ప్ర‌పంచ‌స్థాయి న‌గ‌రాల‌తో హైద‌రాబాద్ పోటీ ప‌డాలి..

ఐఎస్​బీ లీడ‌ర్ షిప్​ సమ్మిట్​ లో సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర : మ‌న హైద‌రాబాద్ దేశంలోని నగరాలతో కాకుండా న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో , సియోల్‌ వంటి ప్ర‌పంచ స్థాయి నగరాలతో పోటీపడాలని కోరుకుంటున్నాన‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైద‌రాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన ఐఎస్​బీ​ సమ్మిట్ (ISB Summit)​ లో సీఎం రేవంత్​ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఐఎస్​బీ విద్యార్థులు దేశానికి ఆదర్శంగా ఉండాలని ఐఎస్​బీ స్టూడెంట్స్​కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందంటూ.. న్యూయార్క్, పారిస్​ సిటీలతో హైదరాబాద్​ పోటీపడాలన్నారు. ఐఎస్ బీ​ లీడర్​ షిప్​లో భాగస్వామ్యం కావడం సంతోషంగా రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప నాయ‌కుడుగా ఎద‌గాలంటేప్రజలతో మమేకం అవ్వాల్సిందేనన్నారు, తెలంగాణలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ఐఎస్‌బిలో చదువుకుంటున్న యువకులు, తెలివైనవారు, అసాధారణ విద్యార్థులని కొనియాడారు. త‌న‌ జీవితం, రాజకీయాల నుంచి నాయకత్వం గురించి నేర్చుకున్నానని, కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన వారసత్వ సంప‌ద వుంద‌ని తెలిపారు. మహాత్మాగాంధీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే దీనికి ఉదాహరణ అని వివ‌రించారు. ఎంతటి గొప్ప నాయకుడికైనా ధైర్యం ఉండ‌డం చాలా ముఖ్యమ‌ని,
తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా అవసర‌మ‌ని అన్నారు. కొన్నిసార్లు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంద‌ని, రిస్క్ తీసుకోకుండా కొన్ని సాధించలేమ‌ని తెలిపారు. గొప్ప నాయకులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారని, మన కాంగ్రెస్ నాయకులు, ప్రజల కోసం తమ వృత్తిని, డబ్బును, సుఖాలను, వారి జీవితాన్ని కూడా త్యాగం చేశారని తెలిపారు. మీరు మంచి నాయకుడిగా ఎదగాలంటే, ముందుగా ధైర్యం, త్యాగం అనే రెండు విలువల గురించి ఆలోచించాల‌ని, మీకు ధైర్యం ఉంటే, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు విజయం సాధిస్తారు. ప్రజలతో నిత్యం నేరుగా సంబంధాలు పెట్టుకోవాలి. పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తు స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాల‌ని సూచించారు.ఐఎస్‌బి విద్యార్థులుగా మీరు హైదరాబాద్, తెలంగాణతో పాటు న్యూ ఇండియా కు బ్రాండ్ అంబాసిడర్‌లుగా నిల‌వాల‌ని ఆకాంక్షించారు. తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల జిడిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే త‌మ లక్ష్యమ‌ని, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్‌ను 600 బిలియన్ డాలర్ల నగరంగా మార్చాల‌ని పిలుపునిచ్చారు.

తెలంగాణను ప్రపంచంలోని ప్రతి భాగానికి తీసుకెళ్లడానికి నాకు మీ సాయం కావాల‌ని, మీరు ఎక్కడికి వెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్ గురించి మాట్లాడాల‌ని కోరారు. ప్రపంచంలోనే భారతదేశం, హైదరాబాద్ అత్యుత్తమంగా మారాలన్నది పెద్ద లక్ష్యంమ‌ని కానీ ఇది అసాధ్యమేమీ కాద‌ని చెప్పారు. మా ప్రభుత్వంతో మీరు రెండు మూడేళ్లు కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. తాను సౌత్ కొరియాలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ని సందర్శించాన‌ని, సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్ లో అనేక పథకాలు సాధించిందని, మన దేశం ఒలింపిక్స్ లో ఒక్క బంగారు పథకం కూడా సాధించలేకపోయింద‌ని తెలిపారు. హైదరాబాద్ ను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నదే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *