మళ్లీ మా ప్రభుత్వం రావడం తథ్యం

– ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే
– బీజేపీతో పొత్తు ఉండదు.. ఒంటరి పోరే
– బీజేపీ-బీఆర్ఎస్‌ల మధ్య ఎలాంటి అవగాహన లేదు
– ఇండియా టుడే కాంక్లేవ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్/కొచ్చి, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ధీమా వ్యక్తం చేశారు. కేరళలోని కొచ్చిలో బుధవారం జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం – ఆవిర్భావం నుండి రూపాంతరం అనే అంశంపై కేటీఆర్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. మీరు ప్రధాన రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి.. అని యాంకర్ అంటే కేటీఆర్ బదులిస్తూ ‘ఖచ్చితంగా కాదు.. రాబోయే ఎన్నికల్లోనూ కేసీఆరే మా ముఖ్యమంత్రి అభ్యర్థి.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఆయనే సీఎం పీఠాన్ని అధిరోహిస్తారు.. తదుపరి సదస్సులో కేసీఆరే ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ కూర్చుని మీతో మాట్లాడతారు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ఆయన తెరదించారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతోందంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆరఎస్-బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార పదేపదే ఆరోపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆరఎస్ ఖాతా తెరవలేకపోవడం, పలువురు నేతలు పార్టీని వీడటంతో గులాబీ శ్రేణుల్లో కొంత స్తబ్దత నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు కేటీఆర్ జాతీయ వేదికలపై పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ వాగ్దానాలకు ప్రజలు మోసపోయారు

మూడేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎన్నో తప్పుడు వాగ్ధానాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా ఉండే కార్డులు ఇచ్చింది. తెలంగాణ ప్రజలకు వాళ్లు 420 హామీలు ఇచ్చారు. బంగారం, స్కూటీలు, మహిళలకు నెలకు రూ.2500 సహా 420 హామీలు ఇచ్చారు. మేం కేవలం 1.8 శాతంతో అధికారం కోల్పోయాం. 4 లక్షల ఓట్ల అతి తక్కువ తేడాతో కోల్పోయాం అని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ వీధుల్లో తిరుగుబాటు వస్తది అని అన్నారు.

బీజేపీతో పొత్తుల ప్రసక్తే లేదు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్-బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార కాంగ్రెస్ పదేపదే ఆరోపిస్తోందని కేటీఆర్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆరఎస్ ఖాతా తెరవలేకపోవడం, పలువురు నేతలు పార్టీని వీడటంతో గులాబీ శ్రేణుల్లో కొంత స్తబ్దత నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు కేటీఆర్ జాతీయ వేదికలపై పార్టీ వైఖరిని ఇంత స్పష్టంగా ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి సార్వత్రిక ఎన్నికల లక్ష్యంగా బీఆర్ఎస్ ఒంటరి పోరాటానికి సిద్ధమవుతోందని కేటీఆర్ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల సిద్ధాంతాలు వేర్వేరు ధ్రువాలని, రాజకీయంగా తాము ఆ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘మా పార్టీకి 26 ఏళ్ల చరిత్ర ఉంది.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మేము ఎన్నడూ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు.. 2014, 2018, అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ త‌మ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగింది. సిద్ధాంతాలు, పార్టీ డీఎన్‌ఏ మారనంత వరకు భవిష్యత్తులోనూ ఒంటరి పోరాటమే ఉంటుంది’ అని తేల్చి చెప్పారు. 2023 ఎన్నికల తర్వాత అధికారానికి దూరమైనప్పటికీ పార్టీ కేడర్ బలంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే తిరిగి నిలుస్తారని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *