– ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు
– మళ్లీ అధికారంలోకి వస్తాం
– ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలి
– ఆర్ఆర్ఆర్, హైదరాబాద్- విజయవాడ హైవే ప్రాజెక్టులను కేంద్రం ఆమోదించాలి
– ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరే కత లేదని, వొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని. కనీసం 90 సీట్లు కచ్చితంగా వస్తాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం గాంధీ భవన్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సందీప్ కుమార్తో మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కీలకం
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారనున్నాయని మంత్రి కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ఎన్నికల ఫలితాలు భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం జాప్యం చేస్తోంది
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేసిందో గుండె మీద చేయి వేసుకుని చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణం కోసం 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదం ఇవ్వలేదని, టెండర్ల ప్రక్రియను కూడా మూడు సార్లు వాయిదా వేసిందని ఆరోపించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ, రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం వచ్చినప్పటికీ ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను వద్దని నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అనుమతులు సిద్ధం చేసినప్పటికీ బీజేపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేతలు నితిన్ నబిన్, జేపీ నడ్డా రాష్ట్రానికి వస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు వెంటనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని మంత్రి కోమటిరెడ్డి కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





