“వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పునర్భరించడం, నదుల పరివాహక ప్రాంతాలను కాపాడటం వంటి చర్యలు కరువు ప్రభావాన్ని తగ్గించగలవు. తెలంగాణ వంటి ప్రాంతాల్లో ప్రతి చెరువు ఒక జలాశయం మాత్రమే కాదు.. భవిష్యత్తు వాతావరణానికి ఒక రక్షణ నిలయం. వ్యవసాయంలో పంటల వైవిధ్యం, తక్కువ నీటితో పండే పంటలు, నేలలో తేమను నిలిపే పద్ధతులు రైతులను వాతావరణ అనిశ్చితి నుంచి కొంతమేర కాపాడగలవు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, పంటల బీమా, సమర్థవంతమైన సాగునీటి పద్ధతులు ఈ రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేస్తాయి..”

ప్రకృతి వైపరీత్యాలను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో అధిగమించవచ్చా? ప్రకృతి తన సమతౌల్యాన్ని కోల్పోతే.. దాన్ని తిరిగి నిలబెట్టే శక్తి మనిషి సృష్టించిన సాంకేతికతకు ఉందా? ఎల్‌నినో వంటి వాతావరణ అసమతౌల్యాలను ముందుగానే పసిగట్టడమే కాదు.. వాటి ప్రభావాన్ని తగ్గించే, దెబ్బతిన్న ప్రకృతి వ్యవస్థలను తిరిగి సమతుల్యం చేసే పరిష్కారాలను శాస్త్రం అందించగలదా? వాతావరణ మార్పుల సంకేతాలను చదవగలిగిన శాస్త్రం.. వాటికి నివారణ మార్గాలను కూడా చూపగలదా? ఇవి ప్రయోగశాలల్లోనే మిగిలిపోయే ప్రశ్నలు కావు. రైతు పొలంలో పంట పండుతుందా లేదా, ఒక గ్రామంలో తాగునీరు దొరుకుతుందా లేదా, ఒక నగరం ఎండను తట్టుకుంటుందా వర్షానికి మునిగిపోతుందా అన్న ప్రశ్నలివి. వీటికి సమాధానం వెతికే ప్రతి ప్రయత్నం మానవాళి భవిష్యత్తుకు ఒక రక్షణ కవచం.
మనిషి ప్రకృతి రహస్యాలను ఛేదిస్తూ ఆకాశాన్ని అందుకున్నాడు. సముద్ర గర్భాన్ని శోధిస్తున్నాడు. అణువులోని శక్తిని వెలికితీశాడు. కృత్రిమ మేధతో తన సామర్థ్యాలకు కొత్త హద్దులు గీసుకుంటున్నాడు. అయినా ప్రకృతి మాత్రం తనదైన భాషలో హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఎక్కడో కరువు.. ఇంకెక్కడో కుండపోత.. ఒకచోట భరించలేని వేడి.. మరోచోట ఆకస్మిక వరద. ఈ విరుద్ధ దృశ్యాలన్నింటి వెనుక వాతావరణ వ్యవస్థలోని సంక్లిష్టమైన పరస్పర సంబంధాలు పనిచేస్తున్నాయి. సముద్రం, గాలి, మేఘం, నేల, వర్షం.. ఏదీ ఒంటరిగా పనిచేయదు.
ఈ నేపథ్యంలో ఎల్‌నినో ఒక ముఖ్యమైన ఉదాహరణ. ప్రశాంత మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కడం ఎల్‌నినో పరిణామానికి దారితీస్తుంది. సముద్రం వేడెక్కితే గాలుల గమనం మారుతుంది. గాలుల గమనం మారితే మేఘాల ప్రయాణం మారుతుంది. మేఘాల ప్రయాణం మారితే వర్షపాతం స్వభావం మారుతుంది. ఒక సముద్ర ప్రాంతంలో మొదలైన ఉష్ణోగ్రత మార్పు వేల కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయం, నీటి లభ్యత, ఆహార భద్రతను ప్రభావితం చేయగలదు. ప్రకృతి వ్యవస్థల అనుసంధానాన్ని ఇంత స్పష్టంగా చూపించే ఉదాహరణ మరొకటి ఉండకపోవచ్చు.
ఎల్‌నినోను మనిషి ఆపలేడు. కానీ దాని ఆనవాళ్లను ముందుగానే గుర్తించగలడు. ఉపగ్రహాలు, సముద్ర పరిశీలనా పరికరాలు, తేలియాడే కొలమాన వ్యవస్థలు సముద్ర ఉష్ణోగ్రతలు, గాలుల వేగం, సముద్ర ప్రవాహాల్లో మార్పులను నిరంతరం నమోదు చేస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత వాతావరణ నమూనాలు ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి. కృత్రిమ మేధ కూడా ఇప్పుడు ఈ ప్రక్రియకు తోడవుతోంది. గత వాతావరణ సమాచారాన్ని ప్రస్తుత పరిణామాలతో పోల్చి, రానున్న మార్పులను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతోంది. వాతావరణ శాస్త్రం ‘ఏం జరగబోతోంది?’ అనే ప్రశ్నకు సమాధానం చెప్పే స్థాయి నుంచి ‘దానికి ఎలా సిద్ధం కావాలి?’ అనే దిశగా కదులుతోంది.
అయితే ముందస్తు అంచనా మాత్రమే సరిపోదు. ఆ సమాచారాన్ని కార్యాచరణగా మార్చే వ్యవస్థ కూడా కావాలి. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ముందే తెలిస్తే రైతులు పంటల ఎంపిక మార్చుకోవచ్చు. సాగునీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించవచ్చు. ప్రభుత్వాలు నీటి నిల్వలు, పశుసంరక్షణ, ఆహార భద్రతకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. పట్టణాలు నీటి నిర్వహణ, వేడిగాలుల నివారణకు సిద్ధం కావచ్చు. అంటే విపత్తును ఆపలేకపోయినా.. అది విపత్తుగా మారే తీవ్రతను తగ్గించవచ్చు.
ఇక్కడే శాస్త్రం మరో క్లిష్టమైన ప్రశ్నను ఎదుర్కొంటోంది. సముద్రాలను కృత్రిమంగా చల్లబరచి ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించగలమా? సూర్యకిరణాలను కొంతమేర పరావర్తనం చేసేలా మేఘాల లక్షణాలను మార్చడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే మార్గాలను అన్వేషించడం వంటి జియోఇంజినీరింగ్ ఆలోచనలు శాస్త్రీయ చర్చలో ఉన్నాయి. కానీ ఇవి ఇప్పటికీ పరిశోధనల దశలోనే ఉన్నాయి. ప్రకృతి వ్యవస్థలో ఒకచోట చేసిన జోక్యం మరోచోట అనూహ్య పరిణామాలకు దారితీయవచ్చు. ఒక ప్రాంతంలో కరువు తగ్గించే ప్రయత్నం మరో ప్రాంతంలో వర్షపాతాన్ని మార్చితే? సముద్ర జీవజాలం దెబ్బతింటే? ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు లేని పరిస్థితిలో ప్రకృతి గమనాన్ని కృత్రిమంగా మార్చడం తొందరపాటు నిర్ణయమే అవుతుంది.
అందుకే అసలు పరిష్కారం ప్రకృతిలోనే వెతకాలి. అడవులు, నదులు, చెరువులు, చిత్తడి నేలలు, మడ అడవులు పర్యావరణానికి సహజ రక్షణ కవచాలు. అడవులు నేలలో తేమను నిలబెట్టి స్థానిక ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. చిత్తడి నేలలు అదనపు నీటిని ఒడిసిపట్టి వరద ప్రభావాన్ని తగ్గిస్తాయి. మడ అడవులు తీర ప్రాంతాలను తుపానులు, సముద్ర కోత నుంచి కాపాడతాయి. అభివృద్ధి పేరుతో ఈ సహజ వ్యవస్థలను ధ్వంసం చేసుకుని, తరువాత కృత్రిమ పరిష్కారాల కోసం వెతకడం విరుద్ధమైన ప్రయాణం. ప్రకృతిని రక్షించడం కూడా ఒక శాస్త్రీయ పరిష్కారమే.
వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పునర్భరించడం, నదుల పరివాహక ప్రాంతాలను కాపాడటం వంటి చర్యలు కరువు ప్రభావాన్ని తగ్గించగలవు. తెలంగాణ వంటి ప్రాంతాల్లో ప్రతి చెరువు ఒక జలాశయం మాత్రమే కాదు.. భవిష్యత్తు వాతావరణానికి ఒక రక్షణ నిలయం. వ్యవసాయంలో పంటల వైవిధ్యం, తక్కువ నీటితో పండే పంటలు, నేలలో తేమను నిలిపే పద్ధతులు రైతులను వాతావరణ అనిశ్చితి నుంచి కొంతమేర కాపాడగలవు. వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, పంటల బీమా, సమర్థవంతమైన సాగునీటి పద్ధతులు ఈ రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ప్రకృతి విపత్తుల తర్వాత నష్టపరిహారం అందించడం కంటే.. విపత్తు రాకముందే నష్టాన్ని తగ్గించే వ్యవస్థలను నిర్మించడం చౌకైనదీ, శాశ్వతమైనదీ.
వాతావరణ సంక్షోభాన్ని కేవలం విపత్తు నిర్వహణ సమస్యగా చూడటం సరైంది కాదు. ఇది మన అభివృద్ధి నమూనాను పునరాలోచించాల్సిన సందర్భం. నగరాలు విస్తరించే తీరు, రహదారులు నిర్మించే విధానం, పరిశ్రమలకు నీరు కేటాయించే పద్ధతి, వ్యవసాయ భూముల వినియోగం, తీర ప్రాంతాల్లో నిర్మాణాల నియంత్రణ.. ప్రతి నిర్ణయానికీ వాతావరణ ప్రభావం అనే కొలమానం జత కావాలి. శాస్త్రవేత్తల హెచ్చరికలు నివేదికలకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లోకి, గ్రామీణ ప్రణాళికల్లోకి, పట్టణ రూపకల్పనలోకి చేరాలి.
మరో ముఖ్యమైన అంశం భూతాపాన్ని తగ్గించడం. ఎల్‌నినో సహజ వాతావరణ పరిణామమే అయినప్పటికీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దాని ప్రభావాలతో ముడిపడే వేడి, కరువు, అతివృష్టి వంటి తీవ్ర పరిస్థితుల నష్టాన్ని పెంచగలవు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధనాలను విస్తరించడం, అడవులను కాపాడటం, నీటి వనరులను పునరుద్ధరించడం దీర్ఘకాలిక పరిష్కారంలో భాగం కావాలి. వాతావరణ సంక్షోభానికి సరిహద్దులు లేనందున శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారం కూడా అవసరం.
ఎల్‌నినోను మాత్రమే నిందించడం సమస్యను చిన్నదిగా చూడటమే. అసలు సవాలు ప్రకృతి వ్యవస్థలపై మనిషి పెంచుతున్న ఒత్తిడిని తగ్గించడం. శాస్త్రం ప్రకృతి ఏం చేయబోతోందో ముందుగానే చెప్పాలి. అదే సమయంలో మనిషి ఏం చేయాలో కూడా సూచించాలి. ముందస్తు హెచ్చరిక ప్రాణాలను కాపాడుతుంది. కృత్రిమ మేధ అంచనాలను మెరుగుపరుస్తుంది. ప్రకృతి ఆధారిత పరిష్కారాలు పర్యావరణానికి తట్టుకునే శక్తిని పెంచుతాయి. బాధ్యతాయుతమైన విధానాలు ఆర్థిక, సామాజిక నష్టాలను తగ్గిస్తాయి.
ఎల్‌నినోను ఓడించడం అంటే సముద్రాన్ని మన ఇష్టానుసారం మార్చడం కాదు. దాని దెబ్బను తట్టుకునే సమాజాన్ని, ప్రకృతిని నిర్మించడం. ప్రకృతిపై ఆధిపత్యం సాధించడం శాస్త్ర విజయం కాదు. ప్రకృతి పరిమితులను అర్థం చేసుకుని, దానితో సహజీవనం చేసే జ్ఞానాన్ని పెంచుకోవడమే నిజమైన శాస్త్రీయ పురోగతి. ప్రకృతిని జయించాలన్న ఆరాటం నుంచి ప్రకృతిని కాపాడాలన్న బాధ్యత వైపు మానవాళి అడుగులు మళ్లినప్పుడే వాతావరణ సంక్షోభానికి నిజమైన సమాధానం దొరుకుతుంది.
పెండ్యాల కొండల్





