–కేసీఆర్ ను ఎందుకు ఉరితీయాలి?
– పల్నాడు స్కీమ్ పై పచ్చి అబద్ధాలు
– ఏపీ అక్రమ ప్రాజెక్టులపై మీకు సమాచారం లేదు
– సాగర్ కు ఏపీ పొక్క కొడుతుంటే నిద్రపోతున్నరు
– ఉరి తీయాల్సింది మిమ్మల్నే
– హంద్రీనీవాకు హారతులు పట్టింది మీరు కాదా?
– ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తెప్పిస్తామని మాట మార్చావు
– తప్పుదోవ పట్టించినందుకు క్షమాపణలు చెప్పాలి
– రేవంత్ పై బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: కేసీఆర్ ఉద్యమం చేయడం తప్పా, ప్రాణాలు ఫణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించడం తప్పా, ఎమ్మెల్యే ఎంపీ పదవులకు రాజీనామాలు చేయడం తప్పా? గోదావరి, కృష్ణాలో నీటి హక్కులు సాధించడం తప్పా? కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడమే తప్పు అన్నట్లు రేవంత్ మాట్లాడటం దారుణమని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో కేసీఆర్ ఉరితీయాలని రేవంత్ అంటున్నాడు. ఎందుకు ఉరితీయాలని ప్రశ్నించారు. ఉద్యమ కాలంలో నువ్వు సమైక్య వాదుల సంకలో ఉన్నవు. తెలంగాణ బిడ్డల మీద తుపాకీ గురి పెట్టడమే ఒప్పు అన్నట్లు మాట్లాడుతున్నవు.రాజీనామా చేయకుండా జిరాక్స్ కాగితాలు ఇచ్చి నాటకాలు ఆడినవు. రాష్ట్రం ఏర్పడిన కొద్ది కాలంలోనే కూల్చేందుకు ప్రయత్నించి నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నువ్వే కదా అని అన్నారు. ఏపీ నాయకుల డబ్బు మూటలతో కూలగొట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసినవు.అదేదో ఒప్పు అన్నట్లు మాట్లాడుతున్నవు.మేం నీళ్ల లెక్కలు అడుగుతుంటే కల్లు తాగిన కోతి లెక్కమాట్లాడుతున్నవు. ఫ్రస్టేషన్ ఎందుకు వస్తున్నది నీకు రేవంత్ రెడ్డి. చంద్రబాబు దాసుడైన ఆదిత్యానాథ్ దాసును పక్కన పెట్టుకొని మాట్లాడేది నువ్వేకదా! పాలమూరు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి బతుకులకు కారణం కాంగ్రెస్ కదా.కాలిపోయే మోటార్లు, ఎండి పోయిన బావులకు కారణం టీడీపీ, కాంగ్రెస్.ఈ పరిస్థితుల్లో కదా గులాబీ జెండా పుట్టిందని గుర్తుచేశారు.
నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు కట్టు బానిసలు
గులాబీ జెండా పుట్టకముందు ఎవరైనా నీళ్ల గురించి మాట్లాడారా?ఆనాడు కట్టు బానిసలుగా కాంగ్రెస్, టిడిపి నేతలు చేతులు కట్టుకొని ఉన్నరు.తెలంగాణ హక్కుల కోసం కొట్టాడింది, ఉద్యమం చేసింది, పోరాటం చేసింది గులాబీ జెండా.తెలుగుదేశం పార్టీకి అప్పుడైనా ఇప్పుడైనా రేవంత్ కట్టుబానిస.నీకు తెలంగాణ నీళ్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్వహణ ప్రభుత్వ నిధులు, ఎడమ కాల్వ నిర్వహణకు మాత్రం రైతుల డబ్బులు. ఆనాడు కాంగ్రెస్ మంత్రులు ఉత్తం, కోమటిరెడ్డి ఎవరైనా మాట్లాడారా? హాలియా నుంచి బయల్దేరి పాదయాత్ర చేస్తం అని కేసీఆర్ బయల్దేరిదే.. కుడికాల్వ లెక్క ప్రభుత్వ నిధులతోనే ఎడమ కాల్వ నిర్వహణ చేస్తం అని జీవో ఇచ్చారు. కేసీఆర్ నిలదీస్తే కదా జూరాల నింపి ఆయకట్టుకు నీళ్లు వచ్చింది.ఒక్క ఎకరా ఉమ్మడి మెదక్ లో నీళ్లు పారలేదు. కేసీఆర్ పోరాటం వల్ల మెదక్ జిల్లాకు ఆయకట్టు వచ్చింది.ఎస్ ఆర్ ఎస్పీకి 5లక్షల ఎకరాలు పారలేదు, కేసీఆర్ 9లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.ఎస్ ఆర్ ఎస్సీ స్టేజీ 2లో తుమ్మలు మొలిచాయి.ఉత్తం ప్రాంతం తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ కూడా గులాబీ జెండా ఎగిరాకే నీళ్లు వచ్చాయి.ఎస్సారెస్పీ నుంచి ధవళేశ్వరం వరకు గోదావరి మీద ఒక్క ఆనకట్ట కట్టారా? ఒక్క చుక్క నీళ్లు తెచ్చారా?ఎల్లంపల్లి పూర్తి చేసింది, మేడిగడ్డ కట్టింది, అన్నారం, సుందిళ్ల, సమ్మక్క సాగర్ సీతమ్మ సాగర్ కట్టింది బిఆర్ఎస్ అని గుర్తుచేశారు.
మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదట
మూడు దశాబ్దాల కాంగ్రెస్, టిడిపి పాలనలో పాలమూరుకు 30వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే, కేసీఆర్ 10లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు.
మాటలు కాదు రేవంత్ ఇది నిజం.కల్వకుర్తి నెట్టెంపాడు బీమా కోయిల్ సాగర్ ఆర్డీఎస్ చెరువులు చెక్ డ్యాంలు ఇలా మొత్తం పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం.పల్లెన పల్లేర్లు మొలిచే అనే ఆనాడు మా గోరెటి వెంకన్న పాట రాసిండు. పల్లేర్లు మొలిచిన పాలమూరును పచ్చబడగొట్టింది బిఆర్ఎస్.ఒక్క పాలమూరు ప్రాజెక్టులపై రూ.30వేల కోట్లు ఖర్చు చేసిం.నువ్వు సీఎం అయ్యాక గురువుకు గురు దక్షిణ చెల్లించేందుకు చంద్రబాబు జీవో 403, 405 ఇచ్చిండు. డిసెంబర్ 3, 2024 లైనింగ్ కు జీవో వచ్చింది. 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్లు పారాయి. పాలమూరుకు లేదు.ఎందుకు లైనింగ్ పనులు ఆగలేదు, గురుదక్షిణలో భాగమా రేవంత్ రెడ్డి? కుప్పంకు నీళ్లు ఎట్లా వెళ్తాయి, పాలమూరుకు ఎందుకు నీళ్లు రావు.పాలమూరులో దాదాపు 2లక్షల ఎకరాలకు పంటలు ఎండిపోయే పరిస్థితి.తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే చందగా అక్కడే పుట్టి పాలమూరుకు ద్రోహం చేసినవు.పాలమూరు లిఫ్ట్ పథకానికి 75శాతం పైగా పనులు కేసీఆర్ పూర్తి చేసారు.ప్యాకేజీ 3లో రెండు మూడు కిలోమీటర్లు తవ్వితే 50 టిఎంసీలు లిఫ్ట్ చేయవచ్చు. నాడు ఉద్యమయంలో, నేడు ముఖ్యమంత్రిగా ద్రోహం చేస్తున్నావు.20లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తానని అసెంబ్లీలో పద్దులు పాస్ చేసినవు. అందులో 5శాతం అయినా ఇచ్చినవా? క్షమాపణలు చెప్పు.ఇస్తే ప్రజల ముందు శ్వేతపత్రం విడుదల చేయి.నీళ్ల విషయంలో కేసీఆర్ చిత్తశుద్దిని శంకిస్తారా?పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చింది కేసీఆర్.
వరి ఉత్పత్తిలో రాష్ట్రం నెంబర్ వన్ ఎట్లా అయింది?
వరి ఉత్పత్తిలో 2021-22లోనే తెలంగాణ నెంబర్ వన్ అయింది. మిషన్ కాకతీయ, చెక్ డ్యాంలు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, కొత్త ప్రాజెక్టులు కట్టడం వల్ల రికార్డు సాధ్యమైంది.మాయ చేస్తే మంత్రం వేస్తే అయ్యిందా.నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చినం కనుక సాధ్యం అయ్యింది.మూడేళ్లలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చినవు? ఆ వివరాలు ఉంటే చేసి ఉంటే బయట పెట్టు.ఇచ్చింది గుండు సున్నా. నీళ్లు ఇవ్వ చేతగాలే, ప్రాజెక్టుల అనుమతులు తేలేదు, డీపీఆర్ వాపస్ వచ్చింది.అంబేద్కర్, కాలేశ్వరం మూడో డీఎసీ, సమ్మక్క సాగర్ డీపీఆర్లు వాపస్ వచ్చినయి.కొత్త ఆయకట్టు తేలేదు, కొత్త ప్రాజెక్టు తేలేదు.జీఆర్ఎంబీ మీటింగ్ లో ఏపీ తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజక్టులకు రద్దు చేయండి అని రాసింది.మేం అనుమతులు తెస్తే, ఏపీ అనుమతులు రద్దు చేయాలని కోరుతున్నది.218 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు కట్టినం.నీ మూడేళ్ల పాలనలో ఒక్క టిఎంసీ రిజర్వాయర్ కట్టినవా?ఆయకట్టు లేదు, ప్రాజెక్టు లేదు, ఒక రిజర్వాయర్ లేదు.బురద రాజకీయం తప్ప ఏం చేసినవు.కేసీఆర్ కట్టిన లిఫ్ట్ ఆన్ చేయలేదు.దేవాదుల, సీతారామ, కుల్వకుర్తి ఎన్ని రోజులు, ఎన్ని గంటలు నడిపినవో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు.నువ్వ ఎత్తలేదు కాబట్టి చంద్రబాబు 700 కిలోమీటర్లు నీళ్లు తీసుకుపోయిండు.ఏపీలో క్రాప్ హాలిడే లేదు, తెలంగాణలో క్రాప్ హాలిడే. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది, తాగు నీటి పంపిణీ విషయంలో తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అని.మిషన్ భగరీథ పథకం దేశానికి హర్ ఘర్ జల్ అయ్యింది.ఫ్లోరైడ్ రక్కసికి కారణం కాంగ్రెస్.తాగు నీళ్లు ఇవ్వలేదు, సాగు నీళ్లు ఇవ్వలేదు.
రేవంత్ పచ్చి అబద్దాలు
పల్నాడు స్కీంపై పత్రికలు, మా నాయకులు కేటీఆర్ బయటపెడితే బ్యాక్ డేట్ వేసి తప్పించుకున్నవు. పల్నాడు స్కీంకు టెండర్లు పిలిచింది. జనవరి 2025లో.మరి అప్పుడు ఏం చేస్తున్నవు.ఈనెల 15,16 పత్రికలు బయట పెడితే, 18నాడు కేటీఆర్ మాట్లాడారు.16నాడు మీరు ఉత్తరం రాసారు. నీళ్ల మంత్రి జిల్లాగా నీకు సోయి లేదు, ముఖ్యమంత్రికి సోయి లేదు.ఏపీ అక్రమంగా ప్రాజెక్టు కడుతుంటే ఏడాది నుంచి మీకు కనీసం సమాచారం లేదు.ఆనాడు కేసీఆర్ గారు గర్జిస్తే ప్రాజెక్టులు అప్పగించబోమని బ్యాక్ డేట్ వేసి లేఖలు రాసారు.గోదావరి ఏడు ప్రాజెక్టులు రద్దు చేయాలన్న ఆలోచన విరమించుకోవాలని బిఆర్ఎస్ కొట్లాడితే బ్యాక్ డేట్ వేసి లేఖలు రాసారు.బనకచర్ల విషయంలోనూ అంతే..బిఆర్ఎస్ ఉన్నపుడే పల్నాడు జివో 2022లో వచ్చింది అంటున్నడు రేవంత్ రెడ్డి.ఆనాడు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకుంటాం అని ఎక్కడా లేదు.నువ్వ వచ్చాక జీవో 453జీవో వచ్చింది. నాగార్జున సాగర్ కింది నుంచి పొక్క కొట్టి నీళ్లు తీసుకుపోయే జీవో ఇది.పాత జీవో తెచ్చి అప్పుడే వచ్చింది అంటున్నడు.రేవంత్ వచ్చిన తర్వాత వచ్చిన 458 జీవోలో క్లియర్ గా ఉంది.1.865 టీఎంసీ నాగార్జున సాగర్ నుంచి తీసుకుంటాం అని స్పష్టంగా ఉంది.గతంలో ఉన్న డ్రింకింగ్ వాటర్ తీసుకునే వాటర్ సోర్సును నాగార్జున సాగర్ కు మార్చండి అని ఉంది. నిన్న ఒక్క మాట కూడా పల్నాడును అడ్డుకుంటాం అనలేదు? ఎందుకు అనలేదు.ఇంత జరుగుతుంటే నిన్న హైదరాబాద్ లో కేఆర్ఎంబీ మీటింగ్ జరిగింది.పల్నాడు గురించి ఒక్క మాట చర్చ లేదు అని ఏపీ ఇంజినీర్లు చెబుతున్నరు.తెలంగాణ ఇంజినీర్లు నోరు మూసుకొని పోయారు. రేవంత్ చెప్పిండు గనుక మన ఇంజినీర్లు కనీసం పల్నాడు స్కీం గురించి మాట్లాడలేదు.దొంగే దొంగ అన్నట్లు అరిచినట్లు లేదా రేవంత్ రెడ్డి? 482 జీవో అంటున్నడు అది కాదు.. నిజానికి అది జీవో నెంబర్ 483.ఎన్ ఎస్ పీ ఓబీసీ కెనాల్ ఒంగోల్ బ్రాంచ్ కెనాల్ నుంచి తీసుకుంటం అని జీవోలో ఉంది.. కానీ రేవంత్ మాత్రం నాగార్జున సాగర్ నుంచి నీళ్లు పోతాయి అని అంటున్నడు.పల్నాడు వాటర్ గ్రిడ్ లో అడ్డంగా దొరికిండు దాని నుంచి తప్పించుకునేందుకు ఎన్ని తిప్పలు పడుతున్నడు.అబద్దాలకు అంగీ లాగు వేస్తే రేవంత్ అంటరు.రేవంత్ కు అబద్దాల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాలె.
299:512 విషయంలో..
నీ పక్కన కూసున్న పాపాత్ములే 299 వాటా తెచ్చింది. 299:512 కు కర్త కర్మ క్రియ కాంగ్రెస్ పార్టీ.పీకే మొహంతి చీఫ్ సెక్రెటరీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన కాపీలో ఉంది.అందరు ఎమ్మెల్యేలకు ఆనాడు ఇచ్చారు.ఉమ్మడి రాష్ట్రంలో నాటి కాంగ్రెస్, టిడిపి పాలకులు కృష్ణా జాలాల్లో 299కి పరిమితం చేసారు.విభజన బిల్లులో పెట్టింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా?తెలంగాణ రాష్ట్రం వచ్చిన 42రోజుల్లో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సెక్షన్ 3 కింద కంప్లైంట్ ఇచ్చారు.తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతా అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం మూడేళ్ల సమయం పట్టింది.ఆనాడు తెలంగాణ ఏర్పడిన 42రోజుల్లో కేసీఆర్ గారు ఢిల్లీ పోయి కృష్ణాలో తెలంగాణకు జరుగుతున్న నష్టం గురించి, వాటా గురించి పట్టుబట్టారు.కేంద్ర మంత్రి ఉమాబారతిని కలిసి ట్రిబ్యునల్ వేయాలని కోరారు.ఆ లేఖలో కేసీఆర్ ఏమన్నరు.. 299 కాకుండా మరోక 581 టీఎంసీలు తెలంగాణకు కృష్ణాలో అవసరం ఉందన్నరు.
శాశ్వతంగా ఒప్పుకున్నం అంటున్నడు రేవంత్ రెడ్డి..299కి నాటి ఉమ్మడి పాలకులు కారణం.2015 అగ్రిమెంట్ కు మూల కారణం నాటి కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన డాక్యుమెంట్.ట్రిబ్యునల్ ముందు గానీ, కోర్టు ఆర్డర్లకు చెల్లదు అని తాత్కాలికంగా చేసుకున్న ఒప్పందం అది.నిజంగా శాశ్వతంగా ఒప్పుకుంటే ఎందుకు కేసీఆర్ ట్రిబ్యునల్ సాధించారు.మూడేళ్ల దాకా మహారాష్ట్రతో చర్చలు జరపకుండా కుంభకర్ణుడిలా నిద్రపోతున్నవు.కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అంటున్నవు. నీ ముద్దల ఆదిత్యానాథ్ దాస్ సంతకం పెట్టిండు.చంద్రబాబు దాసుడు దాసుని పెట్టుకొని ఆడుతున్నవు.పర్మినెంట్ అగ్రిమెంట్ అనేది లేదు. కాలేదు. కావాలని తప్పు మాట్లాడుతున్నవు.అవార్డు వచ్చే వరకు 50:50 వాడాలని 30లెటర్లు రాసినం.శాశ్వతంగా ఒప్పుకుంటే 30లెటర్లు ఎందుకు రాసాం? ఎందుకు ట్రిబ్యునల్ వేయాలని కేసీఆర్ అడిగారు. ఇవి కాకుండా కే ఆర్ ఎంబీ, అపెక్స్ మీటింగ్ లలో అడిగాం. ఉరి వేయాల్సింది నిన్ను, నీ ఉత్తం కుమార్ రెడ్డిని. నాగార్జున సాగర్ కు పొక్క కొడుతుంటే కుంభకర్ణ నిద్ర పోతున్నందుకు, దేవాదుల, సీతారామ నీళ్లు లిఫ్ట్ చేయకుండా మోసం చేసినందుకు ఉరి వేయాలె. కుప్పంకు 700 కి.మీ తీసుకుపోతుంటే మౌనంగా ఉన్నందుకు ఉరి వేయాలె. వారం పది రోజులు అసెంబ్లీలో మాట్లాడడానికి నేను సిద్దం. అన్నం తినకుండా మాట్లాడడానికి మేం సిద్దం. నువ్వు సిద్దమా? కేంద్ర మంత్రి హామి ఇస్తే, సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకొని ట్రిబ్యునల్ సాధించింది మేము.మూడేల్ల నుంచి వాదనలు కూడా వినిపించడం కూడా చేతకావడం లేదు. చేతగాని దద్దమ్మవు. ఎన్నిసార్లు ఎక్సటెన్షన్ ఇస్తరు, ఎందుకు ప్రధాని, జలశక్తి మంత్రిని అడగటం లేదు.ప్రాణాలు సైతం లెక్క చేయని మనిషి కేసీఆర్. అలాంటి వ్యక్తి తెలంగాణకు నీళ్ల విషయంలో అన్యాయం చేసిండని పచ్చి అబద్దాలు మాట్లాడుతావా?ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నం గునుక మాకు 50శాతం ఇవ్వండని 2018 నుంచి అడుగుతున్నాం.2021 ఆగస్టు, అక్టోబర్ 2022, డిసెంబర్ 2022 నాడు ఇట్ల అనేక లేఖలు రాసినం.2020 తర్వాత పర్మినెంట్ అప్పగించినం అనేది పూర్తిగా తప్పు.అబద్దాలు తప్ప నిజాలు చెప్పడం రేవంత్ కు చేతగాదు.పిచ్చి పీక్స్ కు పోయి మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి.ఇన్ని మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఫిబ్రవరి 17న మీటింగ్ లో అదే 299:512 తాత్కాలిక ఒప్పందానికి ఒప్పుకొని వచ్చిండు.అంటే నువ్వు మరణశాసనం రాసినట్లా. మేం అనలేమా? ఈ సమస్యకు పరిష్కారం కేసీఆర్ సాధించిన ట్రిబ్యునల్మీరు గట్టిగా ఫైట్ చేస్తే అవార్డు వస్తుంది తెలంగాణ న్యాయమైన నీటి వాటా దక్కుతుందన్నారు.
నీటి వినియోగం గురించి పచ్చి అబద్ధాలు
నీటి వినియోగం గురించి అవే పచ్చి అబద్దాలు మాట్లాడిండు.పర్సెంటేజీ, టీఎంసీ ఏది అనుకూలంగా ఉంటే అది వాడి కంఫర్ట్ గా చెబుతున్నడు.2024-25లో ఏపీ 718, తెలంగాణ 286 వాడింది పర్సెంటేజీ 28శాతం.2025-26 ఏపీ 771, తెలంగాణ 267 పర్సెంటేజీ 25శాతం చరిత్రలో అత్యల్పం.2026-27 ఈ ఏడాదిలో 110 టీఎంసీ వాడినం అంటడు.అవసరం ఉన్న చోట పర్సెంటేజీ చెబుతాడు. మరో చోట టీఎంసీ చెబుతాడు.ఎవర్ లోయెస్ట్ నీటి వినియోగం చేసిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. రాయలసీమ సీమ లిఫ్ట్ గురించి అదే పచ్చి అబద్దం…ఎంత వల్గారిటీ అంటే.. ఎంత వక్రీకరణ అంటే..గతంలో నేనే లిఫ్ట్ ఆపినా అన్నడు రేవంత్..దాన్ని ఖండిస్తూ చంద్రబాబు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చిండు.అందులో ఏమంటడు.. ఎన్జీటీలో కేసులు వేసి తెలంగాణ ప్రభుత్వం పనులు నిలిపివేసింది తప్ప, రేవంత్ ఆపలేదు అని నీ గురువు చంద్రబాబు చెప్పిండు.చెంప పగిలేలా చంద్రబాబు సమాధానం చెప్పినా నీకు బుద్ది రాలేదు, సిగ్గురాలేదు.జగన్ 2019లో వచ్చిండు. 2020 మే 5న జీవో వచ్చింది అంటడు.అసలు జీవో రాకముందే మేం అడ్డుకుంటూ ఉత్తరం రాసినం.2020, జనవరి 20న నాడు రాసిన లేఖలో పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా రాయలసీమను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది బిఆర్ఎస్ ప్రభుత్వం.రేవంత్ మాత్రం జగన్ రాంగనే కేసీఆర్ ఒప్పుకున్నడు అంటడు.జీవో వచ్చిన వారం రోజుల్లో కూడా అడ్డుకోవాలని లేఖ రాసినం.పల్నాడుకు జనవరిలో టెండర్లు పిలిస్తే, నువ్వు బ్యాక్ డేట్ వేసి లేఖ రాసినవు. కేఆర్ఎంబీ మీటింగ్ జరిగితే 2020 జూన్ 4న మేం రాయలసీమను అడ్డుకున్నం. ఆరోజు కేఆర్ఎంబీని ఒప్పించి ప్రాజెక్టును ఆపాలని నెలలో ఏపీకి డైరెక్షన్ ఇప్పించినం. కేసీఆర్ 2020 అక్టోబర్ 2న గజేంద్ర సింగ్ షెకావత్ కు రాయలసీమ లిఫ్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లేఖ రాసారు. కేఆర్ఎంబీ చెప్పాక కూడా టెండర్లు పిలిచారు, ఇది అక్రమ ప్రాజెక్టు ఎలాంటి హక్కు లేదు, ఈ ఎజెండాను సెకెండ్ అపెక్స్ మీటింగ్ లో పెట్టాలి, వెంటనే ఆపడంతోపాటు శ్రీశైలం రిజర్వాయర్ కంట్రోల్ ను తెలంగాణకు ఇవ్వండి అని ధైర్యంగా రాసిండు.
ఇది నిజం రేవంత్ చెప్పింది పచ్చి అబద్దం. కేంద్ర మంత్రి సాక్షిగా, జగన్ ను ఎదురుగా కూర్చోబెట్టి చెప్పిండు. రాయలసీమ ఆపకుంటే ఆలంపూర్ దగ్గర బ్యారేజీ కడతా అని చెప్పిండు కేసీఆర్. జోగులాంబ బ్యారేజీ జీవో కూడా ఇచ్చిండు.. గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా ఎన్జీటీలో స్టే తెచ్చిండు. ఇప్పుడు అదే స్థితిలో ఉంది. రాయలసీమ లిఫ్ట్ చరిత్ర ఇది. కానీ నువ్వ కేసీఆర్ .. జగన్ కు రాసి ఇచ్చిండు అని పచ్చి అబద్దాలు మాట్లాడినవు. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు ఆగి ఉందంటే దానికి కారణం బిఆర్ఎస్ పోరాటం. మొత్తం 19 ఉత్తరాలు రాసినం రాయలసీమ లిఫ్ట్ ఆపాలని.ఇది కాక అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడినం. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ గురించి అవే పచ్చి అబద్దాలు..మేం మంత్రులు అయినం అంటే కేసీఆర్ బిక్ష. మంత్రి పదవులను గడ్డి పోచలుగా భావించి రాజీనామాలు చేసినం. మేం రాజీనామాలు చేసిన తర్వాత పోతిరెడ్డిపాడు జీవో వచ్చింది. అప్పటికే మేం రాజీనామా చేసినం అంటే గ్రాంట్స్ లో ఉంది అంటడు. సీఎంను చూస్తే నాకు పిటీగా ఉంది. మూడేళ్ల ముఖ్యమంత్రికి కనీసం బడ్జెట్ గురించి, పద్దుల గురించి తెల్వదు. జర్నలిస్టులకు అందరికి తెలుసు కానీ నీకు తెలియదు. డిమాండ్స్ గ్రాంట్స్ క్యాబినెట్ అప్రూవ్ చేస్తది అంటడు. క్యాబినెట్ కు పద్దులు రానే రావు. ఎంగిలి మెతుకులకు ఆశ పడ్డది కాంగ్రెస్ నాయకులు. పోతిరెడ్డిపాడుపై అపోహలు వద్దు అని చిన్నారెడ్డి వ్యాసాలు రాసిండు. మేం పదవులు వదిలితే, మీరు మంత్రులు అయ్యారు. అసెంబ్లీలో పోరాటం చేసినం. 42రోజులు అసెంబ్లీని స్తంభింపజేసినం. 26 ఎమ్మెల్యేలం పోరాటం చేసినం. 2005లో పోతిరెడ్డిపాడు మీద వాయిదా తీర్మానం ఇచ్చినం.అసెంబ్లీ మినట్స్ లో ఉన్నాయి. జీవో 170 రద్దు చేయాలని పోతిరెడ్డిపాడుపై చర్చ జరగాలని పట్టుబట్టినం. పోడియం వద్ద నినాదాలు చేసినం.3,4,5,6,7,8 అక్టోబర్ 2005 రోజుల్లో అసెంబ్లీలో ఇదంతా జరిగిందని మినట్స్ స్పష్టం చేస్తున్నాయి.కానీ ఆరోజు ఇదే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు శ్రీదర్ బాబు, ఉత్తం, కోమటి, దామోదర, చిన్నారెడ్డి నోళ్లు మూసుకొని ఉన్నరు.అసెంబ్లీలో ఒక రోజు కాదు గంటలు గంటలు మాట్లాడినం.ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ఉన్నా, మేం నిలదీస్తే మాకు పోతిరెడ్డిపాడుపై మైక్ మొదట ఇచ్చారు.పదవుల కోసం పెదవులు మూసుకున్నది, ఎంగిలి మెతుకుల కోసం మోసం చేసింది కాంగ్రెస్.ఆరోజు హంద్రినీవాకు హరతులు పట్టింది మీరు.ఎంగిలి మెతుకులకు ఆశపడ్దది తెలంగాణ కాంగ్రెస్.పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారు.నీళ్లు ఎత్తుమంటే ఆరోజు అన్నారం సుందిళ్ల కూలితే భద్రాచలం కొట్టుకుపోతుంది అన్నడు.ఇప్పుడేమో మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎత్తకుంటే దేవాదుల సీతమ్మ సాగర్ ఉంది అంటున్నడు.గ్రావిటీ ద్వారా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు రావు అని రేవంత్ చావు కబురు చల్లగ చెప్పిండు.గ్రావిటీ ద్వారా నీళ్లు తెస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చిండు.గ్రావిటీ అని చెప్పినందుకు చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పు.
నోరు విప్పితే అన్నీ అబద్ధాలే
మేడిపండు లెక్క పొట్ట విప్పితే పురుగులు.నో రు విప్పితే అబద్దం. మా పోటీ బీఆర్ఎస్ తోని అని ఒక కాంక్లేవ్ లో చెప్పిండు. ఆయన ఎమ్మెల్యేలే అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నరు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అర్థమై కుట్రలు చేస్తున్నవు.నిద్రలో కూడా కేసీఆర్ నే కలవరిస్తున్నవు. ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ పేరు 50 సార్లు ఉంటది. బిఆర్ఎస్ గెలుపు ఖాయం అయ్యింది.అందుకే ఫ్రస్టేషన్ బురద రాజకీయాలు పాల్పడుతున్నడు. తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటం. కేసీఆర్ అన్ని గమనిస్తున్నారు. ఎప్పుడు రావాల్నో అప్పడు వస్తరు. ప్రజాక్షేత్రంలో ఎండగడుతారు. మీడియా సమావేశంలో మండలి ఎల్ఓపీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





