“ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద కార్యదర్శిగా పనిచేశారు. హోం మంత్రిత్వ శాఖతో ఆయనకు ఉన్న ఈ ప్రత్యక్ష సంబంధాల వల్లే ఆయన ప్రభుత్వానికి ‘ఏజెంట్’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిషన్ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన వ్యక్తులు కార్యనిర్వాహక వ్యవస్థకు లొంగిపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.”

భారత ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటి ఎన్నికల సంఘం (ECI) ప్రస్తుతం అత్యంత తీవ్రమైన సంస్థాగత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికల కమిషనర్ల చర్యలు ఈ రాజ్యాంగబద్ధ సంస్థ యొక్క నిష్పాక్షికతను మరియు స్వయంప్రతిపత్తిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.సంస్థాగత వైఫల్యం: ముగ్గురు సభ్యుల కమిషన్ ఉండాల్సిన చోట, నిర్ణయాలన్నీ ఏకపక్షంగా, ఒకే వ్యక్తి కనుసన్నలలో జరుగుతున్నాయని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కథనం వెల్లడించింది. సిఇసి ఎవరి కనుసన్నల్లో పనిచేస్తున్నారనే అనుమానం ప్రజల్లో ప్రబలింది. వోటర్ల భారీ తొలగింపు: ‘సర్’ ప్రక్రియ ద్వారా సుమారు 13 కోట్ల మంది వోటర్లను జాబితా నుండి తొలగించడం ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం: కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, ప్రభుత్వ ఉన్నతాధికారులకు , రాజకీయ నాయకత్వానికి జవాబుదారీగా మారడం సంస్థాగత పతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘం ఒక సామూహిక విభాగం. కానీ, ప్రస్తుత పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. గత 10 నెలల కాలంలో 14 సందర్భాలలో ఇద్దరు కమిషనర్లు (సంధు మరియు జోషి) లిఖితపూర్వకంగా వ్యక్తం చేసిన అభ్యంతరాలను లేదా వారి సూచనలను పూర్తిగా విస్మరించడం గమనార్హం.
సీఈసీ నియంతృత్వం
అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, సుమారు నాలుగు నెలల పాటు కమిషన్ ఎటువంటి అధికారిక సమావేశాలు నిర్వహించలేదు. ఎన్నికల కమిషన్ అంటే మెజారిటీ సభ్యుల సముదాయం. ఇద్దరు సభ్యుల అభిప్రాయాలను తోసిరాజని కేవలం ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధంగా నిలబడవు , అవి ‘చట్టవిరుద్ధం’ . ప్రోటోకాల్ ప్రకారం ప్రతి నిర్ణయం చర్చల ద్వారా, మెజారిటీ ప్రాతిపదికన జరగాలి, కానీ ఇక్కడ రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్నారు.
2024లో 98 కోట్లుగా ఉన్న వోటర్ల సంఖ్య, జనాభా పెరిగినప్పటికీ 2025 నాటికి 88 కోట్లకు పడిపోయే ప్రమాదం ఉంది. సర్ ప్రక్రియ ద్వారా జరుగుతున్న ఈ భారీ తొలగింపు వెనుక కుట్ర ఉందని విమర్శలు వస్తున్నాయి. కమిషన్ అధికారిక ఆదేశం లేకుండానే చట్టవిరుద్ధంగా ఫామ్ 6 నిబంధనలను మార్చడం,ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల (ERO) చట్టబద్ధమైన అధికారాలను సాఫ్ట్‌వేర్ ద్వారా కేంద్రీకృతం చేయడం, 2002 నాటి పాత రికార్డులతో మ్యాపింగ్ చేయడం మరియు ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ టూల్స్ వాడటం వంటి దురాగతాలకు ఈసీ పాల్పడి నేడు ప్రజల ఆగ్రహానికి గురవుతున్నది.
