వికాసం వైపు విద్యా వ్యవస్థ

– తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు
– బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం కేటాయింపులు
– రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
– స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామని, విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే బడ్జెట్‌లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించామని తెలిపారు. ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులకు యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా, స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. విద్యాభివృద్ధికి రూ.26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ఇది ఖర్చుగా కాదు.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా భావిస్తామని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని, డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారన్నారు. విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారంటూ పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగిందని, అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని ఆ శాఖను తన దగ్గరే పెట్టుకున్నానని చెప్పారు. ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరని, ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నామన్నారు. రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఏఐ తుపాన్‌తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని, అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించామని, యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని,. ఇంగ్లీష్‌తోపాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నామని, ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం.. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని వివరించారు. సోషల్ వెల్ఫేర్‌లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్‌లుగా, ఐపీఎస్‌లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలి.. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి.. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలి అని పిలుపునిచ్చారు. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. మీ తలరాతను మార్చేది చదువొక్కటే అని అన్నారు.
మీరు చదవండి.. మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత మీ రేవంతన్న తీసుకుంటాడని హామీ ఇచ్చారు. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నామన్నారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కలిసి రూ.50.73 కోట్లతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రూ.36.65 కోట్లతో వివిధ జిల్లాల్లో మినీ స్టేడియంల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. రూ.14.08 కోట్లతో గచ్చిబౌలి, ఎల్బీ స్టేడియంలలో బాలబాలికల క్రీడా శిక్షణకు వివిధ అకాడమీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయిచారు. గవర్నర్ల్‌తో కలిసి అన్న- అక్క మెటార్షిప్ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.

శంకుస్థాపనల వివరాలు 

రూ.10 కోట్లతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి, రూ.10 కోట్లతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం ఆధునికీకరణ, రూ.4 కోట్లతో నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం, రూ.4 కోట్లతో వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో మల్టీ పర్పస్ స్టేడియం, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో కోర్ట్స్ నిర్మాణం, క్రికెట్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ అభివృద్ధి, రూ.3.50 కోట్లతో కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం, రూ.2.65 కోట్లతో మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం, రూ.2.50 కోట్లతో నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉట్కూరులో వాలీబాల్ అండ్ కబడ్డీ కోర్ట్స్ నిర్మాణణాలకు శంకుస్థాపనలు చేశారు.

ప్రారంభోత్సవాల వివరాలు 

రూ.5.70 కోట్లతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిఫా ఏఐఎఫఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, రూ.5.70 కోట్లతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫిఫా ఏఐఎఫఎఫ్ తెలంగాణ టాలెంట్ అకాడమీ, రూ.35.95 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ, రూ.35.94 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అథ్లెటిక్స్ అకాడమీ, రూ.44.50 లక్షలతో బాలికల కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ, రూ.44.50 లక్షలతో బాలుర కోసం గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన హాకీ అకాడమీ, రూ.58.50 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ అకాడమీ, రూ.49 లక్షలతో బాలుర కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హ్యాండ్‌బాల్ అకాడమీలను ప్రారంభించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *