పెరుగుతున్న డిమాండ్…తడబడుతున్న ‘ధర్మల్’!

తెలంగాణ విద్యుత్ రంగం ప్రస్తుతం తీవ్రమైన డిమాండ్-సరఫరా అంతరం అంచున నిలిచి ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 65.01 శాతంగా ఉన్న రాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్), 2025-26 నాటికి 56.86 శాతానికి పడిపోవడం ఉత్పాదక సామర్థ్య క్షీణతకు అద్దం పడుతున్నది. జాతీయ సగటు (63.07%) కంటే ఇది చాలా తక్కువ.మరోవైపు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అంచనాలకు మించి పెరుగుతున్నది . ఇటీవల అక్టోబర్ 16, 2026న రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పీక్ పవర్ డిమాండ్ 20,018 మెగావాట్ల ఆల్-టైమ్ రికార్డును తాకింది.

సాధారణంగా వర్షాకాలం ముగిసే అక్టోబర్ నెలలో 15,000 మెగావాట్ల లోపు ఉండాల్సిన పీక్ డిమాండ్, ఎల్‌నినో కారణంగా ఏకంగా 20,018 మెగావాట్లకు చేరడం అధికారుల అంచనాలను తలకిందులు చేసింది. 2026 జూన్–సెప్టెంబర్ మధ్య తెలంగాణలో సాధారణం కంటే 46 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వర్షాకాలంలో సైతం రైతులు రాష్ట్రంలోని సుమారు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లను నిరంతరాయంగా వాడాల్సి వొచ్చింది . ఈ అనుభవం నేపథ్యంలో రాబోయే వేసవి (2027) నాటికి రాష్ట్ర పీక్ డిమాండ్ 23,000 నుండి 24,000 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు ఇప్పుడు అంచనా వేస్తున్నారు. కాగా 2035-36 నాటికి ఈ పీక్ డిమాండ్ 29,812 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రం వద్ద ఉన్న కాంట్రాక్టెడ్ సామర్థ్యం సుమారు 20,520 మెగావాట్లు మాత్రమే. ఇందులో 8,030 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం (5,165 మెగావాట్ల సౌర విద్యుత్‌తో కలిపి) ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో బేస్ లోడ్ అందించే థర్మల్ ప్లాంట్ల పాత్ర కీలకం.

భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇటీవలే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) 7,300 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ , 8,000 మెగావాట్-అవర్ల ఎనర్జీ స్టోరేజ్ కొనుగోలుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తయి, థర్మల్ ప్లాంట్ల పనితీరు మెరుగుపడితేనే రాబోయే దశాబ్దంలో రాష్ట్రం ఇంధన సంక్షోభాన్ని అధిగమించగలదు. ఒక రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, పారిశ్రామిక వికాసానికి, వ్యవసాయ స్థిరత్వానికి నిరంతరాయమైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం. అయితే, తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన గణాంకాలు రాబోయే పెను ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 56.86 శాతానికి పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.

జాతీయ సగటు కంటే ఇది చాలా తక్కువగా నమోదవడం రాష్ట్ర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ఒకవైపు గృహ, వ్యవసాయ, వాణిజ్య అవసరాల రీత్యా విద్యుత్ డిమాండ్ ఏటేటా రికార్డు స్థాయిలో పెరుగుతున్నది . ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ , తయారీ రంగాలు వేగంగా విస్తరిస్తుండటంతో భవిష్యత్తులో విద్యుత్ వినియోగం మరింత భారీగా పెరగనుంది. ఇటువంటి కీలక తరుణంలో బేస్ లోడ్ విద్యుత్‌కు ప్రధాన ఆధారమైన థర్మల్ ప్లాంట్ల పనితీరు మందగించడం ఏమాత్రం శుభపరిణామం కాదు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ రంగ థర్మల్ కేంద్రాలు కాలం చెల్లిన యంత్రాలతో, తీవ్ర నిర్వహణ లోపాలతో సతమతమవుతున్నాయి. తరచూ బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తడం, బొగ్గు సరఫరాలో సమన్వయ లోపం, నాణ్యత లేని బొగ్గు వినియోగం వంటి కారణాలు ఉత్పత్తి సామర్థ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి.

మరోవైపు, పర్యావరణ హితమైన పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుంది . తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం భవిష్యత్ తరాలకు మంచిదే. కానీ, వాస్తవ పరిస్థితులను విస్మరించకూడదు. సౌర విద్యుత్ కేవలం పగటిపూట మాత్రమే లభ్యమవుతుంది. పీక్ అవర్స్‌లో, ముఖ్యంగా సాయంత్రం , రాత్రి వేళల్లో పెరిగే గృహ, పారిశ్రామిక డిమాండ్‌ను తట్టుకోవాలంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయడం తప్పనిసరి. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసే భారీ బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలు పూర్తిస్థాయిలో, చౌకగా అందుబాటులోకి వొచ్చేంత  వరకు థర్మల్ ప్లాంట్ల ప్రాధాన్యత ఏమాత్రం తగ్గదు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ముందుగా పాత థర్మల్ ప్లాంట్ల ఆధునీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, నిర్వహణ లోపాలను యుద్ధప్రాతిపదికన సవరించాలి. బొగ్గు నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సింగరేణి కాలరీస్‌తో పటిష్టమైన సమన్వయం చేసుకోవాలి. అదే సమయంలో, కొత్తగా చేపడుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కేవలం ఉత్పత్తి పెంచడమే కాకుండా, విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కూడా అంతే ముఖ్యం. పేరుకుపోయిన అప్పులు, ప్రభుత్వ శాఖల బకాయిలు, సాంకేతిక , పంపిణీ నష్టాలు డిస్కంలను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఖజానాపై మోయలేని భారం పడుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *