– విద్యా పరిపాలనలో కొత్త ఒరవడి
– అకడమిక్ సంస్కరణల వైపు అడుగులు
– మోడరేషన్ విధానానికి చట్టబద్ధత కల్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లాని
హన్మకొండ, ప్రజాతంత్ర, జూన్ 20 : ఒక విశ్వవిద్యాలయం ప్రతిష్ఠను నిర్ణయించేది తరగతిలో జరిగే బోధన మాత్రమే కాదు.. సమయానికి అకడమిక్ క్యాలెండర్ అమలు, నిబంధనలకనుగుణంగా పరీక్షల నిర్వహణ, పారదర్శకంగా మూల్యాంకనం పూర్తి, విద్యార్థులకు నిర్ణీత సమయంలో ఫలితాలను అందించడం, విద్యా పరిపాలనలో క్రమశిక్షణను నెలకొల్పడం కూడా అంతే కీలకమైనవి. ఈ ప్రమాణాలన్నింటినీ ఆచరణలో చూపిస్తూ కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 2025 అక్టోబర్‌లో యూనివర్సిటీ కాలేజ్ హెడ్ అండ్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నల్లాని శ్రీనివాస్ క్లిష్టమైన అకడమిక్ పరిస్థితిని సవాల్‌గా తీసుకున్నారు. ఎంఎడ్., బీఎడ్. కోర్సుల అంతర్గత పరీక్షలు, ప్రాక్టికల్ పరీక్షలు, సిద్ధాంత పరీక్షలు, మూల్యాంకనం, మోడరేషన్, ఫలితాల ప్రకటన వంటి అనేక ప్రక్రియలు వివిధ దశల్లో నిలిచిపోయి ఉండటంతో అకాడమీ వ్యవస్థ గందరగోళంగా మారింది. బి.ఎడ్, ఎం.ఎడ్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా అకడమిక్ క్యాలెండర్ పూర్తిగా వెనుకబడిపోయింది.
పటిష్టమైన కార్యాచరణతో ముందుకు
ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించిన డాక్టర్ శ్రీనివాస్.. అధ్యాపకులు, పరీక్షల విభాగం, విశ్వవిద్యాలయ అధికారులతో నిరంతరం సమావేశాలు నిర్వహించి సమన్వయం సాధించారు. ప్రతీ పెండింగ్ అంశాన్ని ప్రత్యేకంగా గుర్తించి దశలవారీగా పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపట్టారు. ఫలితంగా పరీక్షల నిర్వహణ, ప్రాక్టికల్ రికార్డుల మూల్యాంకనం, మోడరేషన్, ఫలితాల ప్రకటన వంటి అన్ని కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. కొద్ది నెలల్లోనే విద్యా కళాశాల అకాడమిక్ వ్యవస్థ తిరిగి గాడిలో పడింది. ప్రస్తుతం ఎం.ఎడ్ మొదటి, నాల్గవ సెమిస్టర్లు, బి.ఎడ్ నాల్గవ సెమిస్టర్ ప్రాక్టికల్స్, మూల్యాంకనం విజయవంతంగా పూర్తయ్యాయి. సిద్ధాంత పరీక్షలు కొనసాగుతుండగా మోడరేషన్ ప్రక్రియ చేపడుతున్నారు. ఎం.ఎడ్ మొదటి సెమిస్టర్‌కు సంబంధించి మిగిలిన ప్రాక్టికల్ పరీక్షలు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఇక ఎం.ఎడ్ రెండవ, బి.ఎడ్ రెండవ సెమిస్టర్ విద్యార్థుల టీచింగ్ ప్రాక్టీస్, ఇంటర్న్‌షిప్ కార్యక్రమాలను కూడా ముందస్తు ప్రణాళికతో అమలు చేస్తున్నారు. ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి హనుమకొండ పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలలకు పంపించారు.
మోడరేషన్ విధానంలో చట్టబద్ధతకు ప్రాధాన్యం
గతంలో బి.ఎడ్, ఎం.ఎడ్ ప్రాక్టికల్ రికార్డుల మోడరేషన్ ప్రక్రియను స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తించిన నల్లాని ఈ అంశాన్ని ఉపకులపతి ఆచార్య ప్రతాప్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సమగ్రంగా పరిశీలించి స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం లేకుండా మోడరేషన్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసి ఈ అంశాన్ని స్టాండింగ్ కౌన్సిల్ సమావేశ అజెండాలో చేర్చి అధికారిక ఆమోదం పొందేలా వీసీ ప్రతాప్ రెడ్డి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా ఎం.ఎడ్, బి.ఎడ్ కోర్సులకు సంబంధించిన అంతర్గత ప్రాక్టికల్ రికార్డుల మోడరేషన్ ప్రక్రియకు చట్టబద్ధత, పరిపాలనా పారదర్శకత, నిబంధనల ప్రకారం నిర్వహణకు బలమైన పునాది ఏర్పడింది. విద్యా పరిపాలనలో ఇది ఒక కీలక సంస్కరణగా భావిస్తున్నారు.
టీచింగ్ ప్రాక్టీస్‌కు వినూత్న రూట్ మ్యాప్
టీచింగ్ ప్రాక్టీస్ పర్యవేక్షణలో కూడా వినూత్న విధానాన్ని అమలు చేశారు. ప్రతి అధ్యాపకుడికి నిర్దిష్ట పాఠశాలలు కేటాయిస్తూ వారాంతపు ప్రణాళిక రూపొందించారు. రోజూ ఒక అధ్యాపకుడు పరిశీలనకు వెళ్లే విధంగా షెడ్యూల్ రూపొందించడం ద్వారా ఒకవైపు కళాశాలలో రెగ్యులర్ తరగతులకు అంతరాయం కలగకుండా మరోవైపు టీచింగ్ ప్రాక్టీస్ సమర్థవంతంగా కొనసాగేలా వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రణాళిక విద్యార్థుల బోధనా నైపుణ్యాల అభివృద్ధికి, అధ్యాపకుల సమర్థవంతమైన పర్యవేక్షణకు దోహదపడుతోంది.
టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ మేళా.. ఉపాధ్యాయ విద్యలో కొత్త అధ్యాయం 
విద్యా కార్యక్రమాల నిర్వహణతోపాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్ (టీఎలఎం) మేళా-2026 విశేష స్పందన పొందింది. విద్యార్థి-కేంద్రిత బోధన, సృజనాత్మక అభ్యాసం, అనుభవాత్మక విద్యకు ఈ మేళా వేదికగా నిలిచింది. ఉపాధ్యాయ శిక్షణార్థులు స్వయంగా రూపొందించిన బోధనా సామగ్రి, వినూత్న నమూనాలు, శాస్త్రీయ ప్రయోగాలు, సృజనాత్మక బోధనా పద్ధతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ‘నేర్చుకుంటూ బోధించడం -బోధిస్తూ నేర్చుకోవడం’ అనే విద్యా తత్వాన్ని ఆచరణలో ప్రతిబింబించిన ఈ కార్యక్రమాన్ని జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యార్థుల ప్రతిభ
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రదర్శనలో కేయూ తరపున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు పాల్గొని విశేష ప్రశంసలు అందుకున్నారు. డా. నల్లాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన హైడ్రాలిక్ బ్రిడ్జ్ నమూనా, వాతావరణ కాలుష్య నమూనాలు, పారిశ్రామిక అభివృద్ధి నమూనాలు, మానవ జీవ వికాస ప్రక్రియ, విద్యుత్ నమూనాలు, ఆధునిక బోధనా సాధనాలు, విద్యా సమస్యలపై అవగాహన కల్పించే ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యా రంగంలో సృజనాత్మకతను సమాజానికి చేరవేసే ప్రయత్నంగా ఈ ప్రదర్శన నిలిచింది.
నాణ్యమైన విద్యా పరిపాలనకు నాంది 
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వల్లూరి రామచంద్రం తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా విద్యా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్‌ను క్రమబద్ధీకరించడం, పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం, విద్యార్థులకు సమయానికి ఫలితాలు అందించడం, పరిపాలనను సమర్థవంతంగా తీర్చిదిద్దడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారుల సహకారంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయన్నారు.





