుపై భరోసా ఉండాలి. పాలనపై సమాధానం, సమస్యలకు పరిష్కారం కనిపించాలి. కానీ తెలంగాణ రాజకీయ వాతావరణంలో చర్చ పదేపదే కేసీఆర్, బీఆర్‌ఎస్ చుట్టూనే తిరుగుతున్నది. అధికార కార్యక్రమమైనా, పార్టీ సభైనా ప్రతిపక్షంపై విమర్శలే ప్రధానమైతే ప్రజల సమస్యలకు చోటెక్కడ? ముఖ్యమంత్రి దృష్టి పాలనపైనా, రాజకీయ ప్రత్యర్థులపైనా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అంశాలూ ఈ రాజకీయ ఘర్షణలో వెనక్కిపోతున్నాయా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి చేసిన ఘాటు విమర్శలను రాజకీయ పోరాటంలో భాగంగా చూసినా, ముఖ్యమంత్రి అయ్యాక ఆయన భాషలో బాధ్యత కనిపించాలి. వ్యక్తిగత దూషణలు, బెదిరింపులను తలపించే పదజాలం ఆ పదవి గౌరవాన్ని పెంచవు. ప్రజలు ప్రత్యర్థిని తిట్టే మాటల కోసం ఎదురుచూడటం లేదు. తమ సమస్యలకు సమాధానం కోరుతున్నారు. హోదా మారినప్పుడు వ్యవహారశైలిలోనూ మార్పు రావాలి. విమర్శ విధానాలపై ఉండాలి; వ్యక్తిగత విద్వేషాన్ని పెంచేలా ఉండకూడదు. అధికారంలో ఉన్న నాయకుడి ప్రతి మాట పరిపాలనా వ్యవస్థకూ సందేశమే.
శివకేశవుల అభేదాన్ని చెప్పే ఆధ్యాత్మిక భావనలను రాజకీయ విభేదాల్లోకి లాగడం అవసరమా? మత విశ్వాసాలు ప్రజలను కలిపేందుకు ఉపయోగపడాలి. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఘర్షణకు ప్రతీకలుగా మారకూడదు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి వేర్వేరు పార్టీల నాయకులైనా ఇద్దరూ తెలంగాణ ప్రజాజీవితంలో భాగమే. విధాన విభేదాలను ప్రజాస్వామిక చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి. ప్రజలను శత్రుశిబిరాలుగా విడగొట్టే భాషకు నాయకత్వం దూరంగా ఉండాలి. భావోద్వేగాలను రెచ్చగొట్టడం కంటే ప్రజల మధ్య పరస్పర గౌరవాన్ని కాపాడటం ముఖ్యమంత్రి బాధ్యత.
హామీలపై లెక్క చెప్పాలి
కేసీఆర్‌ను విమర్శిస్తే సభలో చప్పట్లు రావచ్చు. బీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుంటే కార్యకర్తల్లో ఉత్సాహం పెరగవచ్చు. కానీ రైతు పొలానికి కరెంటు, సాగునీరు అందుతాయా? నిరుద్యోగికి ఉద్యోగం వస్తుందా? విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్, నేతన్నకు స్థిరమైన ఉపాధి లభిస్తాయా? రాజకీయ విమర్శలు ఈ ప్రశ్నలకు ప్రత్యామ్నాయ సమాధానాలు కావు. ప్రజలు తమ రోజువారీ జీవితాల్లో మార్పును కోరుతున్నారు. ప్రభుత్వం ప్రకటించే విజయాలు వారి అనుభవాల్లో కనిపించాలి. అప్పుడే పాలనపై నమ్మకం బలపడుతుంది.
అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం మూడేళ్లకు చేరువవుతున్న సందర్భంలో ఎన్ని హామీలు పూర్తయ్యాయి, ఎన్ని పాక్షికంగా అమలయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో వివరించాలి. మిగిలిన వాటికి నిధులు, గడువులు ప్రకటించాలి. ప్రతి ప్రశ్నకూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లతో సమాధానం ఇవ్వలేరు. హామీల అమలుకు ఎదురవుతున్న ఇబ్బందులుంటే వాటినీ నిజాయితీగా చెప్పాలి. ప్రజలకు కావాల్సింది పారదర్శకమైన కార్యాచరణ.
గత ప్రభుత్వ నిర్ణయాలు, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ అవసరమని భావిస్తే చట్టబద్ధంగా జరపవచ్చు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలి. అదే ప్రమాణం అధికారపక్ష నాయకులపై వచ్చే ఆరోపణలకూ వర్తించాలి. విచారణకు పార్టీ రంగు ఉండకూడదు. చట్టం అధికార, ప్రతిపక్ష భేదం చూడకూడదు. ఎంపిక చేసిన వ్యక్తులపైనే చర్యలు తీసుకుంటున్నారనే అనుమానం కలిగితే వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతింటుంది. నిష్పాక్షికత మాటల్లోనే కాకుండా ఆచరణలో కనిపించాలి. అదే ప్రజాస్వామిక పాలనకు కొలమానం.
సిరిసిల్లకు కావాల్సింది పరిష్కారాలు
సిరిసిల్లలో రాజకీయ సభ నిర్వహించడం తప్పుకాదు. అయితే ఆ సభ ప్రజలకు ఇచ్చే సందేశమేమిటన్నదే ప్రశ్న. నేతన్నల సమస్యలకు ప్రత్యేక కార్యాచరణ ఉన్నదా? చేనేత, పవర్‌లూమ్ రంగాలకు దీర్ఘకాలిక భరోసా ఏమిటి? యువతకు ఉపాధి అవకాశాలు ఎలా కల్పిస్తారు? జిల్లా సమస్యలకు గడువుతో కూడిన పరిష్కారాలు ప్రకటిస్తున్నారా? ఈ అంశాలు ప్రధానంగా ఉండాలి. జనసమీకరణ బలాన్ని ప్రదర్శించడం కంటే స్థానిక ప్రజల కష్టాలను వినడం, వాటిని పరిష్కరించడం ముఖ్యం.
నేతన్న కుటుంబానికి కావాల్సింది రాజకీయ ఆధిపత్య ప్రదర్శన కాదు; నిరంతర ఉపాధిపై నమ్మకం. యువతకు కావాల్సింది ప్రత్యర్థిపై విమర్శ కాదు; తమ భవిష్యత్తుకు మార్గం. సిరిసిల్లను రాజకీయ పోరాట వేదికగా మాత్రమే చూస్తే అక్కడి ప్రజల అవసరాలు మరుగునపడతాయి. సమస్యలను వినేందుకు, పరిష్కారాల పురోగతిని సమీక్షించేందుకు ప్రభుత్వం నిరంతర సంప్రదింపులు జరపాలి. సభలో చేసిన ప్రకటనలకు తరువాతి చర్యలు ఉండాలి. అప్పుడే పర్యటనకు ప్రజాప్రయోజనం చేకూరుతుంది.
తెలంగాణలో విద్యుత్, సాగునీరు, ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రైతులు పంటలపై, నేతన్నలు జీవనోపాధిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమయంలో గత ప్రభుత్వాన్ని చూపడమే కొనసాగితే ప్రస్తుత పాలన తన బాధ్యతను ఎప్పుడు స్వీకరిస్తుంది? గతంలోని తప్పులను వెలికితీయడంతోపాటు వర్తమాన సమస్యలను పరిష్కరించాలి. గతంపై విచారణ ప్రభుత్వ అధికారమైతే, నేటి ప్రజల అవసరాలు తీర్చడం దాని తప్పనిసరి కర్తవ్యం. రెండింటినీ కలిపి చూడకూడదు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. హామీలను గుర్తుచేయడాన్ని శత్రుత్వంగా భావించకూడదు. విమర్శించినవారిని అవమానించే భాషకు బదులు సమాధానం చెప్పే సంస్కృతి అవసరం. ప్రజల ప్రశ్నలు పాలనను మెరుగుపరచుకునే అవకాశాలు. వాటిని వినగలిగే సహనం నాయకత్వానికి బలం. ప్రభుత్వం తన పనితీరును వివరించి, లోపాలను సవరించుకుంటే విమర్శలకు ఆచరణలోనే సమాధానం లభిస్తుంది.
తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది రాజకీయ దండయాత్రలకంటే స్పష్టమైన పాలనా దిశ. రైతుకు భరోసా, నిరుద్యోగికి అవకాశం, విద్యార్థికి చదువు కొనసాగించే భద్రత, నేతన్నకు ఉపాధి కల్పించాలి. ఇచ్చిన హామీలపై ప్రజలకు లెక్క చెప్పాలి. కేసీఆర్‌పై ఎన్ని విమర్శలు చేశారన్నదానికంటే ముఖ్యమంత్రిగా ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారన్నదే ప్రజల తీర్పుకు ఆధారం. ప్రజాస్వామ్యంలో అసలు శక్తి మైక్‌లో కాదు; ప్రజల చేతుల్లో ఉంటుంది. అందుకే వారు అడుగుతూనే ఉంటారు: “కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు… మాకిచ్చిన హామీల గురించి ఎప్పుడు సమాధానం చెబుతారు?”
జీడిపల్లి రాంరెడ్డి
Ma, Mcj ప్రిలాన్స్ జర్నలిస్ట్ 9666680051





