– ప్రభుత్వ తీరుపై పౌర సంఘాల ఆగ్రహం
– స్వతంత్ర విచారణకు డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17 : ప్రజాస్వామిక హక్కుల కోసం ప్రశ్నిస్తున్న యువ సామాజిక కార్యకర్తల కోసం పోలీసులు అర్ధరాత్రి వేళ తనిఖీలు నిర్వహించి పలువురిని నిర్బంధించడాన్ని వివిధ వివిధ పౌర సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్ రక్షణ, నిఘా సాంకేతిక సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న సంబంధాలపై ప్రశ్నించినందుకే కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఓ ప్రకటనలో ఆరోపించాయి. ఈ ఘటనలపై స్వతంత్ర విచారణ జరిపించాలని, ప్రభుత్వం బహిరంగ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఈనెల 16న హైదరాబాద్‌లోని టీ-హబ్, రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ సంయుక్తంగా 20 ఇజ్రాయెల్ కంపెనీలతో వ్యాపార కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సంస్థలతో ముఖ్యంగా రక్షణ, నిఘా రంగాల్లో ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలపై పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో 15న అర్ధరాత్రి నుంచి 16వ తేదీ తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలువురు కార్యకర్తల ఇళ్లకు పోలీసులు వెళ్లి విచారణ చేపట్టినట్లు వెల్లడించాయి. చార్మినార్ లక్కడ్‌కోట ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(ఎస్‌ఐవో) తెలంగాణ కార్యాలయానికి వెళ్లిన మీర్‌చౌక్ పోలీసులు రాష్ట్ర అధ్యక్షుడు ఫరాజ్ అహ్మద్ కోసం ఆరా తీశారని, అనంతరం రాష్ట్ర క్యాంపస్ కార్యదర్శి మహమ్మద్ తాజ్, రాష్ట్ర కార్యదర్శి తఖియుద్దీన్ జైద్‌లను అదుపులోకి తీసుకుని రాత్రంతా నిర్బంధించారని ఆరోపించాయి. నిజామాబాద్‌లో ఎస్‌ఐవో నాయకుడి నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ఏపీసీఆర్ రాష్ట్ర సమన్వయకర్త ఉమర్ ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకున్నారని, న్యాయవాది జోక్యంతో ఆయన విడుదలయ్యారని పేర్కొన్నాయి. రాజేంద్రనగర్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ పలువురు కార్యకర్తలను పోలీస్ స్టేషన్లకు రావాలని ఆదేశించినట్లు తెలిపాయి. కార్యకర్తలను ఏ కారణంతో నిర్బంధించారో స్పష్టం చేయాలని, వారి రాజ్యాంగ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పౌరసంఘాలు కోరాయి. నిర్బంధాలకు సంబంధించిన చట్టపరమైన కారణాలను వెల్లడించడంతోపాటు ఇజ్రాయెల్ రక్షణ, నిఘా, సాంకేతిక సంస్థలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు, భాగస్వామ్యాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం పౌరుల ప్రజాస్వామిక హక్కు అని, శాంతియుత నిరసనలు, భావప్రకటనా స్వేచ్ఛను పోలీసు చర్యలతో అణచివేయడం సరికాదని స్పష్టం చేశాయి. ఎస్‌ఐవో తెలంగాణ, ఏపీసీఆర్ తెలంగాణతోపాటు నిర్బంధాలకు గురైన యువ కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించాయి. ఈ ప్రకటనపై పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, ఖలీదా పర్వీన్, ప్రొఫెసర్ పద్మజా షా, ఎస్.క్యూ.మసూద్, సారా మాథ్యూస్, మీరా సంగమిత్ర, సంజీవ్(హ్యూమన్ రైట్స్ ఫోరం), మహమ్మద్ హమ్మాదుద్దీన్ తదితరులు సంతకాలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




