- లక్ష మంది వస్తారని అంచనా
- నేడు జగిత్యాల బంద్ కు పిలుపు
- ఈనెల 14న కరీంనగర్ లో జరగనున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్
హైదరాబాద్, ప్రజాతంత్ర మే 12: తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఈనెల 14న కరీంనగర్ లో లక్ష మందితో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ తెలంగాణ ఇంఛార్జీ తరుణ్ చుగ్ తోపాటు ‘‘కేరళ స్టోరీ’’ సినిమా యూనిట్ హిందూ ఏక్తా యాత్రకు రాబోతోందని చెప్పారు. తెలంగాణలో హిందువులపై దాడులు చేస్తూ హిందువులను హేళన చేస్తున్న కుహానా లౌకిక వాదులకు చెంపపెట్టుగా యాత్ర నిర్వహించబోతున్నామని, హిందువులంతా స్వచ్ఛందంగా హాజరై సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సు గొడవ ఘటనలో జగిత్యాల ఎస్ఐని సస్పెండ్ చేయడంతోపాటు ఆయన భార్యపైనా కేసులు నమోదు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
ఎంఐఎం నాయకులు బెదిరింపులకు తలొగ్గి ఎస్ఐని సస్పెండ్ చేసి కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ నేడు జగిత్యాల బంద్ కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. నర్సంపేటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య చేసుకోవడం పట్ల దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్ ఇది ముమ్మాటికీ రాష్ట్ర సర్కార్ చేసిన హత్యగానే అభివర్ణించారు. శుక్రవారం మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి తదితరులతో కలిసి కరీంనగర్ పట్టణంలోని వైశ్య భవన్ వద్దకు వచ్చిన బండి సంజయ్ ఈనెల 14న జరగబోయే హిందూ ఏక్తా యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు.