“ఏమిటిదంతా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతానని, పది సంవత్సరాల పాటు ప్రాథమిక హక్కులు కోల్పోయిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తాననీ, అది తన ఏడో హామీ అని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి పాలనేనా? అవి బూటకపు వాగ్దానాలా లేక రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి బదులు మరెవరైనా పాలిస్తున్నారా? ఈ ఉదంతం తెలంగాణ సమాజ స్థితిని మెతుకు పట్టి చూసినట్టు తెలియజేస్తున్నది. ఈ ఉదంతం అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వ పాలన మీద అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇందులో చర్చించవలసిన అంశాలు అనేకం ఉన్నాయి.”
యాబై ఆరు సంవత్సరాల కింద హైదరాబాద్ లోనే పుట్టిన ఒక ప్రముఖ సాహిత్య సంస్థ ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగానే తన పుట్టినరోజు సందర్భంగా ఒక సదస్సు జరపాలనుపుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం ఉండాలి? ఒక సదస్సు, అది కూడా ‘భారతదేశంలో ఫాసిజం ప్రత్యేకతలు’ అనే సాధారణమైన అకడమిక్ అంశం మీద ఉంటే అది జరగగూడదని ప్రభుత్వం తరఫున పోలీసులు ఎందుకు అనుకోవాలి?
హైదరాబాదులో ఈ ఆదివారం జరగవలసి ఉండిన సదస్సును పోలీసులు జరగనివ్వకపోవడం, నిర్వాహకులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, “పై నుంచి ఆదేశాలు” అనే పేరుతో అడ్డుకోవడం ఏదో ఒకానొక మినహాయింపు ఘటన కాదు. ఇది ఏదో ఒక సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. రాష్ట్రంలో పాలన సాగుతున్న తీరుకు, ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ పాలన లేదనడానికి, ప్రజాస్వామ్యానికి బద్ధవ్యతిరేకులైన సంఘ్ పరివారమే తెలంగాణను కూడా పాలిస్తున్నదా అని అనుమానించడానికి దారి తీసే పరిణామం ఇది.
విప్లవ రచయితల సంఘం 1970 జూలై 4 తెల్లవారుజామున హైదరాబాదులో శ్రీశ్రీ అధ్యక్షుడుగా పుట్టి, అప్పటికి లబ్ధ ప్రతిష్ఠులైన కొందరితో పాటు, అనేక మంది యువకులను ఆకర్షించింది. గడిచిన ఐదు దశాబ్దాల్లో సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో అపారమైన కృషి చేసింది. ప్రజాపోరాటాలను సమర్థించడానికి నిబద్ధులైన రచయితలు సంఘంగా ఏర్పడడం ప్రపంచంలో జరిగి ఉండవచ్చు గాని, అటువంటి సంఘం ఐదున్నర దశాబ్దాలుగా ఉనికిలో ఉండడం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఆ సంస్థ ప్రారంభకుల్లో ఒకరైన చెరబండరాజు సంస్మరణ జూలై 2, సంస్థ ఆవిర్భావ దినం జూలై 4 సందర్భంగా హైదరాబాదులోనో, మరొక చోటనో విరసం ఆవిర్భావ దినం జరుపుకోవడం యాబై సంవత్సరాలుగా ఒక ఆనవాయితీ. అదే విధంగా ఈసారి కూడా ఆవిర్భావ దినం సందర్భంగా ఒక రోజంతా మూడు ఉపన్యాసాలతో, ఒక నాటక ప్రదర్శనతో సదస్సు ఏర్పాటు చేశారు. ప్రతి సభకూ జరిగినట్టే కరపత్రం ప్రచురించి ప్రచారం చేశారు. (ఆ కరపత్రాన్ని విమర్శించడానికి ఉత్సాహపడిన మిత్రులు, ఆ సభ జరగకుండా అడ్డుకున్న ప్రభుత్వ, పోలీసు చర్య మీద మాత్రం మౌనంగా ఉన్నారు!)
ఆదివారం సభ అనగా శుక్రవారం రాత్రి హాలు యాజమాన్యం సభ నిర్వాహకులకు ఫోన్ చేసి, “మీ సభకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. మీరు పోలీసుల నుంచి అనుమతి తెచ్చుకుంటేనే సభ పెట్టుకోండి” అన్నారట. శనివారం రోజంతా నిర్వాహకులు స్వయంగానూ, మంత్రులతో, పోలీసు ఉన్నతాధికారులతో సంభాషించగల పెద్దల సహాయంతోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారట. పోలీసు అనుమతి దొరకకపోతే న్యాయస్థానం తలుపు కూడా తట్టాలని ఆలోచించారట. ఆ ప్రయత్నాలన్నీ విఫలమై శనివారం రాత్రి సభ జరగడం లేదని ప్రకటన ఇచ్చారు. దూర ప్రాంతాల నుంచి ముందురోజు సాయంత్రమే బయల్దేరినవారు ఆ ప్రకటన చూసి మధ్య నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని కూడా సామాజిక మాధ్యమాలలో రాశారు. ఆదివారం సదస్సు ప్రారంభమై ప్రారంభోపన్యాసం జరుగుతుండవలసిన సమయానికి తమ నిరసన ప్రకటించడానికి ప్రెస్ క్లబ్ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసు మోహరింపు.
ఏమిటిదంతా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతానని, పది సంవత్సరాల పాటు ప్రాథమిక హక్కులు కోల్పోయిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తాననీ, అది తన ఏడో హామీ అని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి పాలనేనా? అవి బూటకపు వాగ్దానాలా లేక రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి బదులు మరెవరైనా పాలిస్తున్నారా? ఈ ఉదంతం తెలంగాణ సమాజ స్థితిని మెతుకు పట్టి చూసినట్టు తెలియజేస్తున్నది. ఈ ఉదంతం అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వ పాలన మీద అనుమానాలను రేకెత్తిస్తున్నది. ఇందులో చర్చించవలసిన అంశాలు అనేకం ఉన్నాయి.
“1930లలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలలో జవహర్ లాల్ నెహ్రూ భాగమయ్యారు. 1947 తర్వాత హిందూ రాష్ట్ర పేరుతో ఫాసిస్టు ప్రమాదం భారతదేశంలో రానున్నదని హెచ్చరించారు. ఇందిరా గాంధీ కూడా 1947లోనే ఆర్ఎస్ఎస్ ఫాసిజం ప్రమాదాన్ని అరికట్టాలని నెహ్రూకు లేఖ రాశారు. ఆమె ఎమర్జెన్సీ విధించడమే ఫాసిజం అని విమర్శ ఉండగా, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడానికే ఆ పని చేశానని అన్నారు. రాజీవ్ గాంధీ కూడా మతోన్మాదాన్ని, ఫాసిస్టు ప్రమాదాన్ని విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే పేరు చెప్పి మరీ సావర్కర్ నూ, ఆర్ఎస్ఎస్ ఫాసిజాన్నీ విమర్శిస్తున్నారు. మరి ఆ కాంగ్రెస్ వారసత్వానికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూ ఏమన్నా తేడా ఉందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫాసిజం మీద సదస్సు అభ్యంతరకరం ఎలా అయింది? చట్ట ప్రకారం అంగీకారయోగ్యం కాని, కాంగ్రెస్ సంప్రదాయానికి వ్యతిరేకం అయిన ఈ మార్గాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు అనుసరిస్తున్నారు?”
మొట్టమొదట, భారత రాజ్యాంగం ప్రకారం, పోలీసు చట్టాలతో సహా అమలులో ఉన్న అనేక చట్టాల ప్రకారం ఒక ప్రాంగణం లోపల, ఒక భవనంలో హాలులోపల, ఒక గదిలోపల పౌరులు సమావేశమైతే, ఆ భవన యజమాని అనుమతి తప్ప మరెవరి అనుమతీ అవసరం లేదు. పోలీసు అనమతి అసలే అవసరం లేదు. బహిరంగ స్థలంలో జరిపే ప్రదర్శనకు, ఊరేగింపుకు, ధర్నాకు, సభకు కూడా అనుమతి అవసరం లేదు. బహిరంగ స్థలంలో అటువంటి జన సమీకరణ జరిగితే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది గనుక, నిర్వాహకులు మైక్, లౌడ్ స్పీకర్లు పెడితే ఆ స్థలం చుట్టూ ఉండే నివాసులకు ఇబ్బంది గనుక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వారు ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. లౌడ్ స్పీకర్ ధ్వని పరిమిత స్థాయిలో ఉండేట్టు చూస్తారు. అంతే. అంతకన్న పోలీసులకు ఎక్కువ అధికారాలు లేవు. ఎక్కడైనా నలుగురి కన్న ఎక్కువ మనుషులు గుమిగూడితే ప్రజా భద్రతకు భంగకరం కావచ్చునని పాత రోజుల్లోనైతే సీఆర్పీసీ సెక్షన్ 144, ఇప్పుడైతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించే అధికారం మేజస్ట్రీటుకు ఉంది. పోలీసుల బాధ్యత ఆ మేజస్ట్రీటు విధించే ఆంక్షలను అమలు చేయడం మాత్రమే. సభకు అనుమతి ఇవ్వడమో, నిరాకరించడమో పోలీసుల అధికారమూ కాదు, బాధ్యతా కాదు.
అందువల్ల ప్రస్తుత సదస్సుకు అనుమతి తీసుకోవలసిన అవసరమే లేదు. కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పోలీసు రాజ్యమే అమలవుతున్నది గనుక పోలీసులు తమకు లేని, మితిమీరిన అధికారాలు చేతుల్లోకి తీసుకుంటున్నారు. ప్రజా అసంతృప్తిని, భిన్న స్వరాలను అణచివేయడానికి పోలీసులను ప్రయోగిస్తున్న రాజకీయ నాయకత్వం బారాఖూన్ మాఫ్ అవకాశాలిస్తున్నది. ఆ అవకాశాల్లో భాగంగా పోలీసులు నగరంలో సభలు జరిగే హాళ్ల యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి, వారి దగ్గర అద్దె చెల్లించి సభలు పెడుతున్నవారి వివరాలు తెలుసుకుంటున్నారు. నిర్వాహకులను బెదిరిస్తున్నారు. ఫలానా వారికి హాలు ఇవ్వగూడదని హాలు యాజమాన్యాలను బెదిరిస్తున్నారు. మా అనుమతి ఉంటేనే హాలు ఇస్తామని చెప్పండి అని హాలు యాజమాన్యాల మీద ఒత్తిడి తెస్తున్నారు. నిజానికి హాలు యాజమాన్యం హాలు అద్దెకు ఇవ్వడమే తమ వ్యాపారం గనుక పోలీసులు అడిగిన సమాచారం చెప్పకుండా ఉండవచ్చు. మా వ్యాపారంలో మీరు ఎలా జోక్యం చేసుకుంటారు, మా వ్యాపారం జరగకుండా మీరెలా ఆటంకాలు కల్పిస్తారు అని ఎదురు అడగవచ్చు. కాని సాధారణంగా వ్యాపారస్తులు పోలీసులకు లొంగి ఉంటేనే తమ వ్యాపారం సజావుగా సాగుతుందనీ, తమ వ్యాపారంలో లొసుగులను ఎత్తిచూపి పోలీసులు వేధించకుండా ఉంటారనీ అనుకుంటారు.
అయితే ప్రస్తుతం హాలు యాజమాన్యం ఒక మామూలు వ్యాపార సంస్థ కాదు. అది ఒక కమ్యూనిస్టు పార్టీకి చెందిన హాలు. అందువల్ల ఆ హాలు యాజమాన్యం పోలీసులతో నిక్కచ్చిగా మాట్లాడి ఉండవచ్చు. హాలు లోపల జరిగే సభలకు పోలీసు అనుమతి అవసరం ఎందుకని చట్టబద్ధంగా సవాలు చేసి ఉండవచ్చు. కాని ఎందువల్లనో వారు ఆ పని చేయలేదు. అనుమతి తెచ్చుకోండి అని నిర్వాహకుల మీదనే ఒత్తిడి తెచ్చారు. రేపు వాళ్ల పార్టీ సభలకు కూడా ఈ పరిస్థితి రావచ్చు. ఈ సమస్యను అలా ఉంచి, పోలీసులు ఈ సందర్భంలో నిర్వాహకులతో మీ పేరులో “విప్లవ” పదం ఎందుకుందనీ, “ఫాసిజం” మీద సభ పెడితే అనుమతి ఎట్లా ఇస్తాము అనీ అన్నారని తెలుస్తున్నది.
తెలంగాణలో “విప్లవ” అనే పదం ఎప్పటి నుంచి నిషిద్ధ పదం అయింది? ఆ పదాన్ని తెలుగు భాష నుంచి పోలీసులు తొలగించారా? ఎందువల్ల? సమూలమైన మార్పు అని అర్థం ఇచ్చే ఆ పదాన్ని సమూలం అయినా కాకపోయినా అన్ని మార్పులకూ అందరూ వాడుతున్నారు గదా? “విప్లవ” అనే పదానికి ఒక నిర్దిష్ట అర్థాన్ని తెలంగాణ పోలీసులు ఊహించినట్టయితే, అసలు ఆ అర్థం 2026 మార్చ్ 31తో అంతమయిందని, ఇప్పుడు దేశం ఆ “విప్లవ” అర్థం నుంచి విముక్తి అయిందని సాక్షాత్తూ కేంద్ర హోమ్ మంత్రి లోకసభ వేదికగా ప్రకటించారు గద. ఇంకా విప్లవ పదం వాడకం మీద అభ్యంతరం ఏమిటి? నిషేధం ఏమిటి?
అంతకన్నా తీవ్రమైనది ఫాసిజం అనే మాట అభ్యంతరకరం కావడం. ఇటలీలో వంద సంవత్సరాల కింద బెనిటో ముస్సోలినీ ఫాసిస్టు పార్టీ ఏర్పాటు చేసి, ఫాసిజం తన సిద్ధాంతం అని ప్రకటించినప్పటి నుంచి, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్, స్పెయిన్ లో ఫ్రాన్సిస్కో ఫ్రాంకో తమ తరహా ఫాసిజం అమలు చేసి, రెండో ప్రపంచ యుద్ధ మారణహోమానికి కారణం అయినప్పటి నుంచి, ఫాసిజం మీద వందల పుస్తకాలు వచ్చాయి. లక్షల వ్యాసాలు వచ్చి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల విశ్వవిద్యాలయాలలో సామాజిక శాస్త్రాలన్నిటిలో ఫాసిజం ఒక పాఠ్యాంశం. ఇరవయో శతాబ్ది ఫాసిజానికీ, ఇరవై ఒకటో శతాబ్దిలో ఫాసిజం పునరుద్ధరణకూ సంబంధించి, ఆయా దేశాలలో ఫాసిజం ప్రత్యేక లక్షణాల గురించి ఎంతో చర్చ జరుగుతున్నది. ఆదివారం అడ్డుకోబడిన సదస్సు అటువంటి విశాలమైన చర్చలో భాగం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం?
ఇంకా విచిత్రమైన విషయం, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్నట్టు కనబడుతున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా భారతీయ జనతా పార్టీ పాలన ఫాసిస్టు పాలన అన్నారు. ఆ ఫాసిజం మీద సదస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ మాత్రమే కాదు, 1930లలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలలో జవహర్ లాల్ నెహ్రూ భాగమయ్యారు. 1947 తర్వాత హిందూ రాష్ట్ర పేరుతో ఫాసిస్టు ప్రమాదం భారతదేశంలో రానున్నదని హెచ్చరించారు. ఇందిరా గాంధీ కూడా 1947లోనే ఆర్ఎస్ఎస్ ఫాసిజం ప్రమాదాన్ని అరికట్టాలని నెహ్రూకు లేఖ రాశారు. ఆమె ఎమర్జెన్సీ విధించడమే ఫాసిజం అని విమర్శ ఉండగా, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడానికే ఆ పని చేశానని అన్నారు. రాజీవ్ గాంధీ కూడా మతోన్మాదాన్ని, ఫాసిస్టు ప్రమాదాన్ని విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే పేరు చెప్పి మరీ సావర్కర్ నూ, ఆర్ఎస్ఎస్ ఫాసిజాన్నీ విమర్శిస్తున్నారు. మరి ఆ కాంగ్రెస్ వారసత్వానికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూ ఏమన్నా తేడా ఉందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫాసిజం మీద సదస్సు అభ్యంతరకరం ఎలా అయింది? చట్ట ప్రకారం అంగీకారయోగ్యం కాని, కాంగ్రెస్ సంప్రదాయానికి వ్యతిరేకం అయిన ఈ మార్గాన్ని రేవంత్ రెడ్డి ఎందుకు అనుసరిస్తున్నారు? రాష్ట్రంలో ఉన్నది ఫాసిజాన్ని కనీసం మాటల్లోనైనా వ్యతిరేకించే కాంగ్రెస్ ప్రభుత్వమా? ఫాసిజాన్ని ముస్సోలినీ రోజుల నుంచీ కూడా ఆరాధిస్తున్న, అనుసరిస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమా?





