– గవర్నర్ శివప్రతాప్ శుక్లా
– సమాచార దర్పణం బ్రోచర్ ఆవిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సమాచార హక్కు చట్టం ఒక చట్టం మాత్రమే కాదని, అది మన ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన వంటిదని, పారదర్శకత, జవాబుదారీతనం, పాలనలో ప్రజల భాగస్వామ్యానికి బలమైన పునాది అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు వారోత్సవాలలో భాగంగా రవీంద్రభారతిలో రాష్ట్ర సమాచార కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 2005లో అమలులోకి వచ్చిన చరిత్రాత్మక ఈ చట్టం ద్వారా సామాన్య పౌరులు పాలనా వ్యవస్థను ప్రశ్నించి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా కోరే అధికారం పొందారని తెలిపారు. సమాచార హక్కు కింద దాఖలయ్యే ప్రతి దరఖాస్తు ఒక కాగితం లేదా దరఖాస్తు మాత్రమే కాదని, దాని వెనుక ఒక సమస్య, హక్కుల కోసం విన్నపం లేదా న్యాయం కోసం చేసే ప్రయత్నం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. అందువల్ల ఈ చట్టం విజయాన్ని కేవలం దరఖాస్తులు, అప్పీళ్ల పరిష్కార సంఖ్యతోనే కాక పరిపాలనా విధానాల్లో తీసుకొచ్చే శాశ్వతమైన, పారదర్శకమైన మార్పులతో అంచనా వేయాలని సూచించారు. ఈ చట్టంలోని సెక్షన్ 4(1)(బి) కింద ముందస్తు సమాచార వెల్లడి అత్యంత కీలకమని, అది ఈ చట్టానికి ఆత్మ వంటిదని గవర్నర్ అభివర్ణించారు. ప్రభుత్వ పథకాలు, విధానాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటంతోపాటు నిరంతరం ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా అవసరమైన సమాచారం కోసం ప్రజలు సమాచార హక్కు దరఖాస్తులు దాఖలు చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు, దివ్యాంగులు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార హక్కు చేరేలా చూడటం అందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు. డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), డేటా విశ్లేషణ, డిజిటల్ రికార్డుల నిర్వహణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితంగా, సమ్మిళిత పద్ధతిలో వినియోగించడం ద్వారా సమాచార వ్యవస్థలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సరైన మార్గదర్శకత్వం అందించడం, సుపరిపాలనను బలోపేతం చేసేందుకు తెలంగాణ సమాచార కమిషన్ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. ఈ సందర్భంగా సమాచార కమిషన్ రూపొందించిన వార్తాపత్రిక ‘సమాచార దర్పణం’ను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం డీజీపీ సీవీ ఆనంద్ సమాచార హక్కు ప్రతిజ్ఞ చేయించారు.
15 నెలల్లో 30 వేల కేసులకు గాను 21 వేల కేసులు పరిష్కారం
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం 15 నెలల్లో 30 వేల కేసులకు గాను 21 వేల కేసులను కమిషన్ పరిష్కరించిందని తెలిపారు. 24 శాఖల్లో పెండింగ్‌ను దాదాపు సున్నా స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. తక్షణ సమాచారాన్ని ఆశించే నేటి యువత, ముఖ్యంగా జెన్-జెడ్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు సమాచారాన్ని ముందుగానే ప్రజలకు అందించాలన్నారు. చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం తప్పనిసరిగా చేపట్టాల్సిన స్వచ్ఛంద సమాచార వెల్లడి, సమర్థవంతంగా పనిచేసే ఆన్‌లైన్ సమాచార హక్కు పోర్టల్ ద్వారా ప్రజలకు సమాచారం సులభంగా అందుబాటులోకి రావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ పరిపాలన వంటి అధిక భారంతో పనిచేసే శాఖల్లో అనవసర వ్యాజ్యాలను తగ్గించడంతోపాటు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళల సమాచార హక్కు వినియోగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వినయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, వైష్ణవి మెర్ల, జీహెచఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రజా సమాచార అధికారులు, ప్రథమ అప్పీళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సమాచార హక్కు అవార్డుల ప్రదానం
ఉత్తమ స్వచ్ఛంద సమాచార వెల్లడి విభాగంలో నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, టీజీ జెన్‌కో సీఎండీ హరీష్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన శాఖాధిపతి విభాగంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, ఉత్తమ పనితీరు కనబరిచిన సచివాలయ శాఖ విభాగంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాలు అవార్డు అందుకున్నారు. ఉత్తమ ప్రజా సమాచార అధికారి విభాగంలో ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ నసీర్, మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి అవార్డులు అందుకున్నారు. ప్రత్యేక విభాగంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రామగుండం తహసీల్దార్ రవీందర్ అవార్డులు అందుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