కమిషనర్ల నేర్పరితనం
కమిషనర్లు సంధు , జోషి, ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌ను వ్యక్తిగతంగా కలవడం అత్యంత వివాదాస్పదమైంది. ఒక స్వతంత్ర రాజ్యాంగ సంస్థలోని సభ్యులు ప్రభుత్వ బ్యూరోక్రాట్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడం రాజ్యాంగ మర్యాదలకు విరుద్ధం.ఇది “అంపైర్ వెళ్లి కెప్టెన్‌కు రిపోర్ట్ చేయడం” వంటిదని రాజకీయ పండితులు ఎద్దేవా చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద కార్యదర్శిగా పనిచేశారు. హోం మంత్రిత్వ శాఖతో ఆయనకు ఉన్న ఈ ప్రత్యక్ష సంబంధాల వల్లే ఆయన ప్రభుత్వానికి ‘ఏజెంట్’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమిషన్ స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన వ్యక్తులు కార్యనిర్వాహక వ్యవస్థకు లొంగిపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
ఇద్దరు కమిషనర్లు వ్రాసిన 14 నోట్ల వెనుక ఉన్న ఉద్దేశ్యంపై కూడా సందేహాలు ఉన్నాయి. వారు ఈసీని సంస్కరించాలని కాకుండా, భవిష్యత్తులో ఏదైనా విచారణ ఎదురైతే తమను తాము రక్షించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ నోట్లు వ్రాసి ఉండవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఉన్న రాజ్యాంగ రక్షణ ఇతర కమిషనర్లకు లేదు. దీనివల్ల వారు తమను తాము ‘ప్రొబేషనర్లు’ గా భావిస్తూ, ప్రభుత్వం పట్ల విధేయత చూపక తప్పని స్థితిలో ఉన్నారు. గతంలో అశోక్ లవాసా వంటి నిష్పాక్షిక కమిషనర్‌ను వ్యవస్థ నుండి వెళ్ళగొట్టిన తీరును చూసి ప్రస్తుత కమిషనర్లు భయాందోళనలకు గురవుతున్నట్లు స్పష్టమవుతోంది.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఉండాలని స్పష్టం చేసినప్పటికీ, ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా చీఫ్ జస్టిస్ ని ప్యానెల్ నుండి తొలగించింది. నియామక ప్రక్రియలో ప్రభుత్వానిదే పైచేయిగా ఉండేలా నిబంధనలు మార్చడం ద్వారా కమిషన్ నిష్పాక్షికతను ప్రభుత్వం దెబ్బతీసింది. అలాగే, మే 27న సుప్రీంకోర్టు సర్ ప్రక్రియపై చూపిన ఉదాసీనత మరియు దానిని కేవలం ‘ప్రొసీజరల్ లాటిట్యూడ్’గా చూడటం పట్ల నేడు దేశంలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది.
ఈసీ వ్యవహార శైలిపై నేడు దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది.
ప్రజాస్వామ్య పవిత్రతను కాపాడటంలో విఫలమైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి లేదా వారిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించాలని విద్యార్థులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయి. ‘సర్’ ప్రక్రియ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ ఊపందుకుంది.. జనవరి 2025 నాటి వోటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని పాత వోటర్లందరినీ పునరుద్ధరించాలి. నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తిరిగి సభ్యునిగా చేర్చి, ప్రభుత్వ ప్రభావాన్ని తగ్గించాలి. వోటర్ల నమోదు , తొలగింపుపై క్షేత్రస్థాయి అధికారులకు (EROs) ఉన్న చట్టబద్ధమైన అధికారాలను తిరిగి అప్పగించాలి. దిల్లీలో కేంద్రీకృత సాఫ్ట్‌వేర్ నియంత్రణను తొలగించాలి.
భారత ప్రజాస్వామ్య మనుగడ ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై ఆధారపడి ఉంటుంది. 13 కోట్ల మంది పౌరుల వోటు హక్కును కాలరాయడం అనేది కేవలం సాంకేతిక లోపం కాదు, అది ఒక ‘నేరం’, ‘దేశద్రోహం’ వంటిది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోబడటం ప్రజాస్వామ్యానికి ముప్పు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం తన స్వయంప్రతిపత్తిని చాటుకుని, ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.





