– ప్రభుత్వం వారిని వెంటనే ఆదుకోవాలి
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27: అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా అనేక వ్యవసాయ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు తీవ్రంగా దెబ్బతినడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి అండగా ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆపత్కాలంలో రైతన్నలకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురిసిన అకాల వర్షాలకు పలు మార్కెట్ యార్డుల్లో వడ్లు వర్షానికి కొట్టుకుపోతుంటే రైతన్నలు కన్నీరుమున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేక సెల్‌ఫోన్‌ల వెలుతురులో రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకోవడానికి పడుతున్న అవస్థలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత, ముందుచూపు లేకపోవడం వల్లే రైతన్నలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్లే రైతుల ఆరుగాలం కష్టం కళ్లముందే నీళ్లపాలవుతోందని ధ్వజమెత్తారు. ఈ కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతాంగానికి అండగా నిలిచేందుకు బీఆరఎస్ శ్రేణులన్నీ క్షేత్రస్థాయికి వెళ్లాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తక్షణమే తమ పరిధిలో అకాల వర్షాల వల్ల ప్రభావితమైన అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు. రైతుల పక్షాన నిలబడి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా, రైతులకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచాలని దిశానిర్దేశం చేశారు. మార్కెట్ యార్డుల్లో తడిసిన వరి, మొక్కజొన్న తదితర ధాన్యాన్ని తేమ శాతం, తరుగు లాంటి ఎలాంటి సాకులు చెప్పకుండా బేషరతుగా కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వర్షాలకు పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.





