“ఇప్పటి విద్యుత్ చార్జీల అంశం మరింత కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బషీర్‌బాగ్ వరకు వెళ్లిన ఉద్యమ చరిత్ర వామపక్షాలకు ఉంది. ఆ పోరాటం కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు; సామాన్యుడిపై పడే ఆర్థిక భారానికి వ్యతిరేకమైన రాజకీయ ప్రతిస్పందన. ఇప్పుడు తెలంగాణలో ట్రూ-అప్ పేరుతో వినియోగదారులపై అదనపు విద్యుత్ భారం పడుతున్నప్పుడు అదే ఎర్రజెండా ఎందుకు అంత బలంగా కనిపించడం లేదన్న ప్రశ్నకు వామపక్షాలు సమాధానం చెప్పాలి..”
దేశ రాజకీయ, సామాజిక ఉద్యమాల చరిత్రలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి జగిత్యాల జైత్రయాత్ర వరకు, భూపోరాటాల నుంచి బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమం వరకు ఎన్నో ప్రజా పోరాటాలకు ఈ నేల వేదికైంది. ఒకప్పుడు ఎర్రజెండా కదిలిందంటే పాలకవర్గాలు ఉలిక్కిపడేవి. పేదలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సమస్యలను తమ సమస్యలుగా స్వీకరించి ప్రభుత్వాలను ప్రశ్నించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది.
కానీ నేటి తెలంగాణలో ఆ పోరాట స్ఫూర్తి ఎక్కడ కనిపిస్తోంది? ఒకప్పుడు ప్రజల చుట్టూ తిరిగిన ఎర్రజెండా పార్టీలు ఇప్పుడు అధికార రాజకీయాల చుట్టూ తిరుగుతున్నాయనే విమర్శ బలపడుతోంది. ప్రజా ఉద్యమాలకు వారసులమని చెప్పుకునే పార్టీలు ఎన్నికల పొత్తులు, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అవకాశాలు, నామినేటెడ్ పదవుల లెక్కల్లో చిక్కుకుపోతే వాటి రాజకీయ స్వతంత్రతపై ప్రశ్నలు రావడం సహజం.
తెలంగాణలో ప్రజా సమస్యలకు కొదవ లేదు. రైతాంగం సాగునీరు, విద్యుత్, పెట్టుబడి భారాలతో ఇబ్బందులు పడుతోంది. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. భూములు, నిర్వాసితులు, పట్టణ పేదల గృహాలు, మూసీ అభివృద్ధి, హైడ్రా చర్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ వీటిని కేంద్రంగా చేసుకొని రాష్ట్రవ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రధాన వామపక్ష పార్టీలు గతంలో చూపిన చొరవ ఇప్పుడు కనిపించడం లేదనే అభిప్రాయం ఉంది.
ముఖ్యంగా భూమి సమస్యలపై కమ్యూనిస్టు ఉద్యమాలకు ఘనమైన చరిత్ర ఉంది. భూమి కోసం పోరాడిన వారసత్వాన్ని గర్వంగా చెప్పుకునే పార్టీలు నేడు భూ వివాదాలు, నిర్వాసితుల సమస్యలు, పట్టణ అభివృద్ధి పేరుతో పేదలపై పడుతున్న ప్రభావాలపై మరింత స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు స్వయంగా పోరాటాలు చేస్తున్న చోట ఎర్రజెండా ముందుండాలి. అధికార పార్టీకి రాజకీయంగా దగ్గరగా ఉండటం వల్ల ప్రజా సమస్యలపై గొంతు బలహీనపడితే అది కమ్యూనిస్టు ఉద్యమానికే నష్టం.
కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, వాటి వ్యయం, పర్యావరణ ప్రభావం, ప్రాజెక్టు ప్రణాళికపై వచ్చిన వివాదాలు కూడా ప్రశ్నించాల్సిన అంశాలే. ప్రజాధనం ఎంత ఖర్చయింది? ప్రాజెక్టు రూపకల్పనలో లోపాలున్నాయా? తరువాత నిర్ణయాలు ఎందుకు మారాయి? బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలను ప్రతిపక్షాలతోపాటు వామపక్షాలు కూడా గట్టిగా లేవనెత్తాలి. ఈ వ్యవహారంలో అవినీతి లేదా క్విడ్‌ప్రోకో జరిగిందనే ఆరోపణలు ఉంటే అవి ఆధారాలతో విచారణకు రావాలి. ఆరోపణలను నిజాలుగా ప్రకటించడం ఎంత తప్పో, అవి అధికారంలో ఉన్న మిత్రపక్షానికి సంబంధించినవని మౌనం పాటించడం కూడా అంతే తప్పు.
గత ప్రభుత్వంపై ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారం సహా పలు అంశాల్లో తీవ్రంగా స్పందించిన పార్టీలు ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాల విషయంలో కూడా అదే ప్రమాణాన్ని పాటించాలి. కమ్యూనిస్టు రాజకీయాల అసలు బలం ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాకుండా, ప్రజా ప్రయోజనమే ప్రమాణంగా వ్యవహరించడంలో ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ప్రమాణం, గత ప్రభుత్వం అయితే మరో ప్రమాణం అనిపిస్తే వామపక్షాల విశ్వసనీయతే దెబ్బతింటుంది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. ప్రభుత్వం నిధుల కొరతను ప్రస్తావిస్తున్నప్పుడు ఆదాయం ఎందుకు తగ్గింది? వ్యయ ప్రాధాన్యతలు ఏమిటి? ఎన్నికల హామీల అమలుకు ఎంత అవసరం? అభివృద్ధి ప్రాజెక్టులకు చేస్తున్న ఖర్చు ఎంత? అనే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి ప్రజల ముందుంచాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను అర్థం చేసుకోవడం ఒక విషయం; ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మరో విషయం. రెండింటినీ కలిపివేయకూడదు.
ఇప్పటి విద్యుత్ చార్జీల అంశం మరింత కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ బషీర్‌బాగ్ వరకు వెళ్లిన ఉద్యమ చరిత్ర వామపక్షాలకు ఉంది. ఆ పోరాటం కేవలం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు; సామాన్యుడిపై పడే ఆర్థిక భారానికి వ్యతిరేకమైన రాజకీయ ప్రతిస్పందన. ఇప్పుడు తెలంగాణలో ట్రూ-అప్ పేరుతో వినియోగదారులపై అదనపు విద్యుత్ భారం పడుతున్నప్పుడు అదే ఎర్రజెండా ఎందుకు అంత బలంగా కనిపించడం లేదన్న ప్రశ్నకు వామపక్షాలు సమాధానం చెప్పాలి.
కేంద్ర, రాష్ట్ర పన్నులు, ధరల పెరుగుదల, ఉపాధి సమస్యలు, వ్యవసాయ సంక్షోభం మధ్య సామాన్యుడిపై మరో భారం పడితే మొదట స్పందించాల్సింది ప్రజాపక్ష రాజకీయాలే. బషీర్‌బాగ్ త్యాగాలను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే వారసత్వం కాదు; అవసరమైనప్పుడు అదే పోరాట స్వభావాన్ని ప్రదర్శించడమే నిజమైన వారసత్వం. కమ్యూనిస్టు పార్టీలకు ఇంకా సామాజిక గౌరవం ఉంది. అనేక తరాల త్యాగం, నిబద్ధత, ప్రజా పోరాటాల వల్ల అది వచ్చింది. ఆ సంపదను పదవుల రాజకీయాలకు పరిమితం చేయకూడదు. కాంగ్రెస్‌తో ఎన్నికల లేదా జాతీయ రాజకీయ అవగాహన ఉండవచ్చు. కానీ అది రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించే హక్కును, ప్రజా సమస్యలపై పోరాడే బాధ్యతను హరించకూడదు.
ప్రజల కోసం పుట్టిన ఎర్రజెండా అధికార పార్టీకి రక్షణ కవచంగా కనిపించడం మొదలైతే అది ప్రమాదకరం. కమ్యూనిస్టులు ఎవరి శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదు; కానీ అధికారంలో ఎవరు ఉన్నా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రశ్నించాల్సిన చోట ప్రశ్నించాలి. పోరాడాల్సిన చోట పోరాడాలి. లేకపోతే తెలంగాణ ప్రజలు అడిగే ప్రశ్న ఒక్కటే—ఎర్రజెండా రంగు వెలిసిందా? పోరాట స్ఫూర్తి తగ్గిందా? లేక అధికార రాజకీయాల కోసం బషీర్‌బాగ్ వారసత్వాన్నే పక్కన పెట్టారా?
-తోటకూర రమేష్





