“వీటి ప్రకారం ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే 1 నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను ‘నాన్-బైలబుల్’ , ‘కాగ్నిజబుల’ (వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే) నేరాలుగా మార్చారు. సాధారణ చట్టాల్లో నేరాన్ని పోలీసులు నిరూపించాలి. కానీ ఈ బిల్లు ప్రకారం, తాను తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండానే డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ నుండి కంటెంట్‌ను తొలగించే అధికారాన్ని ప్రభుత్వం నియమించిన అధికారికి దఖలు పరిచారు. ఈ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి..”
ఈ బిల్లు తెచ్చిన ఏకైక రాష్ట్రం కర్ణాటక
భారతదేశంలో ప్రత్యేకంగా ‘హేట్ స్పీచ్’ నియంత్రణ కోసం విడిగా చట్టాన్ని తీసుకు వచ్చిన ఏకైక రాష్ట్రం కర్ణాటక మాత్రమే. తెలంగాణ ఈ తరహా చట్టాన్ని ప్రతిపాదించిన రెండవ రాష్ట్రం.2025 డిసెంబర్‌లో కర్ణాటక అసెంబ్లీ దేశంలోనే మొదటిసారిగా ‘కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు-2025’ను ఆమోదించింది. ఈ స్ఫూర్తే రేవంత్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం. విచిత్రమేమంటే కర్ణాటక బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలన కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపారు. అయితే, ఇప్పటికే దేశంలో ఉన్న ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్)-2023’ లోని సెక్షన్లు దీనికి సరిపోతాయని, విడిగా రాష్ట్ర చట్టం వల్ల గందరగోళం ఏర్పడుతుందని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రస్తుతానికి నిలిపివేసింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ‘హేట్ స్పీచ్’ కోసం ప్రత్యేకంగా చట్టాలు లేవు. వారంతా కేంద్ర ప్రభుత్వ చట్టాలనే అమలు చేస్తున్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాలు ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టడానికి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్) లోని సెక్షన్ 153ఎ, 153బి, 295ఎ మరియు 505 వంటి నిబంధనలను ఉపయోగిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు (ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాలు) విద్వేషాలు రేకెత్తించే తీవ్రమైన నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టాన్ని ప్రయోగిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ తొందరపాటు
తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక బిల్లులోని వైఫల్యాలను, దానిని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడానికి ప్రధాన కారణం, ఈ రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకే విధమైన పంథాను అనుసరించడమే.కర్ణాటక నమూనాను పూర్తిగా అధ్యయనం చేయకుండానే, కేవలం ఆ బిల్లులోని ముసాయిదాను యథాతథంగా కాపీ చేయడం వల్లే తెలంగాణ బిల్లు కూడా ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. 2025 డిసెంబర్‌లో కర్ణాటక అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించిన వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పటికీ, లీగల్ సెల్ హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. కర్ణాటక బిల్లు ఏ రాజ్యాంగపరమైన సమస్యల వల్ల (ఆర్టికల్ 14, 19, 21 ఉల్లంఘనలు) ఆగిపోయిందో.. ఆ లోపాలను సరిదిద్దకుండానే తెలంగాణ ప్రభుత్వం దాదాపు అవే నిబంధనలు, అవే శిక్షలతో కూడిన ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కర్ణాటక బిల్లును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ ఏ) నిలిపివేయడానికి ముఖ్య కారణం, ఇప్పటికే దేశంలో అమల్లోకి వచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్)-2023’ లో విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు తగిన నిబంధనలు ఉండటమే!
కర్ణాటక తప్పే పునరావృతం
రాష్ట్రాలు విడిగా ఇరుకైన చట్టాలు చేస్తే దేశంలో న్యాయ ఏకరూపత దెబ్బతింటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సాంకేతిక అంశాన్ని తెలంగాణ యంత్రాంగం బిల్లును డ్రాఫ్ట్ చేసే సమయంలో ముందే ఊహించలేకపోయింది. బిల్లు ఆమోదం పొందితే ఐటీ చట్టం మరియు పౌర హక్కులకు భంగం కలుగుతుందని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ ఎఫ్) వంటి స్వచ్ఛంద సంస్థలు ముందే హెచ్చరించాయి. కోర్టుల ప్రమేయం లేకుండా డిజిటల్ కంటెంట్‌ను తొలగించే అధికారం కర్ణాటక బిల్లులో తీవ్ర విమర్శకు గురైంది. అదే తప్పును తెలంగాణ ప్రభుత్వం కూడా పునరావృతం చేసింది. కర్ణాటక బిల్లుకు పట్టిన గతే తెలంగాణ బిల్లుకు కూడా పడుతుందని విపక్షాలు (బీజేపీ, బీఆర్ ఎస్, ఏఐఎంఐఎం మరియు మిత్రపక్షం సీపీఐ అసెంబ్లీలో గట్టిగా నిలదీశాయి.ఒకవేళ ప్రభుత్వం మొండిగా ఈ బిల్లును సభలో ఆమోదించుకున్నా.. రేపు గవర్నర్ లేదా కేంద్ర ప్రభుత్వం (రాష్ట్రపతి పరిశీలన పేరుతో) దీనిని నిలిపివేయడం ఖాయమని ప్రభుత్వం ఆలస్యంగా గ్రహించింది. అందుకే, కర్ణాటక చట్టంలాగా ఇది పూర్తిగా అభాసుపాలు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే.. అసెంబ్లీ స్పీకర్ దీనిని హుటాహుటిన పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీకి పంపి, కేంద్ర చట్టాలకు లోబడి ఉండేలా సవరణలు చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రపతి ఆమోదం కష్టం
సెలెక్ట్ కమిటీ ఈ బిల్లులో ఎన్ని మార్పులు చేసినప్పటికీ, దీనికి గవర్నర్ లేదా భారత రాష్ట్రపతి ఆమోదం లభించడం అంత సులభం కాదు. సాంకేతిక మరియు రాజ్యాంగపరమైన లొసుగుల వల్ల ఈ బిల్లు భవిష్యత్తులో కూడా నిలిచిపోయే అవకాశాలే ఎక్కువ. హేట్ స్పీచ్, క్రిమినల్ శిక్షలు అనేవి రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తాయి. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర చట్టం (బీఎన్ ఎస్-2023) ఇప్పటికే అమల్లో ఉన్నందున, దానికి వ్యతిరేకంగా లేదా అదనంగా రాష్ట్రం చేసే ఏ చట్టానికైనా గవర్నర్ నేరుగా సంతకం చేయలేరు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం, గవర్నర్ ఈ బిల్లును తప్పనిసరిగా రాష్ట్రపతి పరిశీలన కోసం దిల్లీకి పంపాల్సి ఉంటుంది. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు పంపినా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల ఆధారంగానే రాష్ట్రపతి నిర్ణయం ఉంటుంది.





