రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణం

– నల్లగొండ-మహబూబ్ నగర్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి
– 6న కరీంనగర్ హ్యామ్, సీఆరఎఫ్ రోడ్ల పనులకు శంకుస్థాపన
– హైకోర్టు, ఉస్మా‘న’యా హాస్పిటల్స్‌ను 2027 ఆఖరుకు సిద్ధం చేయాల్సిందే.
– టిమ్స్, నిమ్స్, వరంగల్ హాస్పిటల్స్ త్వరలో అందుబాటులోకి రావాలి
– బాసర, భద్రాచలం ఆలయ పనుల పురోగతి, గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఆరా
– ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటి రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ‘న భూతో న భవిష్యతి’ రీతిలో రాష్ట్రంలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణానికి ప్రజాప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగా గతనెల 28న నల్లగొండ జిల్లా కనగల్ వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్ర హ్యామ్ రోడ్ల పనుల పైలాన్ ఆవిష్కరణ జరిపి పనులు ప్రారంభించామని ఆరఅండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు పనుల పురోగతిపై సెక్రటేరియట్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ అండ్ బిలోని విభాగాల వారీగా పనుల పురోగతిపై కూలంకషంగా చర్చించిన మంత్రి చేపట్టిన కీలక పనులు ఏ దశల్లో ఉన్నాయో ఆరా తీశారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఏ మూలన చూసినా నాణ్యమైన ఆర్ అండ్ బి డబుల్ రోడ్లు వినియోగంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మంచి రోడ్డు- ప్రగతికి సూచిక అని తాను బలంగా విశ్వసిస్తానని, దీంతో పల్లె పట్టణాలకు కనెక్టివిటీ పెరిగి గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. మొదటి ఫేజ్‌లో సుమారు రూ.13వేల కోట్లతో 6,092 కి.మీ రోడ్ల పనులు 34 ప్యాకేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనుండగా ఈ నెలలోనే పది ప్యాకేజీల పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ప్యాకేజ్-2లో సుమారు రూ.155 కోట్ల అంచనా వ్యయంతో 42కి.మీ పొడవు గల నల్లగొండ-మహబూబ్‌నగర్ డబుల్ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పనుల్లో వేగం పెంచాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో లేవని, అయినా వర్షాకాలం పూర్తి అయిన తర్వాత మూడు షిఫ్టుల్లో(రాత్రి వేళల్లో కూడా) రోడ్ల నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణం కోసం నిష్ణాతులై, నిరంతరం ఫీల్డ్‌లో ఉండే ఇంజనీర్లను ఎంపిక చేసి ప్యాకేజీల వారీగా పనుల బాధ్యతలు అప్పజెప్పాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయించడం చీఫ్ ఇంజనీర్ల బాధ్యతేనని మంత్రి స్పష్టం చేశారు. ఈనెల 6న కరీంనగర్ జిల్లాలో చేపట్టే హ్యామ్, సీఆరఎఫ్ రోడ్ల పనులకు ఆ జిల్లా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధిత ఏర్పాట్లు చూడాలని సీఈలు బి.వి.రావు, వసంత్ నాయక్‌లను మంత్రి ప్రత్యేకంగా ఆదేశించారు.

కొత్త హైకోర్టు, ఉస్మా‘న’యా హాస్పిటల్ 2027 డిసెంబర్‌లో ప్రారంభం

రాజేంద్రనగర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవనం, జడ్జిల నివాస సముదాయ భవనాల నిర్మాణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 16% పనులు పూర్తయ్యాయని సీఈలు రాజేశ్వర్ రెడ్డి, నర్సింగ్ రావు వివరించగా మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు జరగాలని, అందుకనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి నిర్మాణ సంస్థతో సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని మంత్రి ఆదేశిం చారు. ఆర్ అండ్ బి తరపున నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న ఇంజనీర్ల సంఖ్యను పెంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 డిసెంబర్ నాటికి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ పనుల్లో ఇంకా వేగం పెరగాలని, ఇది కూడా డిసెంబర్ 2027 వరకు ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం అయిందని, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణ పనులు వేగవంతం చేసి అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుల్లో సాంకేతికత తెలిసి ఉండి, మనసుపెట్టి పనిచేసే అంకితభావం ఉన్న ఇంజనీర్లను నియమించాలని మంత్రి సూచించారు.

ఆకస్మిక సైట్ విజిట్.. కఠిన చర్యలు

ఈ వారం నుండే నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో ఆకస్మిక సైట్ విజిట్స్ చేస్తానని, పనుల పురోగతిలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తన దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాసర, భద్రాచలం ఆలయ నిర్మాణ పనుల పురోగతి,గోదావరి పుష్కరాల కోసం ఆర్ అండ్ బి ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. సంబంధిత ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఆర్ అండ్ బి తరపున నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకుని పని చేయాలని సూచించారు. సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఈఎన్‌సీ జయభారతి, అన్ని విభాగాల సీఈలు బి.వి.రావు, రాజేశ్వర్ రెడ్డి, ధర్మారెడ్డి, వసంత్ నాయక్, వనజ,రాజేందర్, నర్సింగ్ రావు, పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *