– ‘తెలంగాణ’ వందశాతం తమదేనంటున్న బిజెపి
– 90 సానాలు సాదిస్తామంటున్న కాంగ్రెస్
– అధికారంలోకి వచ్చేది తామేనంటున్న బిఆర్ఎస్
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయమున్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం రేపోమాపో ఎన్నికలున్నంత హడావుడి చేస్తున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలోని మూడు ప్రధానపార్టీలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. ఈసందర్భంగా ఒకరిపై మరొకరు తీవ్రపదజాలంతో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులమన్న విషయాన్ని మరిచి వ్యక్తిగత విమర్శలతో రాజకీయనాయకులంటేనే ప్రజలకు అయిష్టభావన కలిగిస్తున్నారు. ప్రతీ రాజకీయపార్టీ మిగతారెండు పార్టీలు ఒకదానితోఒకటి సహకరించుకుం టున్నాయన్న ఆరోపణలుచేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నాయి. కాగా తమకు ప్రధానప్రత్యర్థి కాంగ్రెస్సేనంటోంది బిఆర్‌ఎస్. అలాగే తమప్రత్యర్థి బిఆర్‌ఎస్సేనంటూ, బిజెపికి ఇక్కడ ఏమాత్రం ఉనికిలేదని గంటాపథంగాచెబుతున్న కాంగ్రెస్, 90స్థానాలు తమవేనంటున్నది. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కోటి వోట్లను సాధించుకుతీరుతామన్న ధీమాను వ్యక్తంచేస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, 17 పార్లమెంటు స్థానాల్లో 15 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని నమ్మకంగా చెబుతున్నారు. ఆమేరకు కార్యక్రమాలనుకూడా కాంగ్రెస్ రూపొందించుకుంటోంది. ఇప్పటికే గ్రామ,మండల, జిల్లా స్థాయి నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూవస్తున్న ఆ పార్టీ నాయకత్వం కార్యకర్తలను ఉత్సాహపర్చే విధంగా సభలు సమావేశాలను కొనసాగిస్తున్నది. వివిధ జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ ముఖ్యనాయకుల నియోజక వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కెటిఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో, శాసనసభ బిఆర్‌ఎస్ పక్ష ఉప నాయకుడు టి. హరీష్‌రావుల నియోజకవర్గాల్లో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇతర నియోజకవర్గాల పరిస్థితేమున్నా ఈ నియోజకవర్గాల్లో వందల కోట్లరూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంద్వారా ఆయా నియోజకవర్గ ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేక భావనను తుడిచివేసే ప్రయత్నంచేస్తున్నారు. తర్వాత లక్ష్యం గజ్వెల్. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గమైన గజ్వెల్‌లో ఒక తొక్కుడు తొక్కితే ఫామ్‌హౌజ్‌కే పరిమితమైనాడంటూ కెసిఆర్‌పైన సెటైర్లు వేస్తున్న రేవంత్‌రెడ్డి తన బలమేంటన్నది త్వరలోనే అక్కడ ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో వ్యూహాలు, ఎత్తుగడలేవైనా తాను చూసుకుంటానని, బిఆర్‌ఎస్‌ను నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత మీమీద ఉందంటూ ఆయన కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పోరాటంచేసిన నాయకులెవరైనా వారికి బీ ఫామ్ ఇంటికి తీసుకువచ్చి ఇస్తామంటూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. కాగా బిఆర్‌ఎస్‌కూడా అదే దూకుడుగా ప్రచారంలో దూసుకుపోతున్నది. ఇప్పటికే జనచైతన్య సభల పేరున కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మూడేళ్ళు అయినా నెరవేర్చలేక పోయిందంటూ విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నాలుగైదు జిల్లాలో నిర్వహించిన జనచైతన్య సభలకు ప్రజలు విశేషంగా రావడంతో ఆపార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఇనుమడిస్తున్నది. ఈ సందర్భంగా పార్టీలో కొత్తగా చేరుతున్నవారి సంఖ్యకూడా పెరుగుతున్నది. తాజాగా జరిగిన హనుమకొండ సభలో ప్రముఖ విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతిరెడ్డితో పాటు మాజీ కార్పోరేటర్లు, కాంగ్రెస్‌పార్టీ స్థానిక నాయకులు పలువురు చేరడం గమనార్హం. కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, ఇంకా 500 రోజులు ఓపిక పడితే కెసిఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. బిజెపికూడా ప్రచారంలో ఏమాత్రం వెనుకబడకుండా ముందుకు దూసుకుపోతున్నది. రానున్న ఎన్నికల్లో వందశాతం మనమే గెలుస్తామని గతంలో కేంద్ర మంత్రి అమిత్‌షా అంతర్గత సమావేశాల్లో పేర్కొన్న విషయం ఇప్పుడు విస్తృత ప్రచారంలోఉంది. గెలుపు విషయాన్ని తనకు వదిలేసి, కార్యకర్తలు కష్టపడిపనిచేయాలన్నప్పటినుండి ఆపార్టీ శ్రేణులు అన్నివర్గాలవారిని కలుపుకుపోయే కార్యక్రమాలను చేపట్టారు. బిజెపి ఎలాగు అధికారంలోకిరాదు కాబట్టి బిసీని సిఎం చేస్తామని చెబుతున్నదన్న ఆరోపణలున్నప్పటికీ తమ పోరాటమంతా బీసీలకోసమేనని ప్రచారం చేస్తున్నది. వాస్తవానికి ఈ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు బలమైన నాయకులులేరు. అయినా తాము ఎవరితోనూ పొత్తుపెట్టుకోబోమని బిజెపి ముందునుండి చెబుతున్నది. అయినప్పటికీ ఇతర పార్టీలనుండి వచ్చేవారిని మాత్రం ఆహ్వానిస్తామంటున్నారు స్థానిక నాయకులు. కాని, ఇతర పార్టీల్లో పదవుల్లో ఉన్నవారు తమ పదవిని త్యాగంచేసి రావాలన్న బిజెపి షరతుతో ముందుకు రావడంలేదని నాయకులు జంకుతున్నట్లు తెలుస్తున్నది. అయినా గెలుపుమీద ధీమా వ్యక్తంచేస్తున్న ఆపార్టీ సీనియర్‌నాయకుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రంలో తమ ఆట మొదలైందన్న సంకేతాలిస్తున్నారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని ఆదోగతిపాలుచేశాయని, బిజెపి వస్తేనే రాష్ట్రం పురోగమిస్తుందంటున్నారు. దీనికి తగినట్లుగా కేంద్రనుండి ఆపార్టీ నాయకలిప్పుడు వరుసకడుతున్నారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి బిఎం సందీప్‌కుమార్ సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన బిజెపి ర్యాలీలో పాల్గొన్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి..అరాచకాన్ని అంతం చేయండి’ అన్న నినాదంతో దేశవ్యాప్తంగా బిజెపి నిర్వహిస్తున్న 40 ర్యాలీల్లో కరీంనగర్ ర్యాలీకూడా ముఖ్యమైంది. ఇదిలాఉంటే తెలంగాణపై ప్రత్యేక దృష్టిపెట్టిన కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ నెల 24న హైదరాబాద్‌కు రానున్నారు. అలాగే మరో ముఖ్యనేత జెపి నడ్డా సిద్ధిపేటలో పార్టీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాగా తెలంగాణ రక్షణసేన తామేమాత్రం తీసిపోమన్నట్లుగా గ్రామస్థాయి కమిటీల నిర్మాణం చేసుకుంటోంది. నిద్ర నటిస్తున్న అధికార పక్షాన్ని, నిద్ర పోతున్న ప్రతిపక్షాన్ని సవాల్‌చేస్తున్న ఆపార్టీకూడా భవిష్యత్ తమదేనంటోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





