ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తున్నప్పటికీ, ప్రజలు నివసించే నగరాల జీవన నాణ్యత విషయం నిరాశాజనకంగా ఉంది . 2026 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ మరోసారి ఇదే వాస్తవాన్ని స్పష్టం చేసింది. స్థిరత్వం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు, సంస్కృతి–పర్యావరణం వంటి కీలక ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో కోపెన్‌హేగన్, వియన్నా, మెల్‌బోర్న్, సిడ్నీ, జ్యూరిచ్ వంటి నగరాలు అగ్రస్థానాల్లో నిలవగా, భారత నగరాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి.
దిగువ స్థానాల్లో లేకపోయినా, ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిచే స్థాయికి ఇంకా చేరుకోలేదన్న విషయం ఆందోళన కలిగించేదే. భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని.. జీడీపీ వృద్ధి, పారిశ్రామిక విస్తరణ, సేవారంగ అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి సూచికలు ఆశాజనకంగా ఉన్నాయని పాలకులు , విధాన కర్తలు ప్రకటనలు గుప్పిస్తున్నారు.. కానీ నగరాల జీవన నాణ్యత అదే వేగంతో మెరుగుపడకపోతే ఆర్థిక వృద్ధి పూర్తి ఫలితాలు ప్రజలకు అందవన్న విషయం వారు గుర్తించడం లేదు . నగరాభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు, విశాల రహదారులు, ఐటీ పార్కులు మాత్రమే కాదు. ప్రజలు భద్రంగా, ఆరోగ్యంగా, పరిశుభ్రమైన వాతావరణంలో, సమర్థవంతమైన ప్రజా రవాణాతో, నాణ్యమైన విద్యా–వైద్య సదుపాయాలతో జీవించగలిగే పరిస్థితులే అసలైన అభివృద్ధికి ప్రమాణం.
భారత నగరాల ప్రధాన సమస్యలు అందరికీ తెలిసినవే. ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం, తాగునీటి కొరత, వ్యర్థాల నిర్వహణలో లోపాలు, వరదల సమయంలో మౌలిక వసతుల వైఫల్యం, ప్రజా రవాణా పరిమితులు, పచ్చని ప్రదేశాల కొరత, వేగవంతమైన పట్టణీకరణకు తగిన ప్రణాళికల లేమి వంటి అంశాలు జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించాలంటే, ప్రతిభావంతులైన యువతను నగరాల్లో నిలుపుకోవాలంటే, ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అవసరం.
ఈ సూచీలో చైనా నగరాలు వేగంగా మెరుగైన స్థానాలకు చేరుకోవడం విశేషం. భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, సమర్థవంతమైన ప్రజా రవాణా, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో అక్కడ తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయి. భారతదేశం కూడా స్మార్ట్ సిటీలు, మెట్రో రైలు, డిజిటల్ సేవలు వంటి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, వాటి ప్రభావం అన్ని నగరాలకు సమానంగా చేరడం లేదు. నగర పాలనలో సమన్వయం, పారదర్శకత, దీర్ఘకాలిక ప్రణాళికలు మరింత బలోపేతం కావాలి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా భారత ప్రధాన నగరాలు ఐటీ, పరిశ్రమలు, స్టార్టప్‌లకు కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. అయితే అదే సమయంలో ట్రాఫిక్, వాయు కాలుష్యం, వర్షాకాలంలో నీటి నిల్వలు, చెత్త నిర్వహణ, సరసమైన గృహాల కొరత వంటి సమస్యలు పెరుగుతున్నాయి. నగర విస్తరణతో పాటు జీవన నాణ్యత కూడా సమానంగా పెరగకపోతే అభివృద్ధి అసమతుల్యంగా మారుతుంది.
భారత్ వొచ్చే దశాబ్దంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యం నిజం కావాలంటే నగరాలు కేవలం ఆర్థిక కార్యకలాపాల కేంద్రాలుగానే కాకుండా, ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, పర్యావరణహితమైన నివాస కేంద్రాలుగా మారాలి. జీవనయోగ్యతను పెంచడం విలాసం కాదు; అది ఆర్థిక పోటీతత్వానికి, సామాజిక సమానత్వానికి, స్థిరమైన అభివృద్ధికి అత్యవసరమైన పెట్టుబడి. భారత అభివృద్ధి గాథను ప్రపంచం మరింత గౌరవించాలంటే, మన నగరాలు కూడా ప్రపంచంలో నివసించడానికి అత్యుత్తమ నగరాల జాబితాలో స్థానం సంపాదించాల్సిందే.





