– ఏర్పాట్లపై ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
– 3,000 మంది ఆహ్వానితులు, జాతీయ స్థాయి సదస్సు
– ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ)ను హైదరాబాద్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, గ్లోబల్ సమ్మిట్ తరహాలో సదస్సు ఏర్పాట్లు ఉండాలని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంటరెడ్డి అధికారులను ఆదేశించారు. నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఐఆర్సీ జాతీయ సదస్సు ఏర్పాట్లపై సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి శుక్రవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఐఆర్సీ విజయవంతం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్లో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్‌లో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు, కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇంజనీర్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి రహదారుల నిపుణులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు కలిపి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని మంత్రి తెలిపారు. హైటెక్స్‌లో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, ఆధునిక సాంకేతికత, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయన్నారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నిపుణులు ఒకే వేదికపై సమావేశం కావడం వల్ల తెలంగాణకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతోపాటు పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాలుగు రోజుల షెడ్యూల్
19న ఉదయం 11 గంటలకు ఐఆర్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. రహదారుల నిర్మాణం, భద్రత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అంతర్గత చర్చలు, నిపుణులతో గ్రూప్ డిస్కషన్లు నిర్వహిస్తామని తెలిపారు. ఆ రాత్రి హైటెక్స్‌లో వివిధ రాష్ట్రాల అతిథులు, నిపుణులకు ముఖ్యమంత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారని తెలిపారు. 20న కేంద్ర మంత్రి గడ్కరీ సమక్షంలో చర్చలు కొనసాగుతాయని, 21న ముగింపు కార్యక్రమం నిర్వహించి గవర్నర్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. 22న మధ్యాహ్నం ప్రతినిధుల తిరుగు ప్రయాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నిర్వహించడం రెండోసారి అని చెప్పారు.
త్వరలో హైదరాబాద్-విజయవాడ 6+2 లేన్ల రహదారి పనులు
హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-65ను ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీస్ లేన్లతో విస్తరించేందుకు రూ.12,073 కోట్లతో ఇప్పటికే ఆమోదం లభించిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సాంకేతిక కమిటీల ప్రక్రియ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గ కమిటీ ఆమోదం పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ఇటీవలి ఐఆర్సీలో, గుజరాత్ చింతన్ శివిర్‌లో కేంద్ర మంత్రిని కోరినట్లు వెల్లడించారు. తుది అనుమతులు లభించిన వెంటనే రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారి విస్తరణతో ప్రయాణ సమయం తగ్గడంతోపాటు రోడ్డు భద్రత మెరుగుపడుతుందని, పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని వివరించారు.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగ భూ సేకరణ పూర్తి
రాష్ఠ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని మంత్రి తెలిపారు. సంగారెడ్డి-నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ మార్గంలో 161.518 కి.మీ మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు గతంలో రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ భూసేకరణ పూర్తికాక రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను కూడా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఉత్తర భాగానికి త్వరితగతిన ఆర్థిక, కేంద్ర మంత్రివర్గ ఆమోదాలు లభించాలని గడ్కరీని కోరినట్లు వెల్లడించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామిక పార్కులు, రేడియల్ రోడ్లు తదితర భవిష్యత్ మౌలిక వసతుల అభివృద్ధికి దక్షిణ ఆర్ఆర్ఆర్ కీలకంగా మారుతుందని వివరించారు.
ఎన్‌హెచ్-765పై మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
హైదరాబాద్-శ్రీశైలం ఎన్‌హెచ్-765లోని నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. సుమారు రూ.7,600 కోట్ల అంచనాతో 52 కి.మీ మేర సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని తెలిపారు. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రహదారి విస్తరణకు ఎదురవుతున్న సమస్యలకు ఈ ఎలివేటెడ్ కారిడార్ పరిష్కారంగా నిలుస్తుందన్నారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణంతోపాటు నల్లమల అటవీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వివరించారు. ప్రాజెక్టుకు కేంద్రస్థాయిలో అవసరమైన ఆమోదాలు త్వరగా లభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గ్లోబల్ సమ్మిట్ స్థాయిలో ఐఆర్సీ నిర్వహణ
ఐఆర్‌సీని ఒక సమావేశంగా కాక తెలంగాణ రహదారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రోడ్డు భద్రత, పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడే వేదికగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతినిధులకు తెలంగాణ ఆతిథ్య సంప్రదాయాన్ని చాటిచెప్పేలా ఏర్పాట్లు చేయాలని, ప్రతి విభాగం బాధ్యతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఐఆర్సీ సెక్రటరీ జనరల్ రాహుల్ గుప్తా, ఐఆర్సీ డైరెక్టర్ సురేందర్ గర్గ్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎంవోఆర్టీహెచ్ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ముకుంద్ రెడ్డి, ఆర్ అండ్ బీ శాఖ చీఫ్ ఇంజనీర్లు ధర్మారెడ్డి, వసంత్ నాయక్, బి.వి.రావు, నర్సింగరావు, పలువురు ఆర్ అండ్ బీ ఇంజనీర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





