త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

– జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు
– కేటీఆర్ సవాల్‌పై మరోమారు ఘాటు విమర్శలు
– మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ చివరి నాటికి మరో లక్ష పూర్తవుతాయని, జీహెచఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. సచివాలయంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్‌తో కలిసి పొంగులేటి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. తొలి దశలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. దీనికి అవసరమైన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లాం.. 13చోట్ల స్థలాలు పరిశీలించాం.. జీహెచ్‌ఎంసీలో స్థలం కొరతతో 18వేల ఇళ్లే ఇచ్చాం. పేదల ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నాం.. జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో, నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తాం అని మంత్రి పొంగులేటి వివరించారు. పేదల ఆలోచనలు, సూచనలకు అనుగుణంగానే యుద్ధప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని, ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా మహిళల పేర రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. బీఆరఎస్ ప్రభుత్వం నియోజకవర్గానికి పది ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500కుపైగా ఇళ్లు ఇచ్చిందని, రెండో విడతలో రెండువేల ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లపై బీఆరఎస్ నేత కేటీఆర్, మంత్రి పొంగులేటి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పదేళ్ల బీఆరఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే ఎక్కువ కడితేనే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. లేదంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనన్నారు. మీకంటే ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే మీరు పోటీకి దూరంగా ఉంటారా అంటూ కేటీఆర్‌కు సవాల్ విసిరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *