“2023లో ప్రజాతీర్పుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జాబ్ క్యాలెండర్ హామీ, కొన్ని పరీక్షల నిర్వహణతో కొంత కదలిక వచ్చినా, వ్యవస్థాగత లోపాలు పూర్తిగా తొలగిపోలేదు. ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీలో జాప్యం, శాశ్వత నియామకాల స్థానే కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం యువత శ్రమను దోచుకోవడమే అవుతోంది. మరోవైపు, ఆర్థిక విధానాలన్నీ కేవలం హైదరాబాద్ ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల చుట్టూనే కేంద్రీకృతం కావడం వల్ల ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగలేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల (MSME) విస్తరణపై దృష్టి సారించకపోవడంతో చదువుకున్న యువతకు ప్రైవేటు రంగంలోనూ గౌరవప్రదమైన ఉపాధి కరువైంది..”
“నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో పాటు “సామాజిక తెలంగాణ” అనే ఉన్నత ఆశయంతో సాగిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు, నిరుద్యోగ యువతే ప్రాణవాయువుగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కాల్సిన ఉద్యోగాలు, అవకాశాలు దోపిడీకి గురవుతున్నాయన్న ఆవేదనతో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులు పోలీసు తూటాలకు ఎదురొడ్డి పోరాడారు. వందలాది మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. స్వరాష్ట్రం సిద్ధించి పన్నెండేళ్లు దాటిన నేటి తరుణంలో, ఆ ఉద్యమ ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయని ప్రశ్నించుకుంటే నిరుద్యోగ యువత కళ్లలో నిరాశే మిగులుతోంది. భౌగోళిక తెలంగాణ ఏర్పడినప్పటికీ, పాలకులు మారినప్పటికీ యువత భవిష్యత్తుకు భరోసా, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం నేటికీ అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి.
నియామకాల నిర్లక్ష్యం – కోచింగ్ సెంటర్లలో కరిగిపోతున్న యవ్వనం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, తమ కుటుంబాల తలరాతలు మారుతాయని గ్రామీణ పేద, మధ్యతరగతి యువత ఎన్నో కలలు కన్నది. కానీ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పదేళ్ల పాటు సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం యువత ఆశలపై నీళ్లు చల్లింది. ఎప్పుడో ఒకసారి వెలువడిన నోటిఫికేషన్లు సైతం ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామక బోర్డుల నిర్లక్ష్యం, న్యాయవివాదాల సుడిగుండంలో చిక్కుకుని ఏళ్ల తరబడి సాగాయి. హైదరాబాద్ అశోక్ నగర్, చిక్కడపల్లి వీధుల్లో అప్పులు చేసి కోచింగ్ తీసుకుంటూ, వయోపరిమితి దాటిపోతున్న వేలాది మంది నిరుద్యోగుల ఆక్రందన పాలకుల చెవికెక్కలేదు. అప్పులు చేసి చదువుకున్న పట్టభద్రులు, పీజీలు చేసిన యువతీయువకులు ఉపాధి లేక గిగ్ వర్కర్లుగా, దినసరి కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడింది.
నిరుద్యోగ భృతి హామీలు కాగితాలకే పరిమితం కావడం యువతలో తీవ్ర మానసిక వేదనకు, ఆత్మహత్యలకు దారితీస్తోంది. 2023లో ప్రజాతీర్పుతో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జాబ్ క్యాలెండర్ హామీ, కొన్ని పరీక్షల నిర్వహణతో కొంత కదలిక వచ్చినా, వ్యవస్థాగత లోపాలు పూర్తిగా తొలగిపోలేదు. ఖాలీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీలో ఆలస్యం ,శాశ్వత నియామకాల స్థానే కాంట్రాక్టు , ఔట్సోర్సింగ్ విధానాలను ప్రోత్సహించడం యువత శ్రమను దోచుకోవడమే అవుతోంది. మరోవైపు, ఆర్థిక విధానాలన్నీ కేవలం హైదరాబాద్ ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల చుట్టూనే కేంద్రీకృతం కావడం వల్ల ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగలేదు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, చిన్న-మధ్యతరహా పరిశ్రమల (MSME) విస్తరణపై దృష్టి సారించకపోవడంతో చదువుకున్న యువతకు ప్రైవేటు రంగంలోనూ గౌరవప్రదమైన ఉపాధి కరువైంది.
సామాజిక తెలంగాణ ఎక్కడ?
తెలంగాణ ఉద్యమం కేవలం భౌగోళిక విభజన కోసం జరిగిన పోరాటం కాదు. తరతరాలుగా అధికారానికి, వనరులకు దూరమైన దళితులు, గిరిజనులు, బహుజనులు, మైనారిటీలు, మహిళలకు రాజ్యాధికారంలో మరియు ఆర్థిక వనరుల్లో సముచిత వాటా దక్కాలన్నదే ‘సామాజిక తెలంగాణ’ మౌలిక సూత్రం. కానీ రాష్ట్ర సాధన తర్వాత రాజకీయ అధికారం తిరిగి ఆధిపత్య సామాజిక వర్గాల చేతుల్లోనే కేంద్రీకృతమైంది. జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో తగిన ప్రాతినిధ్యం దక్కకపోవడం, ఎస్సీ-ఎస్టీ ఉపప్రణాళిక నిధుల మళ్లింపు సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేస్తోంది. కులగణన, వర్గీకరణ వంటి కీలక సామాజిక అంశాలపై దశాబ్ద కాలంగా సాగిన కాలయాపన ఆయా వర్గాల అభ్యున్నతిని అడ్డుకుంది. మహిళలకు చట్టసభల్లో, పాలనా నిర్ణయాల్లో సముచిత స్థానం కల్పించకపోవడం లింగ సమానత్వ ఆశయాన్ని నీరుగారుస్తోంది. అభివృద్ధి ఫలాలు కొద్దిమంది చేతుల్లోనే పోగుపడటం అసమానతలను మరింత పెంచుతోంది.
అన్నింటికంటే ప్రమాదకరమైన పరిణామం ప్రభుత్వ రంగం కుంచించుకుపోవడం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని ఆలస్యం చేయడం, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయకుండా నిర్వీర్యం చేయడం, విద్య-వైద్య రంగాలను ప్రైవేటుపరం చేయడం ద్వారా పాలకులు పరోక్షంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ఫలాలను అణగారిన వర్గాలకు అందకుండా చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో నియామకాలు లేనప్పుడు రిజర్వేషన్లు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై చిత్తశుద్ధి లేకపోవడం బడుగు బలహీన వర్గాల యువతను ఆర్థికంగా, సామాజికంగా మరింత వెనక్కి నెడుతోంది.
పాలకుల జవాబుదారీతనమే అసలైన పరిష్కారం
నిరుద్యోగ యువత ఆశయాలను, సామాజిక న్యాయాన్ని కాపాడాలంటే ప్రభుత్వాలు తక్షణమే తమ విధానాలను మార్చుకోవాలి. ఉద్యోగ నియామకాలను ఎన్నికల హామీలుగానో, సంక్షేమ తాయిలాలుగానో కాకుండా యువత రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తించాలి. నియామక బోర్డులకు పూర్తి స్వయంప్రతిపత్తి కల్పించి, ఎలాంటి లీకేజీలు, కోర్టు చిక్కులు లేకుండా పారదర్శకంగా వార్షిక నియామకాలను పూర్తి చేయాలి. అదే సమయంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా పరిశ్రమల వికేంద్రీకరణ జరగాలి. తెలంగాణ గడ్డపై ప్రవహించిన అమరవీరుల రక్తం కేవలం కొద్దిమంది రాజకీయ కుటుంబాల ఎదుగుదల కోసమో, కార్పొరేట్ శక్తుల లాభాల కోసమో కాదు. అట్టడుగు వర్గాల యువతకు ఆత్మగౌరవంతో కూడిన ఉపాధి, నిర్ణయాధికారంలో సమాన భాగస్వామ్యం దక్కినప్పుడే అమరులు కలలుగన్న సామాజిక తెలంగాణ సాకారమవుతుంది. యువత నిట్టూర్పుల మీద ఏ ప్రభుత్వమూ స్థిరంగా నిలబడలేదన్న చారిత్రక సత్యాన్ని పాలకులు ఇప్పటికైనా గుర్తించాలి.
జుట్టు మహిపాల్





