కథాతీతం : బాలాజీ పోతుల
యుద్ధం మనుషుల్ని చంపుతుంది; ఆకలీ చంపుతుంది. అదే ఆకలి యుద్ధ వాతావరణంలో తీవ్రరూపం దాల్చినప్పుడు మనిషిని ఎంతటి అమానుష చర్యకైనా పురికొల్పగలదా? ఒకప్పుడు ప్రాణాల్ని కాపాడిన వ్యక్తే ప్రాణాల్ని తీసే స్థితికి దిగజారితే, దాన్ని ఆకలి అనివార్య పరిణామంగా భావించాలా? లేక అలా చిత్రించిన రచయిత దృక్పథాన్ని ప్రశ్నించాలా? ఎం.వి. రామిరెడ్డి రాసిన ‘మాదాకవళం’ కథ ప్రధానంగా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతుంది.
ఈ కథలో యుద్ధం నేపథ్యంగానే కాదు; ఒక పూట ఆహారం కోసం మనుషులు పరస్పరం దాడి చేసుకునే స్థితికి నెట్టే శక్తిగానూ కనిపిస్తుంది. డేనియల్, హనా, జావెద్, కెఫాయా అనే నలుగురు వ్యక్తులూ నాలుగు విభిన్న జీవితానుభవాలతో ఆహార పంపిణీ కేంద్రానికి చేరుకుంటారు. డేనియల్ తన కొడుకు ద్వారా వందలాది మంది ఆకలి తీర్చిన వ్యక్తిగా, హనా తన చెల్లిని కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించిన పన్నెండేళ్ల పాపగా, జావెద్ తల్లిదండ్రులు చేసినవో చేయనివో తెలియని పనులకు శిక్షననుభవించిన యువకుడిగా, కెఫాయా సైనికుల లైంగిక హింసకు గురైన మహిళగా పరిచయమవుతారు. ఈ నలుగురి జీవితాల్లోనూ ఉమ్మడిగా కనిపించేది ఆకలి మాత్రమే కాకుండా, తమ ప్రమేయం లేకుండానే ఇతరులు సృష్టించిన పరిస్థితులకి బలికావటమూ ఉంది.
కథలో అత్యంత ముఖ్యమైన పాత్ర డేనియల్. కొడుకు ద్వారా ఆకలితో ఉన్నవారికి ఆహారమందించాలని చెప్పిన వ్యక్తే, చివరికి కొడుకు మరణం తర్వాత తీవ్రమైన ఆహారపు లోటును ఎదుర్కొని, హనా చేతుల్లోని ఆహారాన్ని లాక్కుని ఆమె చావుకి కారణమవుతాడు. ఇది కథలోని అత్యంత శక్తిమంతమైన వైరుధ్యం. కానీ, ఈ వైరుధ్యాన్ని రచయిత కళాత్మకంగా అభివృద్ధి చేశాడా? అంటే సందేహమే. డేనియల్ తన కొడుకు చావును తట్టుకోలేక మానసికంగా కుంగిపోయినట్లు, బంధువులకు భారంగా మారినట్లు కథ చెబుతుంది; అయితే, ఆహారం కోసం ఒక చిన్నారిని విసిరికొట్టేంత స్థితికి తానెట్లా చేరుకున్నాడన్న పరిణామం మాత్రం స్పష్టంగా కనిపించదు. ఆకలి ఒక్కటే అతని ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పును సమర్థిస్తుందా?
డేనియల్–డేవిడ్–హనా సంబంధం కథకు లోతైన నిర్మాణానికి అవకాశమిచ్చింది. డేవిడ్ తన తండ్రి మాటని ఆచరణలో పెట్టి ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచి తిరిగెళ్తుండగా యుద్ధానికి బలవుతాడు. హనా తన చెల్లి కోసం ఆహారం తీసుకెళ్తూ ప్రాణాలు కోల్పోతుంది. డేవిడ్‌ను చంపింది యుద్ధ హింస అయితే, హనాను చంపింది కూడా అదే యుద్ధ హింసలో ఆకలితో అలమటిస్తున్న డేనియల్. ఈ విషాదవలయం కథకి బలమైన అంతర్గత నిర్మాణం కావచ్చు. అయితే హనా చెల్లి ఉనికి ఆమె అర్ధాంతర చావుకి కల్పించే అదనపు విషాదాన్ని కథ పూర్తిగా వినియోగించుకోలేదు.
హనా పాత్ర నిర్మాణంలో రచయిత కనబరిచిన ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. ఆమె చేతుల్లోని ఆహారానికి ప్రత్యేక అర్థం కల్పించబడింది. రెండోసారి కాల్పులు జరిగినప్పుడు కూడా హనా భయంతో కూలిపోదు; ఆహారాన్ని కాపాడుకుంటూ కాల్పుల మధ్య నుంచి బయటపడుతుంది. తన చెల్లి కోసం ఆహారాన్ని కాపాడుకుంటూ వచ్చిన తను, మరో ఆకలిగొన్న మనిషి చేతిలో చనిపోవడమే ఈ పాత్ర విషాదం.
జావెద్, కెఫాయాల విషయంలోనూ ఇదే సమస్య. జావెద్ తండ్రిపై వచ్చిన ఆరోపణల కారణంగా చిన్నతనం నుంచే అనుభవించిన అవమానాలు, కెఫాయా సైనికుల చేతుల్లో గురైన లైంగిక హింస- ఇవన్నీ వ్యవస్థాగత అన్యాయాలే. ఇద్దరూ బాధితులే. కానీ, చివర్లో కెఫాయా జావెద్ ఆహారాన్ని లాక్కోవటం, జావెద్ ఆమెపై దాడి చేయడం చూస్తే బాధితుల మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. వాళ్లిద్దరూ ఒకరి విషాదాన్ని మరొకరు తెలుసుకున్న తర్వాత కూడా ఆ పరిచయం చివరి ఘర్షణలో ఎలాంటి పాత్రా పోషించదు. బాధితులు హింసాత్మకులుగా మారే అవకాశం ఉండటం వేరు; ప్రతి బాధితుడినీ ఒకే రకమైన హింసాత్మక ప్రతిస్పందనకు చేర్చడం వేరు. హనా బలవుతుంది; డేనియల్, జావెద్, కెఫాయాలు ఆ హింసలో భాగస్వాములవుతారు. అప్పుడు యుద్ధ బాధితుల మధ్య ఉండగల భిన్నమైన మానవ స్పందనలకు కథలో చోటుందా? యుద్ధాన్ని సృష్టించిన అధికార వ్యవస్థలకూ, ఆ యుద్ధంలో బలైన మనుషులకూ మధ్య సంబంధాన్ని కథ ఎంతవరకు చిత్రించింది అన్న ప్రశ్న ఇక్కడ మిగులుతుంది.
నలుగురి గతాల్లోనూ ఇతరులు సృష్టించిన హింసే కనిపిస్తుంది. కానీ చివరికి, కథ ప్రధానంగా వాళ్లు ఒకరిపై ఒకరు చేసుకునే దాడులపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. అప్పుడు వాళ్లను ఆ స్థితికి నెట్టిన వ్యవస్థల బాధ్యత కంటే, ఆ స్థితిలో వాళ్లు ప్రదర్శించిన అమానవీయతే ప్రధానంగా నిలుస్తుంది. యుద్ధం మనుషుల్ని ఎంతటి దుస్థితికైనా నెట్టగలదని చూపించడానికీ, ఆ దుస్థితిలో మనుషులు ఒకరినొకరు హింసించుకోవడాన్నే ప్రధాన విషాదంగా చిత్రించడానికీ మధ్య తేడా అవసరం ఉంది.
నాలుగు కదనరంగాలను సృష్టించటం కథా విశేషం. కానీ, నాలుగు జీవితగాథలూ దాదాపు ఒకే రీతిలో చెప్పడం వల్ల పాత్రల స్వరాలలోని ప్రత్యేకత తగ్గింది. కెఫాయా తనపై జరిగిన లైంగిక హింసను అప్పుడే పరిచయమైన వ్యక్తుల ముందు అంత విపులంగా వివరించటానికి అవసరమైన మానసిక సందర్భం కొద్దిగా లోపించింది. పన్నెండేళ్ల హనా అనుభవ ప్రపంచానికీ, డెబ్బై ఏళ్ల డేనియల్ అనుభవ ప్రపంచానికీ మధ్య తేడా భాషాపరంగా పెద్దగా వ్యక్తం కాలేదు. ఏ పాత్ర స్వభావం నుంచైనా సహజంగా రావాల్సిన ఘట్టం, పాఠకులకి గతాన్ని తెలియజెప్పటానికే పెట్టినట్టుగా అనిపిస్తే అక్కడ కథనం బలహీనపడుతుంది.
జావెద్ తన ఆకలిని రంజాన్ ఉపవాసాలతో పోల్చుకోవటం లాంటి సందర్భాలు పాత్రల్ని పాఠకులకి సన్నిహితంగా చూపుతాయి. అయితే, కథనకాలంలోనూ కొన్నిసార్లు కృత్రిమత్వం కనిపిస్తుంది. ఉదయం నుంచి వేలాది మంది ఆహారం కోసం ఎదురుచూస్తున్నట్లు చెబుతూనే, మధ్యాహ్నం ఒంటిగంట వరకు పాత్రలు సుదీర్ఘ జీవితగాథల్ని చెప్పుకునేలా వాతావరణం కూర్చడం సహజత్వాన్ని దెబ్బతీస్తుంది. ఆహార కేంద్రంపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఆరుగురు కాల్పులు జరుపుతారు; కానీ వాళ్లు ఏ సైన్యానికి చెందినవారో, ఎందుకు దాడి చేశారో తెలియదు. ఈ అస్పష్టత యుద్ధంలోని అధికార వ్యవస్థల పాత్రని వెనక్కి తోస్తుంది. దాడి తర్వాత ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించకుండా డేనియల్, కెఫాయాలు వేరొకరి ఆహారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించడం కూడా తగిన మానసిక పునాదిని కోరుకుంటుంది.
రచయిత కథలో దృశ్యాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాడు. ప్రారంభంలోని రాబందు, ఎండలో నిలబడిన వేలాదిమంది, ఖాళీపాత్రలు, చివర్లో రక్తంతో తడిసిన రొట్టెముక్కలు భయానక వాతావరణాన్ని కల్పిస్తాయి. రాబందు తన సహజ స్వభావంతో ఆహారాన్ని వెతుక్కుంటుంది; కానీ కథలోని మనుషులు యుద్ధ పరిస్థితుల్లో ఆహారం కోసం పరస్పరం హింసించుకుంటారు. ఈ రెండింటినీ ఒకే ప్రతీకాత్మక సంబంధంలోకి తీసుకురావడం వల్ల, యుద్ధం సృష్టించిన అమానవీయతను మనిషి సహజ ప్రవృత్తిగా భావించే అవకాశం ఉంది. ఆకలిని పులితో పోల్చడం, సూర్యుడు నిప్పులు కక్కడం, నెత్తుటి ఫౌంటెన్లు, శవాలగుట్టలు వంటి అతిశయోక్తి వర్ణనలు కథంతటా ఎక్కువ కావడంతో వాటి ప్రభావం కొంత తగ్గింది. పాత్రల విషాదాన్ని వివరించేటప్పుడు రచయిత స్వరం తరచూ పాత్రల స్వరాన్ని మించిపోతుంది.
కథ చివర్లో ఆ మైదానం ఎక్కడుందో గుర్తుపట్టమని రచయిత పాఠకుల్ని ప్రశ్నిస్తాడు; టెహ్రాన్, టెల్ అవీవ్, గాజా, ఖార్కివ్ లాంటి ప్రాంతాల్ని ప్రస్తావిస్తాడు. కథను విశ్వవ్యాప్తం చేయాలన్న ఉద్దేశం బాగానే ఉన్నా, అప్పటివరకు నిర్మించిన కళాత్మక ప్రపంచం తనంతట తానే మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, దాని అర్థాన్ని రచయితే స్వయంగా వివరించడం వల్ల ముగింపు ప్రభావం కొంత తగ్గింది.
‘మాదాకవళం’ మనిషి జీవితమంతా ఒక ముద్ద ఆహారం కోసం పోరాటంగా మారిన విషాదాన్ని బలంగా చాటుతుంది. ఆకలి మనుషుల్ని అమానుష స్థితికి నెట్టగలదనే సత్యాన్ని ఈ కథ శక్తిమంతంగా చిత్రిస్తుంది. కానీ, ఆకలి నుంచి అమానవీయతకు వెళ్లే ఆ ప్రయాణానికి తగిన మానసిక అనివార్యతను నిర్మించగలిగిందా? ఆ స్థితికి దారితీసిన సామాజిక-రాజకీయ కారణాల్నీ, పాత్రల అంతర్గత మానసిక సంఘర్షణలనీ, భిన్నమైన మానవ స్పందనలనీ అంతే లోతుగా ఆవిష్కరించగలిగిందా? యుద్ధం మనుషుల్ని చంపడమే కాకుండా, మనుషుల్ని ఒకరినొకరు చంపుకునే స్థితికి ఎలా నెడుతుందో చూపించడంలో కథ ఎంతవరకు సఫలమైందన్న ప్రశ్న మాత్రం మిగిలిపోతుంది.
(ఈ కథ ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం బతుకమ్మలో సెప్టెంబర్ 6న ప్రచురితమైంది)





