సామాన్యుడికి ద్రవ్యోల్బణ సెగ!

దేశ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం మళ్లీ సవాలు విసురుతున్నది . సెప్టెంబర్ నెలలో 5.54 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, అక్టోబర్ నాటికి 6.09 శాతానికి చేరడం ఆందోళన కలిగించే అంశం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ట సహన పరిమితిని ఇటీవలి కాలంలో ఇది తొలిసారిగా దాటింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ గణాంకాలు రావడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మింగుడుపడని విషయమే. రాబోయే నెలల్లో వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.  మితమైన ద్రవ్యోల్బణం (2% – 4% మధ్య) ఆర్థిక వృద్ధికి సంకేతంగా పనిచేస్తుంది, కానీ అది 6 శాతం దాటి అదుపు తప్పితే ప్రజల ఖర్చులను, కంపెనీల పెట్టుబడులను తగ్గించి దేశ జీడీపీ వృద్ధిని వెనక్కి లాగుతుంది.

ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఆహార పదార్థాల ధరలే. ముఖ్యంగా కూరగాయలు, పప్పుధాన్యాలు, వంట నూనెల ధరలు అదుపు తప్పాయి. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు, తుఫాన్ల వల్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనివల్ల మార్కెట్‌లోకి సరుకుల సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో ధరలు భగ్గుమన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాలు కూడా పరోక్షంగా దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం ప్రతి వస్తువు ధర పెరుగుదలకు దారితీస్తుంది .

ముడిసరుకుల వ్యయం పెరగడం వల్ల కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుంది . ముడిసరుకుల ధరలు పెరగడంతో సబ్బులు, నూనెలు వంటి రోజువారీ వస్తువుల ధరలు పెరగడం వల్ల గ్రామీణ డిమాండ్ మందగించే సూచనలు కనిపిస్తున్నాయి.  దేశీయంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, ఇక్కడ తయారయ్యే వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఇతర దేశాల ఉత్పత్తులతో పోలిస్తే మన వస్తువులు ఖరీదైనవిగా మారడం వల్ల ఎగుమతులు తగ్గే అవకాశం ఉంటుంది. ఎగుమతులు తగ్గడం కూడా జీడీపీ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఒకవేళ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతూ, అదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు పడిపోతూ, నిరుద్యోగం పెరిగితే ఆ పరిస్థితిని ఆర్థిక పరిభాషలో ‘స్టాగ్‌ఫ్లేషన్’ అంటారు. ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం బహుముఖంగా ఉంటుంది. మొదటిది, ఇది సామాన్యుడి కొనుగోలు శక్తిని దెబ్బతీస్తుంది. నెలవారీ బడ్జెట్‌లో అత్యధిక భాగం కేవలం ఆహారం, నిత్యావసరాలకే ఖర్చయిపోతుండటంతో ఇతర అవసరాలకు, పొదుపునకు అవకాశం లేకుండా పోతుంది . రెండవది, ఆర్థిక వృద్ధిపై దీని ప్రభావం పడుతుంది. ప్రజల వద్ద ఖర్చు చేయడానికి డబ్బు తగ్గితే, మార్కెట్‌లో వస్తువులకు డిమాండ్ తగ్గి పారిశ్రామిక ఉత్పత్తి మందగిస్తుంది. మూడవది, ఆర్‌బీఐ ద్రవ్య విధానంపై ఒత్తిడి పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను వాయిదా వేయక తప్పదు. దీనివల్ల గృహ, వాహన, వ్యాపార రుణాలపై వడ్డీ భారం అలాగే కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంపైనా ద్రవ్యోల్బణం ప్రతికూల ప్రభావం చూపుతుంది . ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోతను వాయిదా వేస్తే, గృహ రుణాల డిమాండ్‌పై ప్రభావం పడుతుంది.  దీనివల్ల గృహ రుణాలపై (హోమ్ లోన్స్) వడ్డీ రేట్లు భారంగానే కొనసాగుతాయి. దీనికి తోడు సిమెంట్, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణ వ్యయం అధికమై, సామాన్యులకు సొంతింటి కల మరింత భారంగా మారుతుంది .

అదేవిధంగా, స్టాక్ మార్కెట్ వర్గాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగితే కంపెనీల లాభదాయకత తగ్గుతుందనే ఆందోళనతో మదుపరులు అప్రమత్తమవుతున్నారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) తమ పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉండటంతో, దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల కంపెనీలు ఉత్పత్తుల ధరలను పెంచాల్సి వొస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాలు , రోజువారీ వినియోగ వస్తువుల అమ్మకాలు మందగిస్తాయి.

ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం, ఆర్‌బీఐ సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కేవలం వడ్డీ రేట్ల నియంత్రణతోనే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అదుపు చేయడం సాధ్యం కాదు. సరఫరా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడం అత్యంత ముఖ్యం. బఫర్ నిల్వల నుంచి పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు వంటి నిత్యావసరాలను మార్కెట్‌లోకి విడుదల చేయాలి. అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దిగుమతి సుంకాలను సవరించడం ద్వారా దేశీయంగా కొరత ఉన్న వస్తువులను తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలి. దీర్ఘకాలంలో వ్యవసాయ మౌలిక సదుపాయాలను, శీతల గిడ్డంగులను పెంచడం ద్వారా పంట నష్టాలను నివారించవొచ్చు. ద్రవ్యోల్బణం అనేది కేవలం ఆర్థిక గణాంకాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, అది కోట్లాది కుటుంబాల జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న అంశం. ఆర్థిక వృద్ధికి ఆటంకం కలగకుండా, సామాన్యుడిపై ధరల భారం పడకుండా ప్రభుత్వం తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడి, ప్రజలకు ఊరట లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *