“ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో సోనియా గడిపిన బాల్యం గురించి చదువుతుంటే, ఆమె జీవించిన కాలం, ఆ తరువాతి తరాల బాల్యం తెలంగాణలోని అనేక గ్రామాల్లో గడిచిన మన బాల్యంలోకి తీసుకెళ్లాయి. ఆమె వివరించిన మనుషులు, కుటుంబ సంబంధాలు, చుట్టుపక్కల వాతావరణం, రోజువారీ జీవితంలోని అనుభవాలు మనకు ఎంతో పరిచయమైనవిగా అనిపించాయి. భౌగోళికంగా, భాషాపరంగా, సాంస్కృతికంగా ఎంతో దూరంలో ఉన్నప్పటికీ, ఈ బాల్యాల మధ్య ఎన్నో పోలికలు కనిపించాయి…”
సోనియా గాంధీ ‘Belonging’లో బాల్యానుభవాల సార్వజనీనత
సోనియా గాంధీ రాసిన ‘Belonging’ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఈ పుస్తకంపై జరుగుతున్న చర్చల్లో ఎక్కువగా ఆమె రాజకీయ ప్రయాణం, భారతదేశంలో ఆమె జీవితం గురించే ప్రస్తావన కనిపిస్తోంది. అయితే, నాకు ప్రత్యేకంగా ఆకర్షించినవి ఇటలీలో ఆమె కుటుంబ నేపథ్యం, అక్కడ గడిపిన బాల్యం గురించి రాసిన రెండు అధ్యాయాలు. ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో సోనియా గడిపిన బాల్యం గురించి చదువుతుంటే, ఆమె జీవించిన కాలం, ఆ తరువాతి తరాల బాల్యం తెలంగాణలోని అనేక గ్రామాల్లో గడిచిన మన బాల్యంలోకి తీసుకెళ్లాయి. ఆమె వివరించిన మనుషులు, కుటుంబ సంబంధాలు, చుట్టుపక్కల వాతావరణం, రోజువారీ జీవితంలోని అనుభవాలు మనకు ఎంతో పరిచయమైనవిగా అనిపించాయి. భౌగోళికంగా, భాషాపరంగా, సాంస్కృతికంగా ఎంతో దూరంలో ఉన్నప్పటికీ, ఈ బాల్యాల మధ్య ఎన్నో పోలికలు కనిపించాయి.
కుటుంబం – పరిచయమైన సామాజిక ప్రపంచం
సోనియా తన బాల్యంలో ఇటలీలోని సంప్రదాయ కుటుంబ వ్యవస్థ గురించి వివరిస్తారు. ఆ కుటుంబంలో తండ్రే సర్వాధికారి. ముఖ్యమైన నిర్ణయాలన్నీ ఆయన అనుమతితోనే జరగాలి. పిల్లలు ప్రశ్నించకుండా పెద్దలు చెప్పినట్లు వినాలి. పిల్లలు మాట వినకపోతే, తల్లులు “నాన్నకు చెబుతాను” అని హెచ్చరించడం చాలాసార్లు వారిని క్రమశిక్షణలో ఉంచడానికి సరిపోయేది. ఇది మన సంప్రదాయ భారతీయ కుటుంబాలను వెంటనే గుర్తుకు తెస్తుంది. మగపిల్లవాడే పుట్టాలని కోరుకునే మనస్తత్వం కూడా సోనియా కుటుంబంలో కనిపిస్తుంది. మూడవ సంతానం కూడా ఆడపిల్ల కావడంతో ఆమె తండ్రి కొద్దిరోజులపాటు నిరాశ చెందడం మనల్ని ఆలోచింపజేస్తుంది. కుటుంబ వంశాన్ని కొనసాగించేది కొడుకే అన్న భావన భారతీయ కుటుంబాల్లోనే ఉందనుకునేవారికి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది.
సోనియా తన తల్లి గురించి రాస్తూ, ఆమె ఎనిమిది మంది తోబుట్టువుల్లో పెద్దదని, సుమారు 25 మంది సభ్యులతో కూడిన ఉమ్మడి కుటుంబంలో పెరిగిందని చెబుతారు. ఈ వివరణ మన గ్రామాల్లో ఒకప్పుడు ఉండే పెద్ద ఉమ్మడి కుటుంబాలను గుర్తుకు తెస్తుంది. పెద్ద కూతుళ్లు ఇంటి పనుల్లోనూ, చిన్నపిల్లల సంరక్షణలోనూ బాధ్యతలు పంచుకోవడం సాధారణం. కుటుంబ జీవితం అనేది కేవలం తల్లిదండ్రులు, పిల్లల మధ్య సంబంధం మాత్రమే కాదు. అనేక తరాల మధ్య ఏర్పడిన అనుబంధాల సమాహారం.
సాధారణ కుటుంబాల కష్టాలు
సోనియా తల్లిదండ్రుల జీవితాల గురించి ఆమె చేసిన వివరణలు కూడా మనకు ఎంతో పరిచయమైనవిగా అనిపిస్తాయి. ఆమె తండ్రి కుటుంబ పోషణ కోసం కష్టపడి పనిచేసేవారు. గ్రామంలో ఒక చిన్న కిరాణా దుకాణం ఉండేది. అవసరమైనప్పుడు అదనపు పనులు కూడా చేసేవారు. వారి ఆర్థిక పరిస్థితులు అంత సులభంగా ఉండేవి కావు. వారి ప్రాంతంలోని భూములు వ్యవసాయానికి పెద్దగా అనుకూలంగా ఉండేవి కావు.ఈ వివరాలు మన గ్రామాల్లోని సాధారణ కుటుంబాల జీవితాలను గుర్తుకు తెస్తాయి. కుటుంబ అవసరాల కోసం తండ్రులు రోజంతా కష్టపడేవారు. అవసరమైతే అదనపు పనులు చేసేవారు. తల్లులు ఇంటి బాధ్యతలన్నింటినీ నిర్వహిస్తూ ఎంతో శ్రమించేవారు. అయితే, ఆ శ్రమకు చాలాసార్లు తగిన గుర్తింపు ఉండేది కాదు.
సోనియా తన చిన్నాన్నతో తండ్రికి సఖ్యత ఉండేది కాదని, వారి మధ్య గొడవలకు కారణాలు తనకు అప్పట్లో అర్థమయ్యేవి కావని రాస్తారు. దాయాదుల మధ్య విభేదాలు అక్కడ కూడా ఉండేవని అర్థమవుతుంది. అయితే, చిన్నాన్న మరణించిన తరువాత ఆయన పిల్లలకు తండ్రి లేని లోటు తెలియకుండా సోనియా తండ్రి ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. చిన్నాన్న పిల్లలతో, పిన్నితో కూడా సోనియా కుటుంబానికి మంచి అనుబంధం ఏర్పడింది. కుటుంబాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, ఆపద సమయంలో ఒకరికొకరు అండగా నిలబడే మానవీయ సంబంధాలు ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తుచేస్తుంది.
అమ్మమ్మ వాళ్ల ఊరు – పుట్టింటి అనుబంధం
తన పుట్టింటి మీద, కుటుంబ సభ్యుల మీద, అక్కడి మనుషుల ఆప్యాయత మీద సోనియా తల్లికి ఉన్న మమకారం కూడా ఎంతో సహజమైన అనుభూతిని కలిగిస్తుంది. సోనియా తల్లి తండ్రి తన గ్రామస్తులను జర్మన్ సైనిక దాడుల నుంచి కాపాడినందుకు ఆ ప్రాంతంలో ఒక హీరోగా గుర్తింపు పొందారు. ఇటలీ విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. ఇది చదువుతుంటే మన కుటుంబాల్లో అమ్మలకు తమ పుట్టింటి మీద ఉండే ప్రేమ గుర్తుకొస్తుంది. అమ్మమ్మ వాళ్ల ఊరితో, అక్కడి మనుషులతో ఉండే అనుబంధం ప్రత్యేకమైనది. మన తాతలు చేసిన పోరాటాల గురించి, వారు ఎదుర్కొన్న కష్టాల గురించి కూడా చిన్నప్పుడు ఎన్నో కథలు వింటూ పెరిగాం. పుట్టినిల్లు అనేది ఒక ప్రాంతం మాత్రమే కాదు. అది ఎన్నో జ్ఞాపకాలకు, అనుబంధాలకు నిలయం.
తాతయ్యలు – జ్ఞాపకాల నిధులు
సోనియాకు తన తాతయ్యతో ఎంతో అనుబంధం ఉండేది. ఆయన నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. సోనియాకు ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయనకూ మనవరాలంటే అంతే ప్రేమ. మొదటి ప్రపంచ యుద్ధంలో తన అనుభవాలు, సాహసాల గురించి ఆమెకు కథలుగా చెప్పేవారు. పెద్దగా చదువుకోకపోయినా యూరప్ చరిత్ర, రాజకీయాలపై మంచి అవగాహన ఉండేది. వార్తాపత్రికలు చదవడం, రేడియోలో వార్తలు వినడం ఆయన దినచర్యలో భాగం. స్కూలుకు వెళ్లేటప్పుడు సోనియా తాతయ్యను కలిసేది. ఆయన తన జేబులో నుంచి జాగ్రత్తగా పర్సు తీసి కొంత డబ్బు ఇచ్చేవారు. సోనియా నాయనమ్మ మాత్రం తన ఊరిని విడిచి వేరే ప్రాంతానికి రానని మొండికేసిందట. తెలియని ప్రాంతానికి వెళ్లడానికి ఇష్టపడక, తాతయ్య వెళ్లినా తాను మాత్రం గ్రామంలోనే ఉండిపోయిందట. ఇది చదివినప్పుడు మన అమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు గుర్తుకొస్తారు. తమ ఊరిని, ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడని పెద్దవాళ్లు మనకు కూడా పరిచయమే.
ఈ విషయాలు చదువుతుంటే తెలంగాణలోని అనేక గ్రామాల్లో నివసించిన ఒక తరం తాతయ్యలు గుర్తుకొస్తారు. స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నవారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులు ప్రతి గ్రామంలోనూ ఉండేవారు. స్వాతంత్ర్య పోరాటంలో తమ అనుభవాలను, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట విశేషాలను మనకు కథలుగా చెప్పేవారు. సోనియా తాతయ్యలాగే వారికీ చరిత్ర, సమాజం, రాజకీయాలపై ఆసక్తి ఉండేది. తాతయ్యలు, మనవళ్లు, మనవరాళ్ల మధ్య ఉండే అనుబంధంలో ఒక విశ్వజనీనత ఉంది. వారు వేర్వేరు భౌగోళిక, చారిత్రక కాలాల్లో జీవించి ఉండవచ్చు. కానీ తమ అనుభవాలను కథల రూపంలోనూ, చిన్న చిన్న ఆప్యాయతల రూపంలోనూ తరువాతి తరాలకు అందిస్తారు. వారు తరాల మధ్య ఒక వారధిగా నిలుస్తారు.
పొరుగువారే పెద్ద కుటుంబం
సోనియా బాల్యం గురించి చదువుతున్న కొద్దీ మన బాల్య జ్ఞాపకాలు మరింతగా గుర్తుకొస్తాయి. సోనియా తన చిన్న పట్టణంలో పిల్లలందరూ ఒకరికొకరు పరిచయస్తులుగా ఉండేవారని, స్నేహితుల ఇళ్లకు స్వేచ్ఛగా వెళ్లివచ్చేవారని వివరిస్తారు. ఒకరి ఇల్లు మరొకరికి కూడా తమ ఇంటిలాగే ఉండేది. మన గ్రామాల్లో కూడా బాల్యం ఇలాగే గడిచేది. స్నేహితుల ఇళ్లకు ఎలాంటి సంకోచం లేకుండా వెళ్లేవాళ్లం. వారి తల్లిదండ్రులు కూడా మాకు పరిచయమే. మమ్మల్ని తమ పిల్లలుగానే ఆదరించేవారు. ఒకరి కుటుంబం మరొకరి కుటుంబంలో భాగంగా ఉండేది.
పెద్ద పెద్ద ఇళ్లు, బంగళాల లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే సోనియా చిన్ననాటి ఆసక్తి కూడా మన గ్రామాల్లోని మా బాల్యాన్ని గుర్తు చేసింది. పెద్ద ఇళ్లలోకి తొంగిచూడటం, అక్కడి జీవితాన్ని తెలుసుకోవాలనే కుతూహలం మాకూ ఉండేది. పంట కోసిన తర్వాత మొక్కజొన్న కంకులను పెద్ద కుప్పలుగా పోసి ఎండబెట్టే పనిలో మహిళలు కలిసికట్టుగా పనిచేసే దృశ్యాన్ని కూడా సోనియా గుర్తుచేస్తారు. మన గ్రామాల్లోనూ మహిళలు ఇలాగే కలిసి పనిచేస్తూ, మాట్లాడుకుంటూ తమ బాధ్యతలను పంచుకునేవారు. సమాజంలోని చాలా పనులు సమష్టిగా జరిగేవి.
పండుగలు, ఆహారం – పంచుకునే ఆనందం
పండుగల సమయంలో పిల్లలు ఒకరి ఇళ్లకు మరొకరు వెళ్లడం, క్రిస్మస్ సందర్భంగా అలంకరించిన క్రీస్తు జనన దృశ్యాలను (Nativity Scenes) చూడటం, ఇంటికి వచ్చిన పిల్లలకు చాక్లెట్లు, ప్రత్యేకమైన బిస్కెట్లు ఇచ్చి ఆహ్వానించడం గురించి సోనియా రాశారు. ఇది చదువుతుంటే మన దసరా సెలవులు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో స్నేహితుల ఇళ్లకు వెళ్లేవాళ్లం. వారి తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయంగా పలకరించి, పండుగకు చేసిన ఫలహారాలు పెట్టేవారు. పండుగలు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక వేడుకలు మాత్రమే కావు. పిల్లలు కలుసుకోవడానికి, ఆనందాన్ని పంచుకోవడానికి, స్నేహాలను పెంచుకోవడానికి అవి ఒక మంచి అవకాశం.
బాల్యాన్ని అందంగా చేసిన చిన్న చిన్న విషయాలు
సోనియా చెప్పిన కొన్ని చిన్ననాటి అనుభవాలు చాలా ముచ్చటగా అనిపించాయి. కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చినప్పుడు ఆమె పొందిన ఆనందం, ఒక్కొక్క పుస్తకాన్ని తెరిచి చూడటం, వాటిని క్రమంగా సర్దుకోవడం, మళ్లీ మళ్లీ పేజీలు తిప్పి చూడటం గురించి చదివినప్పుడు మా స్కూలు రోజులు గుర్తుకొచ్చాయి.ఆ రోజుల్లో చాలా మంది పిల్లలం కొత్త పుస్తకాల కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసేవాళ్లం. పుస్తకాలకు అట్టలు వేసుకుని, వాటిని జాగ్రత్తగా సర్దుకుని, పదేపదే తిరగేసి చూసేవాళ్లం. కొత్త పుస్తకాలు రావడం చిన్ననాటి జీవితంలో ఒక ప్రత్యేకమైన సందర్భం. అలాగే, బిడియంగా ఉండే తనను ప్రోత్సహించిన టీచర్ గురించి కూడా సోనియా రాస్తారు. పిల్లలలోని సంకోచాన్ని అర్థం చేసుకుని వారిని ప్రోత్సహించే ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమో ఈ సంఘటన గుర్తుచేస్తుంది.
చిన్ననాటి మరో సంఘటన కూడా ఆసక్తికరంగా ఉంది. స్నేహితురాలి ఇంటి బయట ఎండలో ఆరబోసిన వాల్నట్స్ను ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి, ఆ విషయం గురించి తల్లికి అబద్ధం చెప్పిన సంఘటనను సోనియా గుర్తుచేసుకుంటారు. తండ్రి విధించిన శిక్ష, తల్లిదండ్రుల కోపం, క్రమశిక్షణ విషయంలో వారి పట్టుదల, ఆ తరువాత తమ కఠిన ప్రవర్తనను సమర్థించుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలు – ఇవన్నీ మన బాల్యాల్లోనూ కనిపించిన అనుభవాలే.
గ్రామం వదిలి పట్టణ బాట
ఆ తరువాత కుటుంబం మరో పట్టణానికి మారినప్పుడు కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి సోనియాకు చాలా సమయం పట్టింది. అక్కడ ఆమెకు ఎవరూ పరిచయం లేదు. అంతేకాదు, స్థానికులు సోనియా యాస, భాషను హేళన చేసేవారు. వారిని దేశదిమ్మరులుగా ముద్రవేసి చులకనగా చూసేవారు. దీనికి ఆమె తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారు. ఈ అవమానాలకు స్పందనగా సోనియా తండ్రి ఇంట్లోవారిపై కోపం చూపించేవారట. కొత్త పట్టణంలో ప్రతి రోజూ సాయంత్రం ప్రధాన రహదారి దగ్గరకు వెళ్లి, తన పాత గ్రామం వైపు వెళ్లే నెమ్మదిగా కదిలే రైలు కోసం ఆమె ఎదురుచూసేది. ఆ రైలులో తనకు తెలిసినవారెవరైనా కనిపిస్తారేమో, వారికి చేయి ఊపి పలకరించవచ్చేమో అని ఆశపడేది. మన గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి స్థిరపడిన పిల్లలు కూడా తమ ఊరి వైపు వెళ్లే బస్సుల కోసం ఎదురుచూసేవారు. ఆ బస్సులో తమకు తెలిసినవారెవరైనా ఉంటారేమోనని ఆశగా చూసేవారు. ఆ బస్సు కనిపించగానే తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామంలోని స్వేచ్ఛాయుతమైన జీవితం గుర్తుకొచ్చేవి. కొన్నిసార్లు ఆ బస్సు వెళ్లిపోతుంటే చూస్తూ ఉండిపోవడమే ఒక విషాదమైన అనుభూతిగా మారేది.
ఇంటిని వదిలి వెళ్లడంలోని బాధ
ఈ రెండు అధ్యాయాల్లో నన్ను ఎక్కువగా కదిలించిన అంశం తనకు పరిచయమైన ప్రపంచాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చినప్పుడు సోనియా అనుభవించిన బాధ. తల్లిదండ్రులు ఆమెను బోర్డింగ్ స్కూల్కు పంపాలని నిర్ణయించినప్పుడు ఆమె ఎంతో బాధపడింది. బోర్డింగ్ స్కూల్లో తనకు ఎదురైన కఠినమైన క్రమశిక్షణ, స్వేచ్ఛ లేని జీవితం గురించి సోనియా చేసిన ప్రస్తావన మనల్ని ఆలోచింపజేస్తుంది. పిల్లల జీవితంలో క్రమశిక్షణ పేరుతో వారి స్వేచ్ఛను, సహజమైన ఎదుగుదలను, భావోద్వేగ అవసరాలను అణచివేయకూడదు. నేటి రెసిడెన్షియల్ పాఠశాలల్లోని పిల్లల జీవితాలను కూడా ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రతి రాత్రి పడుకునే ముందు తన తల్లిదండ్రుల ఫొటోను చిన్న పడక పక్కనున్న డ్రాయర్లో దాచుకుని, దాన్ని ముద్దుపెట్టుకుని నిద్రపోయేదానని సోనియా రాయడం ఎంతో హృదయాన్ని కదిలిస్తుంది. ఇది కేవలం సోనియా బాల్య అనుభవం మాత్రమే కాదు. కుటుంబాలకు దూరంగా హాస్టళ్లలో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉండే లక్షలాది మంది పిల్లల అనుభవం కూడా ఇదే. నేటికీ అనేకమంది పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం వల్ల ఒంటరితనాన్ని, ఇంటి మీద బెంగను అనుభవిస్తున్నారు. పిల్లల విద్య గురించి ఆలోచించేటప్పుడు వారి భావోద్వేగ అవసరాలను కూడా అంతే ప్రాధాన్యంతో గుర్తించాలి.
బాల్యానికి సరిహద్దులు లేవు
సోనియా తన బాల్యం గురించి రాసిన ఈ అధ్యాయాలను చదివిన తరువాత మనసులో ఒక ప్రత్యేకమైన అనుభూతి మిగులుతుంది. నేను ఇటలీలోని ఒక బాల్యం గురించి చదువుతున్నాను. కానీ నా ఆలోచనలు మాత్రం మన స్వంత గ్రామాల్లోని బాల్య జ్ఞాపకాల చుట్టూ తిరిగాయి. కష్టపడి పనిచేసే తల్లిదండ్రులు, కుటుంబంలో తండ్రి అధికారం, తల్లి ఆప్యాయత, పిల్లల కుతూహలం, తాతయ్యల ప్రేమ, పొరుగువారితో స్నేహాలు, పండుగలు, కొత్త పుస్తకాలు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, చిన్ననాటి అల్లరి, ఇంటికి దూరమవడంలోని బాధ – ఇవన్నీ మనకు ఎంతో పరిచయమైన అనుభవాలుగా అనిపించాయి.
ఇటలీ, భారతదేశాలకు వాటి స్వంత చరిత్రలు, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఒకేలా చూడలేం. అయినప్పటికీ, ఈ భిన్నత్వాల వెనుక సాధారణ కుటుంబ జీవితంలోనూ, బాల్యాన్ని మలిచే అనుభవాల్లోనూ ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి. బహుశా బాల్యం సార్వజనీనమైనది అనడానికి ఇదే కారణం. ప్రపంచంలో ఎక్కడైనా పిల్లలు ప్రేమను, స్నేహాన్ని, స్వేచ్ఛను, భరోసాను, తమదైన అనుబంధాన్ని కోరుకుంటారు. చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారు. సాధారణమైన సంఘటనల నుంచే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించుకుంటారు. తాము పెరిగిన ఇంటిని, ఊరిని వదిలి వెళ్లినా ఆ జ్ఞాపకాలను తమతోనే తీసుకెళ్తారు. సోనియా గాంధీ ‘Belonging’ పుస్తకాన్ని చదవడం ప్రారంభించినప్పుడు ఆమె జీవిత ప్రయాణాన్ని తెలుసుకోవాలనుకున్నాను. కానీ తన బాల్యం గురించి రాసిన ఈ అధ్యాయాలు మన స్వంత బాల్యంలోకి తీసుకెళ్లాయి.





