సృజనాత్మక, వినోద రంగాలకు కేంద్రంగా హైదరాబాద్

– తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
– సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరాన్ని గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు జాతీయ, అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, కామిక్ తదితర క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధ సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించి తమ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కథలు-ఆటలు-కలలు అనే థీమ్‌తో యువతను ఆకర్షించేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా కామిక్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్ బిజినెస్ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కామిక్ కాన్, డ్రీమ్‌హాక్, ఇండియా గేమ్ ఉత్సవ్ వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా B2B ఎక్స్‌పో, ఇన్నోవేషన్ జోన్, యానిమేషన్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లోని సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పెట్టుబడి, వ్యాపార అవకాశాలను ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే సుమారు 50 పెద్ద, 150 వరకు మధ్యతరహా యానిమేషన్, గేమింగ్ సంస్థలు ఉన్నాయని సీఎస్ తెలిపారు. మరిన్ని అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు ఆకర్షించడంతోపాటు ఈ అభివృద్ధి చెందుతున్న రంగాల్లో రాష్ట్ర యువతకు విస్తృత అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమాలు, ఎక్స్‌పోలు, స్టాళ్లను నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రత్యక్షంగా సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 70 కళాశాలలకు చెందిన విద్యార్థులతోపాటు దాదాపు 50 వేల మంది సందర్శకులు ఈ కార్యక్రమాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ వెల్లడించారు. యువతలో సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ క్రియేటివ్, ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సంజయ్ తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *