– ప్రకటనల ప్రపంచాన్ని శాసిస్తున్న కార్పొరేట్లు
– గుర్తింపు కోల్పోతున్న చిన్న వ్యాపారులు
– డిజిటల్ ప్రకటనలదే 60శాతం వాటా
– గ్రామీణ మార్కెట్లలోకి చొరబడుతున్న బడా సంస్థలు
– దెబ్బతింటున్న నాణ్యమైన స్థానిక ఉత్పత్తులు
ఒకప్పుడు వ్యాపార ప్రకటనలంటే పెద్ద పెద్ద కంపెనీలకే పరిమితమైన వ్యవహారం కాదు. పట్టణంలోని చిన్న వస్త్ర దుకాణం, స్థానిక నగల వ్యాపారి, ప్రైవేటు విద్యాసంస్థ, ప్రాంతీయ ఉత్పత్తుల తయారీదారు సైతం తమ వ్యాపారాన్ని ప్రజలకు పరిచయం చేసుకునేందుకు దినపత్రికలను ఆశ్రయించేవారు. పత్రికల్లో ఒక చిన్న ప్రకటన ఇచ్చినా వేలాది మంది పాఠకులకు చేరువయ్యే అవకాశం ఉండేది. తక్కువ ఖర్చుతో తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకునే వెసులుబాటు ఉండేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. వ్యాపార రంగంలో నాణ్యత, ధర, సేవలతో పాటు ప్రచార బలం కూడా కీలకంగా మారింది. ఈ పోటీలో ఆర్థికంగా బలమైన బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు దూసుకుపోతుండగా చిన్న వ్యాపార సంస్థలు క్రమంగా వెనుకబడుతున్నాయి. ప్రస్తుతం ప్రకటనల ప్రపంచాన్ని కార్పొరేట్ సంస్థల భారీ ప్రచార వ్యూహాలు శాసిస్తున్నాయి. టెలివిజన్ ప్రకటనలు, సినీ ప్రముఖుల బ్రాండ్ అంబాసిడర్ పాత్రలు, క్రికెటర్ల ప్రచారాలు, సామాజిక మాధ్యమాల్లో నిరంతర ప్రచారం ద్వారా పెద్ద కంపెనీలు వినియోగదారుల మనసుల్లో తమ బ్రాండ్లకు స్థిరమైన స్థానం కల్పిస్తున్నాయి. ఒక ఉత్పత్తిని కొనాలనే ఆలోచన రాకముందే ఆ బ్రాండ్ పేరు వినియోగదారుడి మదిలో ముద్రపడుతోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రచారం చేసే సంస్థలతో చిన్న వ్యాపారులు ఎలా పోటీపడగలరు? మంచి నాణ్యత కలిగిన ఉత్పత్తి ఉన్నా దానికి తగిన ప్రచారం లేకపోతే మార్కెట్లో గుర్తింపు పొందడం కష్టమవుతోంది. దేశంలో ప్రకటనల వ్యయంలో వచ్చిన మార్పులు ఈ ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. 2020లో మొత్తం ప్రకటనల వ్యయంలో డిజిటల్ మాధ్యమాల వాటా సుమారు 24 శాతం ఉండగా, 2025 నాటికి అది 45 నుంచి 46 శాతానికి చేరింది. ఎఫ్ఎంసీజీ రంగంలో డిజిటల్ ప్రకటనల వాటా 30 శాతం నుంచి 55–60 శాతానికి పెరిగింది. దేశ ప్రకటనల మార్కెట్ 2025లో సుమారు రూ.1.55 లక్షల కోట్ల స్థాయికి చేరగా, అందులో డిజిటల్ మాధ్యమాల వాటా దాదాపు 60 శాతంగా అంచనా వేయబడింది. ఈ గణాంకాలు ప్రకటనల రంగం ఎంత వేగంగా మారుతోందో తెలియజేస్తున్నాయి.
ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించింది. ఒకప్పుడు గ్రామీణ వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై స్థానిక వ్యాపారులు, తెలిసిన వ్యక్తులు, బంధువుల సలహాలు ప్రభావం చూపేవి. ఇప్పుడు స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ విస్తరణతో గ్రామీణ ప్రజలు కూడా భారీ ప్రచార ప్రపంచానికి చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ప్రముఖుల ప్రకటనలు, ఆకర్షణీయమైన ఆఫర్లు వారి కొనుగోలు అభిరుచులను ప్రభావితం చేస్తున్నాయి. గ్రామీణ మార్కెట్లను కూడా పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ప్రచారంలో కనిపించే ఆకర్షణే నాణ్యతకు ప్రమాణమా? ఒక ప్రముఖ నటుడు లేదా క్రికెటర్ ప్రచారం చేసిన వస్తువుపై వినియోగదారుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాడు. అదే సమయంలో స్థానికంగా తయారయ్యే నాణ్యమైన ఉత్పత్తికి ప్రచారం లేకపోవడంతో అది మరుగున పడుతోంది. ఫలితంగా బ్రాండ్ గుర్తింపునకు ప్రాధాన్యం పెరిగి, నాణ్యత, ధర, ఉపయోగం వంటి అసలు అంశాలు వెనుకబడుతున్నాయి.
ఈ మార్పు పత్రికా ప్రకటనల రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పండుగల ప్రత్యేక ఆఫర్లు, కొత్త దుకాణాల ప్రారంభోత్సవాలు, నగల వ్యాపారం, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, రియల్ ఎస్టేట్ ప్రకటనలు ఒకప్పుడు దినపత్రికల్లో విస్తృతంగా కనిపించేవి. చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు పత్రికలు విశ్వసనీయమైన ప్రచార వేదికగా ఉండేవి. ఇప్పుడు వాటిలో అనేక సంస్థలు పత్రికా ప్రకటనలకు ఖర్చు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. తక్కువ ఖర్చుతో సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వవచ్చని, నిర్దిష్ట ప్రాంతాల వినియోగదారులను చేరుకోవచ్చని భావిస్తున్నాయి. దీంతో పత్రికల్లో స్థానిక వ్యాపార ప్రకటనల ప్రాధాన్యం తగ్గుతోంది.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పత్రికలు కూడా కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. చిన్న వ్యాపారులకు అందుబాటు ధరల్లో ప్రకటనల ప్యాకేజీలు, స్థానిక వ్యాపారాలకు ప్రత్యేక పేజీలు, ప్రింట్‌తో పాటు డిజిటల్ ప్రచార సదుపాయాలు కల్పించాలి. వ్యాపార సంఘాలు కూడా చిన్న సంస్థల ఉత్పత్తులకు సమష్టి ప్రచారం కల్పించే ప్రయత్నం చేయాలి. ప్రకటనలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలి కానీ ఆర్థికంగా బలమైన సంస్థల ఆధిపత్యానికి సాధనంగా మారకూడదు. నాణ్యత కలిగిన చిన్న వ్యాపారికి కూడా వినియోగదారుడిని చేరుకునే అవకాశం ఉండాలి. లేకపోతే మార్కెట్లో పోటీ క్రమంగా తగ్గి, ప్రచార బలమే విజయానికి కొలమానంగా మారుతుంది. పెద్ద కంపెనీల ప్రచార హోరులో చిన్న వ్యాపారాల గొంతు వినిపించకుండా పోకూడదు. ఆరోగ్యకరమైన మార్కెట్ వ్యవస్థకు పెద్ద సంస్థలతో పాటు చిన్న వ్యాపారాల మనుగడ కూడా అంతే అవసరం.
– పెండ్యాల కొండల్
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





